రైతు బంధును అనుమతిని ఎన్నికల కమిషన్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ్ రావు స్పందించారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. ఇది ఏ పార్టీలకు సంబంధించినది కాదు అని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అని నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా - అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్‌కు ఆయన చేరుకోనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు భువనగిరి, గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయబోతున్నారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేస్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్‌లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు.