వాట్సప్… ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే దాదాపు 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ వినియోగదారులను దోచుకునేందుకు కొత్తకొత్త స్కాంలు బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరీ.
భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్ అయింది. కొన్నాళ్ల క్రితం వాట్సప్ పేమెంట్స్ పేరుతో వాట్సప్‌లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం అయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు వాట్సప్ యూజర్లను దోచేస్తున్నారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఆ కోడ్ పంపించి వాట్సప్ యూజర్ల ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలను వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్ అని పిలుస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? మీరు మోసపోకుండా ఏం చేయాలి? తెలుసుకోండి.
ఇంటర్నెట్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ప్లాట్‌ఫాంలో ప్రొడక్ట్స్‌ని పోస్ట్ చేసేవారిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీరు పోస్ట్ చేసిన ప్రొడక్ట్ తమకు నచ్చిందని, తాము కొంటామని మాటలు కలుపుతారు. బేరం కుదుర్చుకుంటారు. వాట్సప్ ద్వారా పేమెంట్ చేస్తామని నమ్మిస్తారు. మోసగాళ్లు తమ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేసి, ఆ కోడ్ స్కాన్ చేస్తే అడ్వాన్స్ పేమెంట్ వస్తుందని నమ్మిస్తారు. యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పిన్ ఎంటర్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. డబ్బులు స్వీకరించడానికి యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. తమ క్యూఆర్ కోడ్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మోసపోతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి.
మీరు ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే వారి క్యూఆర్ కోడ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు డబ్బులు పొందాలనుకుంటే మీ క్యూఆర్ కోడ్ షేర్ చేయాలి. అంతే తప్ప మీరు డబ్బులు స్వీకరించడానికి ఇతరులు పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరి నుంచైనా డబ్బులు రావాల్సి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి క్యూఆర్ కోడ్ వస్తే పట్టించుకోకూడదు. ఆ క్యూఆర్ కోడ్ అస్సలు స్కాన్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటే అమౌంట్ కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం. ఒకవేళ మీరు మోసపోయినట్టైతే సైబర్ క్రైం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు.