కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతోన్న సమయంలో… నివేదికను సమర్పించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఇవాళ విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరుకాగా.. ప్రస్తుతం అమలవుతోన్న లాక్‌డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి.. హైకోర్టుకు నివేదిక అందజేశారు.. కరోనా నేపథ్యంలో కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. ఇక, బ్లాక్ మార్కెట్‌లో ఔషధల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని తెలిపిన డీజీపీ.. ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు.
మరోవైపు.. లాక్‌డౌన్ ను పకడ్బందిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని… మాస్కులు ధరించనివారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని.. వారిపై మొత్తం రూ.31 కోట్ల జరిమానా విధించామని వివరించారు. ఇక, భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశామని, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు పెట్టామని వివరించారు. అయితే, లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, గతంలో పలు సందర్భాల్లో కోవిడ్ విషయంలో తెలంగాణ హైకోర్టు.. సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.