Uranium Mining: కర్నూలు జిల్లాను మరోసారి యురేనియం భయం పట్టుకుంది. గతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా.. స్థానికుల ఆందోళనతో పనులు నిలిపేశారు. తాజాగా, కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాలు నిర్ధారణ కోసం తవ్వకాలకు అనుమతి లభించిందన్న సమాచారంతో స్థానికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో 6.8 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదం లభిస్తే.. తవ్వకాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. యురేనియం తవ్వకాల ప్రతిపాదనలపై గతంలోనే కప్పట్రాళ్ల వాసుల వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాజాగా మళ్లీ ఆ ప్రతిపాదనలు తెరపైకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Prashant Varma : జై హనుమాన్ ను వదలుకున్న స్టార్ హీరో..!
అయితే, అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే యురేనియం పేరు చెబితే ఇప్పుడు మరోసారి కర్నూలులోని పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు సర్వే కోసం బోర్ల తవ్వకాలకు అనుమతులు వచ్చాయనే సమాచారం.. వారి ఆందోళనకు కారణంగా మారింది.. కాగా, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, మహానంది, రుద్రవరం మండలాల్లోని అడవుల్లో యురేనియం అన్వేషణ కోసం గతంలోనే ప్రయత్నాలు సాగాయి.. 2019లో బోర్లు వేసేందుకు ప్రయత్నిస్తే.. అప్పట్లో స్థానికులు అడ్డుతగిలారు.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వరంలో ఓబులంపల్లెలో అఖిలపక్ష పార్టీల సమావేశాలుపెట్టి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, యురేనియం తవ్వకాలతో నష్టం తప్పదనే వాదన బలంగా ఉంది.. యురేనియం నిల్వలు అంచనా వేసేందుకు జరిపే తవ్వకాల వల్ల కప్పట్రాళ్ల అటవీ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు.. భూగర్భ జలాలు, తాగునీరు విషతుల్యం అవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అరుదైన జీవరాసులతో పాటు వృక్షసంపద ప్రమాదంలోపడి జీవవైవిధ్యం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి..