బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. రేపు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు.
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏపీలో మరో బస్సు ప్రమాదం తప్పింది. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి (మం) బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. వంతెన పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ.,పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ , దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోని పొలాల వద్ద పుట్టగొడుగుల కోసం వెళ్లిన నేపథ్యంలో పాము కరిచినట్లు సమాచారం.
ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.