కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం పరీక్షలు, తవ్వకాలపై కీలక ప్రకటన చేశారు కలెక్టర్ రంజిత్ బాషా.. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు.. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు.. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కలెక్టర్ రంజిత్ బాషా..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కప్పట్రాళ్ల వద్ద యురేనియం కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు.. పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియంపై టీడీపీ, సీపీఐ కలసి వ్యతిరేకించాం.. కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు యురేనియం తవ్వకలుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు..
కర్నూలు జిల్లాను మరోసారి యురేనియం భయం పట్టుకుంది. గతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా.. స్థానికుల ఆందోళనతో పనులు నిలిపేశారు. తాజాగా, కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాలు నిర్ధారణ కోసం తవ్వకాలకు అనుమతి లభించిందన్న సమాచారంతో స్థానికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సమాచారం.