ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయనుంది న్యాయస్థానం. అయితే, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొదట మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.
ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు.
టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా, చంద్రబాబును అడుగుతున్నానని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు.
కృష్ణాజిల్లా గుడివాడలోని 15వ వార్డులో రూ. 3కోట్ల 28లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
విశాఖ రావాలన్న సీఎం నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి విశాఖకు వస్తుంటే ఎందుకు అభ్యంతరమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పాలన్నారు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చన్నారు.
నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.