నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమరావతికి తిరిగి రానున్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు. బాబు వస్తుండటంతో గన్నవరం విమానాశ్రయానికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తన నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక, సాయంత్రం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టే విషయమై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, రేపు విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు.
Read Also: Karthika Friday: ఈ స్తోత్రాలు వింటే సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే, రేపు (డిసెంబర్ 2న ) అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ముందుగా 3వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అనుకున్నారు.. కానీ, ఆ రోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో రేపు ఈ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో సీఈసీ, ఎలక్షన్ కమిషనర్ల నియామకాల బిల్లుతో పాటు ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో నిర్దేశించిన మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.