వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతోంది. కేవలం 100 MB లోపు ఫైల్స్‌ను మాత్రమే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇతర మెసెజింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2GB వరకు సైజ్ కలిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే ఓ సినిమా మొత్తం పంపించుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. తాజాగా ఈ ఫీచర్‌ను ఇతర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, IOS యూజర్లు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. కాకపోతే ఇది ఒకేసారి అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన యూజర్లకు త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ సదుపాయం మీకు అందుబాటులోకి వచ్చిందో రాలేదో తెలుసుకోవాలంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.. ఆ తర్వాత ఏదైనా ఓ కాంటాక్ట్ నంబర్‌కు 100 MB కంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ అయితే మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టే. ఒకవేళ అప్‌లోడింగ్ ఫెయిలైతే.. ఈ ఫీచర్ కోసం మీరు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.