మూడు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో.. కొందరు నేతలు మళ్లీ చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వనగరంలో అశాంతి రేపడానికి వెనుకాడటం లేదు. హైటెక్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాదీలందరిపైనా ఉంది.
హైదరాబాద్ లో కొద్ది రోజులుగా హైటెన్షన్ నెలకొంది. శాంతియుతంగా సహజీవనం చేస్తున్న ప్రజల మధ్య చిచ్చు రేపడానికి కొన్ని శక్తులు కంకణం కట్టుకున్నాయి. హైదరాబాద్ ప్రశాంతతను కాపాడటానికి చాన్నాళ్ల తర్వాత ఆంక్షలు విధించాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మతవిద్వేష వ్యాఖ్యలు చేయడం.. రెచ్చగొట్టడం.. ఆ తర్వాత నానా హంగామా చేయడం.. తద్వారా రాజకీయ లబ్ధి పొందడం.ఏదో విధంగా లాభపడాలనే పన్నాగం..నగర ప్రశాంత జీవనాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. తెలంగాణలో చిచ్చుపెట్టి రచ్చ చేయడమే ఎజెండాగా పనిచేస్తున్న కొందరు నేతల విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మహానగరంలో అన్ని మతాల వారు ప్రశాంతంగా మనగలిగే వాతావరణాన్ని తీర్చిదిద్దడంతో అనేక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని భగ్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు నానా యాగి చేస్తున్నారనే విమర్శలున్నాయి.
హైదరాబాద్.. గంగాజమునా తెహజీబ్. మతసామరస్యానికి ప్రతీక.. ఎనిమిదేళ్లుగా ఇక్కడ ఒక్క మత ఘర్షణ కూడా లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంతటి ప్రశాంత వాతావరణం కొందరికి నచ్చడం లేదు. సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వెనుకాడటం లేదు. భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు.. సమాజం అసహ్యించుకునేలా వ్యవహరించడం రాజకీయాలకే మచ్చలా తయారైంది.
హైదరాబాద్ లో ఓ కామెడీ షోను సాకుగా తీసుకుని.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఓ పథకం ప్రకారం వరుస పరిణామాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. కొందరు నేతలు తమ పైత్యపు వ్యాఖ్యలతో ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది.
హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను టెక్నాలజీ పరంగా ప్రభుత్వం ఆధునీకరించడంతో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పటిష్టమైన పెట్రోలింగ్‌తో బలమైన పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ నగరంలో ఉంది. సోషల్‌మీడియాను వేదికగా చేసుకుంటూ కొందరు ప్రజల మధ్య చిచ్చు పెట్టి అశాంతిని నెలకొల్పేందుకు పలు రకాలైన రెచ్చగొట్టే పోస్టులు వేస్తున్నారు. అలాంటి ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టింగ్‌లపై తరుచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై కేసులూ నమోదువుతున్నాయి. ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. తమ వైఫల్యాలను దాచిపెట్టి.. ప్రజల దృష్టి మళ్లించడానికి కొందరు నేతలు ఆడుతున్న డేంజరస్ గేమ్.. నగర ఇమేజ్ ను దెబ్బతీసే అవకాశం ఉంది. కేవలం విద్వేషం, వివాదాల మీదే ఆధారపడి రాజకీయం చేస్తున్న నేతల్ని దూరం పెట్టి.. మన హైదరాబాద్ ను మనమే కాపాడుకోవాలి. 400 ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్యనగరం.. కేవలం నలుగురు వ్యక్తుల కారణంగా.. నలుగురి నోళ్లలో నాని.. నవ్వులపాలయ్యే పరిస్థితి రాకూడదు. దశాబ్దాల తరబడి ఫోకస్ పెడితే కానీ.. హైదరాబాద్ ఇప్పుడున్న స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు.. విశ్వనగరం దిశగా దూసుకుపోతున్న నగరానికి మంచిది కాదు. నేతల నుంచి పరిణతి ఆశించడం అత్యాశే అని రుజువైంది. కాబట్టి ప్రజలే సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.
తాజా ఘర్షణలతో పాతబస్తీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కంప్యూటర్ యుగంలో పుట్టిన నేటి తరానికి అసలు ఇలాంటి సీన్లు పరిచయం కూడా లేదు. సోషల్ మీడియాలో కూడా స్వేచ్ఛ కావాలని కొట్లాడుతున్న రోజుల్లో.. మన నగరంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోవడం అందరికీ దురదృష్టకరం. ఎవరో ఏదో మాట్లాడగానే రెచ్చిపోవడం, అల్లర్లు చేయడం, రాళ్లు రువ్వడం లాంటి ఘటనలకు యువత దూరంగా ఉండాలి. నిన్నటి తరం చవిచూసిన చేదు అనుభవాలు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా శాంతి నెలకొల్పడం చాలా కష్టం. అశాంతి రేపడం చాలా తేలిక. కోటి మందికి పైగా వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల ప్రజలకు జీవికగా ఎదిగిన హైదరాబాద్ పై చేస్తున్న కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టాలి. తాము అభివృద్ధి, ఉద్యోగాలు, మౌలిక వసతులు లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలకే స్పందిస్తాం కానీ.. చిల్లర వేషాలకు స్పందించబోమనే సందేశం బలంగా వెళ్లాలి. అప్పుడే నోటిదురుసు నేతల నోటికి తాళం పడుతుంది.
దేశంలో 8 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అసలు మెట్రో కల్చర్ ఏంటో కనీస అవగాహన లేని నేతలు చేస్తున్న పనులు.. పరోక్షంగా కోట్ల మందిపై ప్రభావం చూపుతున్నాయి. మామూలు నగరాలకు లోకల్ గానే గుర్తింపు ఉంటుంది. కానీ మెట్రో నగరాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్ లో చీమ చిటుక్కుమన్నా.. అన్ని దేశాలకూ వార్త వెళ్లిపోతుంది. మెట్రో నగరంగా ఎదగడం కంటే.. ఆ ఇమేజ్ కాపాడుకోవడం చాలా కష్టం. ఈ కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్న నేతలు.. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నవతరం ప్రతిభతో వెలుగులీనతున్న హైదరాబాద్ ను.. తమ తప్పుడు పనులు, వ్యాఖ్యలతో భ్రష్టు పట్టిస్తున్నారు. నేతల రాజకీయం గల్లీలకే పరిమితం. కానీ హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తం. రాజకీయం కోసం దిగజారి చేస్తున్న వ్యాఖ్యలు, కుట్రపూరితంగా వేస్తున్న స్కెచ్ లు కొంపలు ముంచే ప్రమాదం ఉంది. వీటిని ఆదిలోనే అరికట్టి జాగ్రత్తపడకపోతే.. నగరం పరువు పోతుందని పౌరులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. గతంలో శాంతిభద్రతలు అదుపుతప్పినప్పుడు కూడా నగరం తన ఇమేజ్ పెంచుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా కొందరు నేతల పైత్యం.. భాగ్యనగరం భవిష్యత్తును నిర్ణయించలేదనే మాట నిజం. హైదరాబాద్ బ్రాండ్ చెడగొట్టాలనుకోవడం.. సూర్యుడిపై ఉమ్మి వేసినట్టే ఉంటుంది. నేతలు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని.. హైదరాబాద్ ప్రతిష్ఠకు భంగం కలగకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలే అలాంటి నేతల్ని నగర బహిష్కరణ చేయాల్సిన సందర్భం కూడా వస్తుంది.
హైదరాబాద్ ఆధునికత దిశగా వేగంగా పరుగులు తీస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే.. స్మార్ట్ యుగానికి తగ్గట్టుగా రూపు మార్చుకుంటోంది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న అనుకోని ఘటనలు.. నగరం పరువు తీసేలా ఉన్నాయి.
మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వేరు. ఇప్పుడు హైదరాబాద్ వేరు. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. కొత్త తరం కూడా గొడవలపై కాకుండా కెరీర్ పై దృష్టి పెట్టింది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చగా ఉన్న నగరంలో చిచ్చు పెట్టాలని చూడటం సిగ్గుచేటు. హైదరాబాద్ లో శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. షాన్ దార్ హైదరాబాద్ ను సాకారం చేయాల్సిన అవసరం ఉంది. గంగాజమునా తెహజీబ్ ను కాపాడుకోవాల్సిన సందర్భం ఇది. కొందరు ఉన్మాదుల ప్రేలాపనల ఉచ్చులో పడకుండా సంయమనం పాటించాల్సిన సమయం. హైదరాబాద్ పౌర స్పృహ గొప్పతనం ఏంటో చాటిచెప్పాల్సిన సమయం కూడా ఇదే.
ప్రపంచంలో ఏ సంస్కృతిని అయినా ఆహ్వానించి.. అక్కున చేర్చుకున్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ లో పౌరులు ఎంత విశాల హృదయులో.. కొందరు నేతలు చిల్లర పనులు చేసినా.. ఎలా తిప్పికొడతారో మరోసారి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఆరోపణలు ఓకే కానీ.. నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తే జన్మలో క్షమించబోమనే సంకేతాలు గట్టిగా పంపాల్సిన అవసరం ఉంది. ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉంది. కొందరు నేతల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా కుట్రలు చేస్తూపోతే.. చూస్తూ ఊరుకునేది లేదనే సందేశం వెళ్లాలి.
గ్రామం కోసం కుటుంబం, జిల్లా కోసం గ్రామం, రాష్ట్రం కోసం జిల్లా, దేశం కోసం రాష్ట్రం త్యాగం చేసినా తప్పులేదంటారు. అలాగే కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కొందరు నేతల్ని కూడా వదిలించుకోవాల్సిందే. నాయకుడంటే ప్రజల్ని నడిపించాలి కానీ.. వాళ్లకు లేని సమస్యలు తెచ్చిపెట్టకూడదు. గొడవలుంటే సర్దిచెప్పాల్సిందిపోయి.. శాంతియుత సహజీవనం చేస్తున్న ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూడటం క్షమించరాని నేరం.
హైదరాబాద్ లో వేలాదిగా కంపెనీలున్నాయి. కోట్లాది మందికి ఉద్యోగాలొస్తున్నాయి. కరోనా టైమ్ లో కూడా మిగతా మెట్రో నగరాల కంటే బెటర్ గా హైదారాబాద్ లో ఉద్యోగాలొచ్చాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్ లు హైదరాబాద్ లో నెలకొల్పాయి. ఇన్ని ప్రత్యేకతలున్న నగరంలో శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నీమధ్యే హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. ఓవైపు శాంతిభద్రతల కోసం ఇంత ప్రయత్నం జరుగుతోంటే.. మరోవైపు నేతలు నక్కజిత్తులతో విషపూరిత వాతావరణం కల్పించడం ఎవరూ సహించే పరిస్థితి ఉండకూడదు.
దేశంలో మరే మెట్రో నగరానికీ లేని ప్రత్యేక చరిత్ర హైదరాబాద్ సొంతం. గతంలో అయినా.. ఇప్పుడైనా హైదరాబాద్ ఎప్పుడూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వచ్చింది. ఈ ప్రత్యేకత కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాదీలందరిపైనా ఉంది. ఈ కాలంలో కూడా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే అలవాటు ఉండం మంచిది కాదు. నవీన యుగంలో మధ్యయుగాల నాటి సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే. ఒక వ్యక్తిని దెబ్బతీస్తే అతడి కుటుంబానికి నష్టం. కానీ హైదరాబాద్ లాంటి నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే.. అది కోట్ల మందికి నష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తపడాలి. అదుపుతప్పుతున్న నేతల్ని అదుపుచేయాలి. అసలు ఇలాంటి పనులు చేయాలనే ఆలోచన రావడానికే భయపడేలా బుద్ధి చెప్పాలి.
హైదరాబాద్ వేగవంతమైన అభివృద్ధికి తమ వంతు చేయూత అందించాల్సి నేతలు.. స్వార్థ రాజకీయల కోసం ఎంతకైనా దిగజారటం ఆవేదన కలిగిస్తోంది. హైదరాబాద్ లో కాస్మోపాలిటన్ కల్చర్ కు కూడా ఎసరు పెట్టేలా చేస్తున్న కుట్రల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పాలకులు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్థిరమైన అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ ను కొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేయటం ప్రమాదకరం. ఎక్కడైనా నగరాలే నాగరికతకు చిహ్నాలు. ఓ నగరాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటే.. ఓ నాగరికత ధ్వంసానికి పూనుకున్నట్టే.. నాగరికత అనేది కొన్ని తరాల కృషి. దీన్ని కొంతమంది చెడగొట్టే ప్రయత్నం చేస్తూ.. చూస్తూ ఉరుకుంటే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు.
చైతన్యవంతమైన సమాజాలే ప్రగతికి చిహ్నాలు. నగరాల వాతావరణాన్ని అక్కడ నివసించే పౌరులే నిర్ణయిస్తారు. ఎక్కడ్నుంచి ఎవరొచ్చినా కలుపుకుపోయే అరుదైన కల్చర్ ఉన్న హైదరాబాద్ పేరు చెడగొట్టే ప్రయత్నాల్ని విజయవంతంగా తిప్పికొట్టాలి. కొందరు నేతల కుట్రలకు ఘనమైన భాగ్యనగరం బలయ్యే పరిస్థితి ఉండదని గట్టిగా చాటిచెప్పాలి.
తెలంగాణ వచ్చి 8 ఏళ్లు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే లక్ష్యం. వెల్లువెత్తుతున్న అంతర్జాతీయ పెట్టుబడులు. పెరుగుతున్న ఐటీ ఎగుమతులు. అంతా బాగుందనుకున్న తరుణంలో అనుకోని ఘటనలు, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు. శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్రలు కలకలం రేపుతున్నాయి.
ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా శాంతిభద్రతలు చాలా ముఖ్యం. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే అభివృద్ధి సాధ్యం. నిత్యం అశాంతి రగిలే చోట ఎక్కడా నాగరికత వికసించలేదు. శాంతియుతంగా ఉన్న నగరాలే రేసులో ముందున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న ఘటనలు ఎవరికీ మంచిది కాదు. కనీస బాధ్యత లేకుండా కొందరు నేతలు చేస్తున్న పనులు.. హైదరాబాద్ కు చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్ల నుంచి కష్టపడి నిర్మించుకున్న బ్రాండ్ హైదరాబాద్ ను కొందరు కూలగొడుతుంటే.. చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకూడదు.
సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదికన సాగాల్సిన రాజకీయం.. ప్రాంతాలు, నగరాల భవిష్యత్తును పాడుచేసే కోణంలో సాగటం సిగ్గుచేటు. రాజకీయం కోసం ఏం చేసినా తప్పుకాదనే కుసంస్కృతి బాగా ప్రబలింది. ప్రజల మేలు కోసం చేయాల్సిన రాజకీయం.. ప్రజల్ని పాడుచేసే యంత్రాంగంగా మారుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం నగరాల చరిత్రలు మట్టిపాలైనా.. బ్రాండ్ ఇమేజులు చెడిపోయినా నష్టం లేదనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఏ నేత అయినా కొన్నాళ్లే ప్రజాజీవితంలో ఉంటారు. ఈ కాస్త మెహర్బానీ కోసం.. పరిధులు దాటి.. నగరాల భవిష్యత్తుతో ఆడుకోవడానికి అనుమతిస్తే.. చివరకు మిగిలేది వినాశనమే.
వందల ఏళ్ల నాటి బుద్ధ విగ్రహాలు ధ్వంసం చేసిన తాలిబన్లు నరరూప రాక్షసులుగా పేరు తెచ్చుకున్నారు. మరి వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరాల ఇమేజ్ ను కలరాసే పనులు చేసేవాళ్లను ఏమనాలి. నగర హంతకులు అనాలా.. ఇంకేదైనా కొత్త పేరు పెట్టాలా అని ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. కొందరు నేతలు అడ్డూ అదుపూ లేకుండా రాజకీయం చేస్తూ.. చిల్లర గొడవలు తెస్తున్నారు. ప్రశాంత వాతావరణం ఉండే మెట్రో నగరాల్లో జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో ఒక్క నిమిషం బిజినెస్ ఆగినా.. జరిగే నష్టం వందల కోట్లలో ఉంటుంది. అలాంటిది కొందరు నేతల పైత్యం కారణంగా గంటల తరబడి ఆంక్షలు అమలైతే.. ఎంతమంది జీవనోపాధి దెబ్బతింటుందనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు నేతలు.
రాజకీయం ఏ స్థితికి దిగజారిందంటే.. ప్రజల ప్రస్తుత పరిస్థితుల్ని ప్రభావితం చేయడంతో ఆగటం లేదు. నగరాల భవిష్య్తతును చెడగొట్టే దుస్సాహసానికి దిగుతున్నారు నేతలు. కొందరు నేతల తీరు చూస్తుంటే.. కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అర్జెంటుగా మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓ నగరం ఇమేజ్ కు భంగం కలిగేలా.. పౌరుల జీవనాన్ని ఇబ్బందిపెట్టేలా చేసే వ్యాఖ్యలు, పనులు ఎవరు చేసినా.. వాళ్లపై తీవ్రమైన చర్యలుండాలి. పౌరులు కూడా అలాంటి వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా బుద్ది చెప్పాలి. అప్పుడే బండరాళ్ల లాంటి సదరు నేతల్లో కాస్తైనా మార్పు వస్తుంది. లేకపోతే ఇలాంటి వాళ్లు అంటించే బురద కడుక్కోవడానికే పుణ్యకాలం కాస్తా పూర్తైపోతుంది.
హైదరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. దేశంలో కొన్నిచోట్ల పరిస్థితుల అదుపు తప్పినా.. ఇక్కడి ప్రజలు మాత్రం సంయమనం పాటిస్తున్నారు. కానీ హైదరాబాదీలు ఇంత శాంతిగా ఉండటం కొందరు నేతలకు నచ్చడం లేదు. ఎలాగైనా అశాంతి చిచ్చు రేపాలని పైత్యపు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పౌరులే తిప్పికొట్టాల. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం కాదు.. ఇలాంటి నేతల్ని సమాజమే క్షమించదనే సంకేతం వెళ్లాలి. అప్పుడే పరిస్థితులు మారతాయి. మెట్రో నగరాల్లో ఉండాలంటే.. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలనే చట్టాలు కూడా తేవాల్సిన అవసరం ఉంది. మెట్రో నగరాల పౌరులకు పరిణతి ఉన్నా.. నేతలు మాత్రం నేలబారు రాజకీయాలే చేస్తున్నారు. పౌరుల స్థాయికి ఎదగకపోగా.. వాళ్లను కూడా దిగజార్చడానికి వెనుకాడటం లేదు.
వ్యక్తి కంటే వ్యవస్థ ఎప్పుడూ గొప్పదే. వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం దారుణం. ఎంతో చరిత్రను తనలో ఇమడ్చుకున్న హైదరాబాద్ లాంటి నగరం ఇమేజ్ చాలా ముఖ్యం. కేవలం తెలంగాణకే కాదు.. దేశానికే ఆర్థిక ఆలంబనగా నిలుస్తున్న నగరం హైదరాబాద్. విశ్వనగరం అనిపించుకోవాలని వేగంగా అడుగులేస్తోంది. ఇలాంటి సమయంలో కొందరు నేతలు తెలివితక్కువగా వ్యవహరిస్తున్న తీరు.. హైదరాబాదీలందరికీ మచ్చ తెచ్చే ప్రమాదం ఉంది. కొందరి కోసం నగరం ఇమేజ్ ను పణంగా పెడదామా.. నగరం బంగారు భవిష్యతో కసం సదరు నేతల్నే దూరం పెడతామా అనేది తేల్చుకోవాల్సిన సమయమిది.