కాంగ్రెస్ లో అయోమయం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారైనా.. పోటీచేసేది ఎవరు.. ఎన్నికయ్యేదెవరనే అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓవైపు పీసీసీలు రాహుల్ పై ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు శశి థరూర్, అశోక గెహ్లాట్ పేర్లు కూడా వినిపిస్తుండటం.. గందరగోళంగా మారింది. అసలు కాంగ్రెస్ అధిష్ఠానానికైనా క్లారిటీ ఉందా..? అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తోందా..?
రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సిద్ధమవుతోంది. ఓవైపు అధ్యక్ష పదవికి పోటీ చేసే ఉద్దేశం ఉందని శశిథరూర్ పేర్కొనడం, మరోవైపు అశోక్ గహ్లోత్ వంటి సీనియర్ నేతలు పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మరింత మంది పోటీలో నిలబడే సూచనలు కనిపిస్తుండడంతో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా అనివార్యంగా కనిపిస్తోంది. అయితే చివరకు రాహుల్ కే అధ్యక్ష పదవి కట్టబెడతారనే వాదన కూడా వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సోనియా కుటుంబాన్ని కీర్తిస్తూ, గాంధీ కుటుంబం పట్ల విధేయత ప్రకటిస్తూ.. జన రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా మనగలుగుతున్న నేతలకు.. కాంగ్రెస్‌ను కేవలం గాంధీ కుటుంబ ఆస్తిగా మాత్రమే కాకుండా ఒక పార్టీగా కూడా చూస్తున్న తిరుగుబాటు రాజకీయ నాయకులకు మధ్య ఇప్పుడు పోరాటం జరగబోతోంది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్‌పధ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి శశి థరూర్ పోటీ చేస్తారనే సంకేతాలు వెల్లడైనా ఆయన బాహాటంగా అధ్యక్ష పదవి రేసులో వెల్లడించలేదు. శశి థరూర్ పార్టీలో అసంతృప్త నేతలుగా గుర్తింపు పొందిన జీ23 నేతలతో లేకున్నా పార్టీలో సంస్కరణలకు అనుకూలంగా చాలాసార్లు మాట్లాడారు. పార్టీని సంస్ధాగతంగా ప్రక్షాళన చేయాలని అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని జీ23 నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్ 2000లో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన జితేంద్ర ప్రసాద.. సోనియా గాంధీ చేతిలో ఓటమిపాలయ్యారు. అంతకుముందు 1997లో జరిగిన ఎన్నికల్లో శరద్ పవార్, రాజేష్ పైలట్‌లను సీతారాం కేసరి ఓడించారు. అనంతరం 1998 నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో సోనియా గాంధీనే కొనసాగుతున్నారు. 2017-19 మినహా ఆ పదవిని సుదీర్ఘకాలంపాటు చేపట్టిన వ్యక్తిగా సోనియా గుర్తింపు పొందారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యంగా కనిపిస్తుండడంతో అధ్యక్ష బాధ్యతలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనే విషయంపై ఆసక్తి నెలకొంది.
పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను తటస్థంగా వ్యవహరిస్తానని, ఎక్కువమంది పోటీ చేయడాన్ని ఆహ్వానిస్తానని సోనియా గాంధీ చెబుతున్నారు. శశిథరూర్‌తో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరైనా పోటీపడవచ్చని, పార్టీ తరపున ఎవరి సమ్మతి అవసరం లేదంటూ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆయన ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబేతర వ్యక్తి అధినేత అయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధ్యక్ష పోటీపై తనకు ఆసక్తి ఉందని శశిథరూర్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని స్పష్టం చేయగా.. ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఐతే గహ్లోత్ మాత్రం.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేలా రాహుల్ గాంధీని ఒప్పించడమే తన మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు. ఐతే, పార్టీ పగ్గాలు అశోక్ గహ్లోత్‌కు అప్పజెప్పేందుకు అధిష్ఠానం సిద్ధంగానే ఉన్నప్పటికీ.. ఒకవేళ అది చేపడితే రాజస్థాన్ సీఎం పదవికి దూరం కావాల్సి వస్తుంది. దీంతో రాజస్థాన్ సీఎం పగ్గాలు తన ప్రత్యర్థి సచిన్ పైలట్ చేతిలోకి వెళ్లిపోతాయని గహ్లోత్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో దేశరాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నిర్వహణ బాధ్యతలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 24వ తేదీ నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అక్టోబర్ 8 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే.. షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 17న జరుగుతుంది. అక్టోబర్ 19న లెక్కింపు, ఫలితం వెలువడనుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తుండటంతో గాంధీయేతర నేత బరిలో దిగే అవకాశాలపై చర్చ ఉత్కంఠభరితంగా జరుగుతోంది. పార్టీని ప్రక్షాళన చేయాలని, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అయితే అధిష్ఠాన వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఈ పదవిని అప్పగించడంపై దృష్టిసారించిందని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనప్పటికీ, అందరూ దృష్టి సారించే నేతగా సోనియా గాంధీ కొనసాగుతారని, అదేవిధంగా రాహుల్ గాంధీ సైద్ధాంతిక దిక్సూచిగా ఉంటారని జైరాం రమేష్ ఇప్పటికే చెప్పారు. అధిష్ఠాన వర్గం సంస్కృతిని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు జైరామ్ రమేశ్ స్పందిస్తూ, అధిష్ఠాన వర్గం లేని పార్టీ అరాచకమవుతుందన్నారు.
కాంగ్రెస్‌లోని మరికొందరు నేతలు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబ సభ్యులు కానీ, ఇతరులు కానీ ఎన్నికల్లో నిలబడినప్పటికీ, తాము కూడా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఒకరు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి తీరాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్ అధిష్టాన వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గెహ్లాట్ వ్యవస్థలో చురుగ్గా వ్యవహరించగలరని, ఆయన కులం కూడా పార్టీకి కలిసి వస్తుందని, కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నత స్థాయి హుందాతనంగల నేత అని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గెహ్లాట్ కూడా ఆ పదవిని చేపట్టేందుకు సుముఖంగానే కనిపిస్తున్నారు. పైకి చెప్పకపోయినా లోలోపల సంతోషిస్తూ, తన వారసుని ఎంపికపై దృష్టి పెట్టారని సమాచారం. ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్ష పదవిని ఏక కాలంలో నిర్వహించడానికి వీలుండదు కాబట్టి, ఈ నెల 24 నుంచి 30 మధ్యలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తే, ముఖ్యమంత్రి పదవిని ఆయన వదులుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. అధ్యక్ష పదవికి పోటీ ఉంటే, అభ్యర్థులు ప్రదేశ్ కాంగ్రెస్ డెలిగేట్స్‌ను ప్రభావితం చేయగలిగే అధికార పదవుల్లో ఉండకూడదు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించవలసి ఉంటుంది.
సోనియా గాంధీతో ఆగస్టు 23న అశోక్ గెహ్లాట్ సమావేశమయ్యారు. తన పరిధిలోని అంశాల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని సోనియా ఆయనకు చెప్పినట్లు తెలిసింది. ఆయన కుమారుడు వైభవ్‌కు కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తామని, గెహ్లాట్‌కు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో 9 వేల మందికి పైగా రాష్ట్ర ఏఐసిసి ప్రతినిధులకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డులను జారీ చేయాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ నిర్ణయించింది. ఈ ప్రతినిధులందరూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు.
రాహుల్ గాంధీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. రాహుల్ గాంధీ తన నిర్ణయాలను చాలా స్పష్టంగా చెప్పారే తప్ప, తన ప్రణాళిక గురించి ఇప్పటి వరకు ఎలాంటి సూచన ఇవ్వలేదు. తాను అధ్యక్షుడిని అవుతానా కాదా అనేది అధ్యక్షుడిని ఎన్నుకున్నప్పుడు స్పష్టమవుతుందని తెలిపారు. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలని.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే, అప్పుడు దీనిపై సమాధానం చెబుతానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైన వేళ ఎవరెవరు పోటీలో ఉండనున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. గాంధీయేతర కుటుంబం నుంచి పేర్లు వినబడుతుండటమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగేందుకు శశిథరూర్ యోచిస్తున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వనప్పటికీ.. పార్టీలో ఎన్నికలు నిర్వహించడం మాత్రం మంచి పరిణామమని వెల్లడించారు. థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్, అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరగాలని శశిథరూర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెండు ప్రధాన విషయాలను ప్రస్తావించిన ఆయన.. ఎవరు ఎన్నికైనా పార్టీ రూపురేఖలు మార్చేందుకు వారివద్ద ప్రణాళిక సిద్ధంగా ఉంచుకోవడంతోపాటు దేశానికి సంబంధించిన విజన్ కూడా ఉండాలన్నారు. నూతన సారథి ఎన్నికతోనే పార్టీలో ప్రక్షాళన మొదలుకావాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన గెహ్లోత్.. అధ్యక్ష పదవి చేపట్టాలని రాహుల్‌ను ఒప్పిస్తామన్నారు. సోనియాగాంధీతో కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ‌్యక్ష ఎన్నికల్లో పోటీ కోసమే ఆయన భేటీ అయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల్లో తటస్థంగా ఉంటానని ఎక్కువమంది పోటీ చేయడాన్ని ఆహ్వానిస్తానని సోనియా చెప్పినట్లు హస్తం శ్రేణులు తెలిపాయి.
అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరుగుతాయని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. బరిలో ఉండటానికి ఎవరి ఆమోదం పొందాల్సిన అవసరం లేదని తెలిపింది. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ కృషిచేస్తోందని.. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువమంది పోటీ చేస్తే స్వాగతిస్తామని ప్రకటించింది.
ఐతే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేరు. కానీ ఆయన్ను ఒప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ తీసుకుంటేనే బాగుటుందని కార్యకర్తలు చెబుతున్నారని.. అంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ.. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచీ ఏఐసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్ సారథి బాధ్యతలను చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి ఈ ముగ్గురూ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకుంటే.. ఆ పదవిని ఎవరు చేపడతారన్న దానిపై కాంగ్రెస్‌లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కాగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నేతల వరుస రాజీనామాలతో కేడర్‌లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహంచి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
వాతావరణం ఇలా ఉండగా.. భారత్ జోడో నినాదంతో దేశమంతా పాదయాత్ర సాగిస్తున్న రాహుల్ అధ్యక్ష పదవిపై కిమ్మనడం లేదు. అయితే సోనియా కుటుంబ వీరవిధేయులు మాత్రం ఆ స్థానంలోకి రాహుల్ రావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల పిసిసి కమిటీలు రాహుల్ మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని ఆయన ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలని తీర్మానాలు చేసే పంపడం ఒక ప్రహసనం లాగా కనిపిస్తోంది.
చూడబోతే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించడానికి బరిలో ఉన్న నాయకులు ఇద్దరూ విధేయ తిరుగుబాటు వర్గాలకు చెందినవారు. నీవే తప్ప ఇతః పరంబెరుగ అని అందరూ మరోవైపు రాహుల్ ను కీర్తిస్తున్నారు. సోనియా మొగ్గు గహ్లోత్ వైపుంటారని ప్రచారం జరిగింది. శశిథరూర్ పాదయాత్రలో రాహుల్ ను కలిసి, తాజాగా సోనియాను కలిసి అధ్యక్ష పదవికి పోటీపై తన ఆసక్తి వెలిబుచ్చారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కునారిల్లుతోంది. ఏ రకంగా ఆ పార్టీ భవిష్యత్ ప్రస్థానం సాగుతుందో వేచి చూడాలి. ఇంత అయోమయం మధ్య అసలు అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయనేది చూడాల్సి ఉంది.
అధ్యక్ష ఎన్నికలతో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ కు తెరపడుతుందనుకుంటే.. కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో కొత్త గ్రూపులు పుట్టుకొస్తాయేమోననే అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అయితే ఇదంతా డ్రామా మాత్రమేనని. లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి.. అంతిమంగా రాహుల్ కే కిరీటం పెడతారనే వాదన కూడా వినిపిస్తోంది.
కాంగ్రెస్ ను గాంధీ కుటుంబం తప్ప.. ఇతరులు నడపలేరనే వాదన చాలా కాలంగా ఉంది. గతంలో గాంధీ కుటుంబేతరులు అధ్యక్షులైనా.. పెద్దగా సక్సెస్ కాలేదు. గాంధీ కుటుంబం చేతిలో పగ్గాలుంటేనే.. పార్టీ ఒక్కతాటిపైకి వస్తుందని కార్యకర్తల నమ్మకం. అయితే కొంతకాలంగా ఈ నమ్మకానికి తూట్లు పడ్డా.. ఇతరుల కంటే రాహుల్ చాలా బెటర్ అనే అభిప్రాయం అయితే ఇంకా పోలేదు. ప్రస్తుతం అధ్యక్ష బరిలో దిగాలని ఉత్సాహంగా ఉన్న గెహ్లాట్.. థరూర్ ఎవరూ సమర్థులు కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. గెహ్లాట్ ఇప్పటికే వృద్దులైపోయారని, థరూర్ కు డ్రాఫ్టింగ్ స్కిల్సే తప్ప నాయకత్వ లక్షణాలు లేవనేది కాంగ్రెస్ వర్గాల టాక్.
పార్టీలో గాంధీ కుటుంబం ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోందని జీ-23 నేతలు గళమెత్తడం, కొందరు సీనియర్లు రాజీనామా చేయడం ఇబ్బందికరంగా మారింది. ఈ సాకుతో బీజేపీ కూడా గాంధీ కుటుంబాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. దీంతో పదవుల కోసం తాము పాకులాడటం లేదని నిరూపించుకోవాలని గాంధీ కుటుంబం ఫిక్సైంది. ఎవరైనా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడొచ్చనే ప్రకటన కూడా వ్యూహంలో భాగమే అనుకోవాలి. తీరా ఎన్నికలు పెట్టేసరికి.. పేరు గొప్ప నేతలెవరూ నిలబడటానికి ముందుకు రావడం లేదు. వచ్చిన ఇద్దరు నేతలు రాహుల్ కంటే ఏ విషయంలో సమర్థులనే చర్చ వస్తుంది. అందుకే ఇప్పటికే మెజార్టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ రాగం అందుకున్నారు. రాహుల్ మాత్రం ఎప్పటిలాగే ఔనని.. కాదని చెప్పకుండా దాటవేస్తున్నారు.
జరుగుతున్న తంతు చూస్తుంటే.. చివరకు రాహుల్ గాంధీయే అధ్యక్షుడౌతారనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేకపోతే.. రాహుల్ సడెన్ గా పాదయాత్ర మొదలుపెట్టరనే వాదన ఉంది. పార్టీలో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టేలా.. రాహుల్ తప్ప వేరే దిక్కు లేదని సీనియర్లతో స్టేట్ మెంట్లు ఇప్పించి.. అందర్నీ సైలంట్ చేయాలనేది హైకమాండ్ ఐడియాగా ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీని నడపటం ఆషామాషీ వ్యవహారం కాదు. లోపాలు ఎవరైనా ఎత్తి చూపించొచ్చు. కానీ బాధ్యతలు తీసుకున్నప్పుడే అసలు విషయం అర్థమౌతుంది. సీనియర్ నేతలు కూడా సీఎంలుగా సహచరుల్ని తృప్తిపరచలేక.. ఢిల్లీ టూర్లు చేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పంచాయితీలు అధిష్ఠానం తీర్చాల్సిందే. ఇలాంటి కల్చర్ ఉన్న పార్టీలో గాంధీయేతరులు అధ్యక్షులుగా విజయవంతం కాలేరనే అభిప్రాయం కలిగించాడనికే ఎన్నికల పేరుతో హడావుడి చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
నిజానికి రాహుల్ పాదయాత్ర ఆలోచన ఎప్పట్నుంచో కార్యకర్తల నుంచి ఉంది. అయిత రాహుల్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొద్ది రోజులకే పాదయాత్ర మొదలైంది. అయితే రాహుల్ అధ్యక్షుడు కాదలుచుకుంటే.. అడ్డుకునేవారు ఎవరూ లేరనే మాట నిజం. జీ-23 నేతలు కూడా మొదట రాహుల్ నే అధ్యక్షుడిగా ఉండాలని అడిగారు. అందుకోసం పాదయాత్ర ఎందుకు చేస్తారనే ప్రశ్నలు కూడా సమంజసమే. అయితే తానేం చేసినా.. కార్యకర్తల నుంచి సీనియర్ల వరకూ అందరూ మద్దతివ్వాలంటే.. మోరల్ గా గుడ్ స్కోర్ చేయాలని రాహుల్ భావించే అవకాశం ఉంది. అందుకే పాదయాత్ర మొదలుపెట్టారని చెబుతున్నారు. ఈ వాదనలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. పాదయాత్ర మొదలయ్యాక కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదే ఊపులో రాహుల్ అధ్యక్షుడైతే తిరుగుండదనే అభిప్రాయం వినిపిస్తోంది.
గతంలో సోనియా రాకను తీవ్రంగా వ్యతిరేకించిన నేతలే.. చివరకు గతిలేక ఆమెను పార్టీలోకి ఆహ్వానించాల్సి వచ్చింది. ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా ఆయన్ను విమర్శంచిన వాళ్లు కూడా సుముఖత చూపక తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ అవకాశం ఉన్నా పదవులు తీసుకోలేదనే మాట వాస్తవం. రాహుల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్లు అనడమే కానీ.. క్యాడర్లో ఆ అభిప్రాయం ఉందా అంటే అనుమానమే. పార్టీపై రాళ్లేస్తున్న నేతలెవరూ పార్టీ బలోపేతానికి ఏమీ చేయలేదు. అదే సమయంలో అన్ని నిందలు మోస్తూ కూడా రాహుల్ పార్టీ పునరుజ్జీవం కోసం పాదయాత్రకు పూనుకున్నారనే భావన క్యాడర్లో కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇవన్నీ పార్టీపై గాంధీ కుటుంబం పట్టుకు ఉపయోగపడతాయని, ఫైనల్ గా రాహుల్ అధ్యక్షులౌతారని అంచనా. ఒకవేళ ఎవరైనా పోటీగా నిలబడ్డా.. నామమాత్రం ఓట్లే వస్తాయని కూడా అంటున్నారు.