రాజకీయ వ్యూహాల్లో కెసీఆర్ దిట్ట. జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉందని ఆయన గ్రహించారు. అందుకే జాతీయ పార్టీ పెట్టాలనుకున్నారు. దక్షిణాది నేతగా ఇలాంటి ఆలోచన రావటం సాహసమే. అయితే, చేతిక వచ్చిన అవకాశాన్ని అంటే..జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేయటానికి ఒక లీడ్ తీసుకునే అవకాశాన్ని కెసీఆర్ చేజార్చుకున్నారు.
రాజకీయంగా చాలా అడ్వాన్స్ గా ఆలోచించే కెసీఆర్ లెక్క ఎక్కడ తప్పింది? బిజెపికి, కాంగ్రెస్ కి సమదూరం పాటించాలనే కఠిన నియమానికి కట్టుబడి ఒక మంచి అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారు…
రాష్ట్రపతి ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో కెసీఆర్ కి ఒక లాంఛింగ్ పాడ్ లాగా ఉపయోగపడేవి. రాష్ట్రపతి ఎన్నికల్లో కెసీఆర్ ఒక లీడ్ తీసుకోలేకపోయారు. దేశంలో ప్రతిపక్షాలన్నింటిని కూడగట్టి ఒక బలమైన బిజెపి వ్యతిరేక నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాల్సింది. ఆ కార్యక్రమానికి తానే సారధ్యంవహించాల్సింది.. లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయినా కూడా, జాతీయ రాజకీయాల్లో కెసీఆర్ ఉనికి మొదలయ్యేది.
కెసీఆర్ కి జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. అందరిని కూడగట్టే శక్తి ఉంది. కానీ, అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నారు. చొచ్చుకుపోవలసింది కానీ, చొచ్చుకుపోలేదు.. ఎందుకో ఆయన్ని ఆయన లిమిట్ చేసుకున్నారు. ఓ రకంగా ఇది వ్యూహం లేని రాజకీయం.
కెసీఆర్ లెక్కలు కెసీఆర్ కి ఉండొచ్చు. ఆయన వ్యూహం ఆయనకు ఉండి ఉండవచ్చు. కానీ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగిని వాడే ప్రాక్టికల్ లీడర్..రాష్ట్రపతి ఎన్నికలను బేస్ చేసుకుని ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయటంలో కీలక పాత్ర పోషించి ఉంటే, అందరినీ ఆకట్టుకోగలిగేవారు. దీనిని బేస్ చేసుకుని జాతీయ రాజకీయాల్లో చురుగ్గా, తర్వాత రోజుల్లో వ్యవహరించేవారు. వ్యూహం లేని రాజకీయంతో ఆయన ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు.
కెసీఆర్ జాతీయ రాజకీయాల్లో దూసుకువెళ్లాలనుకుంటున్నారు.జాతీయ పార్టీ ప్రకటన ఇవాళా..రేపా అనే చర్చ నడుస్తోంది.ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలొచ్చాయి.దీంతో ఈ ఎన్నికల్లో ఆయన వ్యూహమేంటనే ఆసక్తి అందరిలో ఉంది..మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి టియ్యారెస్ నుండి ఎవరూ హాజరు కాకపోవటంతో ఉత్కంఠ మరింత పెరిగింది.అటు ఇతర పార్టీలను కలుపుకుని ఢిల్లీ రాజకీయాల్లో ఎంట్రీకి ప్రయత్నం చేయకుండా,
అటు సమావేశానికి హాజరు కూడా కాకపోవటంతో గులాబీ బాస్ స్ట్రాటెజీ ఏమిటనే చర్చ నడుస్తోంది.
ఈ మౌనం వెనకున్న వ్యూహమేమిటి?ఇదే అంశంపై ఈ రోజు స్టోరీ బోర్డ్ చూద్దాం…
చేతికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారా?కెసీఆర్ తనను తానే లిమిట్ చేసుకున్నారా?జాతీయ రాజకీయాల్లో ముద్రవేసే ఛాన్స్ వదులుకున్నారా?రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కెసీఆర్ లెక్క ఎక్కడ తప్పింది?
రాజకీయ వ్యూహాల్లో కెసీఆర్ దిట్ట. ఇందులో ఎవరికి పెద్దగా సందేహాలుండవు. ఓ ప్రకటన చేస్తేనే కాదు..ఆయన సైలెంట్ గా ఉన్నా ఓ లెక్క ఉంటుంది. దాని వెనుక ఏదో వ్యూహం ఉంటుందని అందరూ నమ్ముతారు. కానీ, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కెసీఆర్ లెక్క తప్పిందా? చేతులారా ఛాన్స్ పోగొట్టుకున్నారా అనే చర్చ మొదలైంది.
నిజానికి కెసీఆర్ చాలా కాలంగా ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందే పలు రాష్ట్రాలు పర్యటించారు. మమత, స్టాలిన్, నవీన్ పట్నాయక్, అఖిలేష్, మాయావతి సహా అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ వాదనతో జాతీయ రాజకీయాల్లో చర్చ మొదలు పెట్టారు.
బిజెపి, కాంగ్రెస్ లకు సంబంధం లేకుండా ఓ కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు..నాటి నుంచి ప్రత్యామ్నాయ కూటమిపై అనేక వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ మధ్య కాలంలో కూడా పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తూ వచ్చారు..కూటమి చర్చలు కొంత కాలం, ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనలు… అన్నీ దాటుకుని జాతీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు కొద్ది రోజులుగా బ్రేకింగ్ న్యూస్ లు హల్ చల్ చేస్తున్నాయి.. కెసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉందని గ్రహించారు. అందుకే జాతీయ పార్టీ పెట్టాలనుకున్నారు. దక్షిణాది నేతగా ఇలాంటి ఆలోచన రావటం సాహసమే. అని చెప్పాలి.
ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పటం చిన్న విషయం కాదు. దానికి కెసీఆర్ ఎజెండా ప్రకారం కాంగ్రెస్, బిజెపిలను వ్యతిరేకించే పార్టీల మద్ధతు సంపాదించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో విపక్షాలను కూడగడితే ఢిల్లీలో ఓ ముద్రవేసినట్టవుతుంది. దానికి రాష్ట్రపతి ఎన్నికలను మించిన అవకాశం మరొకటి లేదు. కానీ, చేతికి వచ్చిన అవకాశాన్ని.., జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేయటానికి ఒక లీడ్ తీసుకునే అవకాశాన్ని కెసీఆర్ చేజార్చుకున్నారనే వాదనలు పెరుగుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు కూటముల తరపున అభ్యర్ధులు ఫైనల్ అయ్యారు. వ్యూహ ప్రతివ్యూహాలతో అభ్యర్ధులను ప్రకటించిన ఇరుపక్షాలు సమరానికి సై అంటున్నాయి. పూర్తి స్థాయి బలంతో విజయం తమదే అన్న ధీమాలో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ పక్షం ఉండగా.. ఎన్డీఏ కూటమిని దెబ్బ దీయాలని ప్రతిపక్ష పార్టీల కూటమి ఎత్తుగడలు వేస్తుంది. ఇదే సమయంలో గులాబీ దళపతి ఏ శిబిరం వైపు మొగ్గుచూతారన్నది చర్చనీయంశంగా మారింది.
రాష్ట్రపతి ఎన్నికలను టార్గెట్ చేస్తూ కేంద్రంలో అధికార విపక్ష పార్టీలన్నీ చురుగ్గా వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇదే తరుణంలో జాతీయ రాజకీయాల పై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఎటు వైపు మొగ్గు చూపుతుందన్నది సస్పెన్స్ గా మారింది. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ తమ వైపే ఉన్నారంటూ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయం ప్రకటించ లేదు.
యశ్వంత్ సిన్హాకు 20కి పైగా పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న శరద్ పవార్.. ఈ అంశంపై తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడానంటున్నారు. కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగనున్న యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తానని తనతో చెప్పారని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.
బీజేపీకి వ్యతిరేకించే విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించాయి. ఇందుకోసం ఆ పార్టీలన్నీ కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. విపక్షాలు ముందుగా తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్‌ను రంగంలోకి దింపాలని భావించాయి. కానీ ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపాలని పార్టీలు యోచించాయి. కానీ ఆయన తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి విపక్షాలకు షాక్ ఇచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిని పోటీలో దింపాలనే దానిపై విపక్షాలల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచి చివరకు కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడం.. ఆయన విపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి అవుతారని భావించడంతో.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై ప్రతిపక్షాలు చర్చించాయి. చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉంటారని ప్రకటించాయి.
కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసి పని చేసేది లేదని స్పష్టం చేసిన కేసీఆర్…ఇటీవల విపక్ష కూటమి నిర్వహించిన సమావేశానికి సైతం దూరంగా ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని 22 రాజకీయ పార్టీలు ఏకమై రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి. అటు బిజెపి తొలిసారిగా ఆదివాసి మహిళకు అవకాశం కల్పించింది.
ఇలాంటి తరుణంలో కేసీఆర్ న్యూట్రల్ గా ఉంటారా లేక ఏదో ఒక కూటమి వైపు ఓటు వేస్తారా అన్నది సస్పెన్స్ గా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ వ్యూహం అనుసరిస్తారో అనే చర్చ నడుస్తోంది.
నిజానికి ఇక్కడ జరగాల్సిన చర్చ, కెసీఆర్ బిజెపి అభ్యర్థి ఓ మహిళ కావటంతో ఆమెను సపోర్ట్ చేస్తారా లేక, విపక్షాల కూటమి అభ్యర్థిని సపోర్ట్ చేస్తారా అని కాదు. ఆయనే స్వయంగా లీడ్ తీసుకుని ఇతర పక్షాలను ఏకం చేసి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో తన రాజకీయ చతురతును ప్రదర్శించి ఉండాల్సింది. వ్యూహాలు పన్నటంలో ఆయన ప్రత్యేకతను చాటాల్సిన సమయం. కానీ, చివరకు కెసీఆర్ జస్ట్ ఏ గ్రూపులో ఉన్నారు… ఆయన ఓటు ఎటువైపు అనే చర్చకే పరిమితమయ్యారు..
కూటమి కట్టాలన్నా, ఫెడరల్ ఫ్రంట్ పునాదులు వేయాలన్నా, జాతీయ పార్టీ పెట్టాలన్నా ఢిల్లీ కేంద్రంగా కలిసొచ్చే పార్టీలను కలుపుకుని వెళ్లాలి. అదే రాజకీయ చతురత అవుతుంది. అందుకే కొంతకాలం కెసీఆర్ అనేక రాష్ట్రాలు పర్యటించారు. పైగా చాలా పార్టీల మద్ధతు తనకుందని కూడా చెప్పారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఈ వ్యూహానికి పదును పెట్టి, అందరినీ ఏకంగా చేయాల్సిన కెసీఆర్ నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి
కెసీఆర్ జాతీయ పార్టీ గురించి చర్చ విస్తృతంగా జరుగుతోంది. కాంగ్రెస్, బిజెపిలను సమానంగా వ్యతిరేకించే కెసీఆర్, కాంగ్రెస్ పాల్గొంటున్న సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే, కెసీఆర్ స్వయంగా లీడ్ తీసుకుని అన్ని పార్టీలను ఎందుకు ఏకం చేయలేకపోయారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే చేసి ఉంటే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీగా ఉపయోగపడే ఛాన్స్ వదులుకున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
రాజకీయంగా చాలా అడ్వాన్స్ గా ఆలోచించే కెసీఆర్ లెక్క ఎక్కడ తప్పింది? బిజెపికి, కాంగ్రెస్ కి సమదూరం పాటించాలనే కఠిన నియమానికి కట్టుబడి ఒక మంచి అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రపతి ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో కెసీఆర్ కి ఒక లాంఛింగ్ పాడ్ లాగా ఉపయోగపడేవి. కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో కెసీఆర్ ఒక లీడ్ తీసుకోలేకపోయారు. దేశంలో ప్రతిపక్షాలన్నింటిని కూడగట్టి ఒక బలమైన బిజెపి వ్యతిరేక నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాల్సింది. ఆ కార్యక్రమానికి తానే సారధ్యంవహించాల్సింది.. లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయినా కూడా, జాతీయ రాజకీయాల్లో కెసీఆర్ ఉనికి మొదలయ్యేది.
కెసీఆర్ కి జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. అందరిని కూడగట్టే శక్తి ఉంది. అ అంశం చాలా క్లియర్. కానీ, అందివచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఢిల్లీ రాజకీయాల్లోకి చొచ్చుకుపోవలసిన ఛాన్స్ వచ్చినా, ఆ పని చేయలేదు కెసీఆర్. ఎందుకో ఆయన తనని తానే లిమిట్ చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్తే ఇది ఓ రకంగా ఇది వ్యూహం లేని రాజకీయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కెసీఆర్ లెక్కలు కెసీఆర్ కి ఉండొచ్చు. ఆయన వ్యూహం ఆయనకు ఉండి ఉండవచ్చు. కానీ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగిని వాడే ప్రాక్టికల్ లీడర్.. రాష్ట్రపతి ఎన్నికలను బేస్ చేసుకుని ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయటంలో కీలక పాత్ర పోషించి ఉంటే, అందరినీ ఆకట్టుకోగలిగేవారు. దీనిని బేస్ చేసుకుని జాతీయ రాజకీయాల్లో తర్వాత రోజుల్లో చురుగ్గా వ్యవహరించేవారు. వ్యూహం లేని రాజకీయంతో ఆయన ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారనే వాదనలు పెరుగుతున్నాయి
రాజకీయాల్లో డెసిషన్ మేకింగ్ చాలా ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే చాలా అవకాశాలు దాటిపోతాయి. ఇప్పుడు కెసీఆర్ కూడా కీలక నిర్ణయం తీసుకోవలసిన సమయంలో తీసుకోలేదనే వాదనలున్నాయి. నిజానికి కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కోసం మమత బెనర్జీ సారథ్యంలో నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించడం నిజంగా పెద్ద విషయమే. ఎందుకంటే కేసీఆర్ బీజేపీని వ్యతిరేకించే మమత బెనర్జీతో పలుసార్లు సమావేశమయ్యారు. ఆమెతో కలిసి పని చేయాలని కూడా అనుకున్నారు. ఇక ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్‌కు రాజకీయంగా సాన్నిహిత్యం ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఆ భేటీకి దూరంగా ఉన్నారు.
రాజకీయంగా తాము వ్యతిరేకించే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి అవుతుండటంతో పాటు ముందుగానే అభ్యర్థిని నిర్ణయించి సమావేశం నిర్వహించడాన్ని టీఆర్ఎస్ తప్పుబట్టిందనే వార్తలున్నాయి. కానీ, అసలు పరిస్థితి ఇక్కడి వరకు రాకుండా, తానే అన్ని పార్టీలను ఏకం చేసి సమావేశం నిర్వహించే వైపు ఎందుకు అడుగులు వేయలేదనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే, జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్.. ఇక ఇతర పార్టీలతో కలిసి పని చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్టు కొన్ని వాదనలుంటే, బీజేపీ అభ్యర్థి కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని తెలిసినా.. ఈ ప్రయత్నాలు ఎందుకు అనే భావనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు మరికొందరి వాదన..
టియ్యారెస్ 21 ప్లీనరీ లో కెసీఆర్ ప్రసంగం కొత్త సంకేతాలనిచ్చింది. దేశానికి కావాల్సింది.. రాజకీయ ఫ్రంట్‌లు కాదంటూనే.. దేశ గతి, స్థితిని మార్చే.. ప్రజల అభివృద్ధికి సహకరించే ప్రత్యామ్నాయ అజెండా కావాలని చెప్పారు. భారత్ దేశంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి కావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలని వ్యాఖ్యానించారు. ఆ రోజు నుండి కొత్త జాతీయ పార్టీ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఉధృతంగా జరిగిన ప్రగతి భవన్ సమావేశాల తర్వాత ఈ వాదనలకు బలం పెరిగింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర సమితే.. భారత్ రాష్ట్రీయ సమితిగా మారుతుందని కూడా వార్తలొచ్చాయి.
ఇంత వరకు బాగానే ఉంది. జాతీయ పార్టీకి సంబంధించి కాస్త ముందు వెనగ్గా ప్రణాళిక అమలు చేసే వెసులుబాటు ఉంది. జాతీయ పార్టీ ఆలోచన ఉన్నపుడు ఢిల్లీ రాజకీయాల్లో ఓ మంచి లాంచింగ్ ప్యాడ్ లాంటి అవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. విపక్షాలను బిజెపికి వ్యతిరేకంగా ఏకం చేసి ఎన్నికలకు వెళ్లి ఉంటే వచ్చే గుర్తింపు వేరు. తాము నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ఓడినా సరే… అందర్నీ ఏకంగా చేయటంలో కెసీఆర్ రాజకీయ చతురత చాటినట్టయ్యేది. ఇప్పుడు ఆ క్రెడిట్ మమతా బెనర్జీకో లేక శరద్ పవార్ కో వదులుకున్నట్టయింది.
నిజానికి కెసీఆర్ అత్యంత అప్రమత్తంగా ఉండే పొలిటీషియన్ అనే అంతా భావిస్తారు. ఆయన ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేదానిపై ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. తొలినాటి నుంచి ఆయన అడుగులు ఇదే చెప్తాయి. వ్యూహం లేకుండా ఆయన ఏదీ చేయరు. కానీ, ఇప్పుడు కెసీఆర్ కొత్త ప్రణాళికలు ఏ దిశగా సాగుతున్నాయనే ఆసక్తి సామాన్యుల్లోనే కాదు…రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నాయి. దేశంలో ఓ వెలుగు వెలుగుతున్న బిజెపిని, అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్ ని, దేశంలో పదుల సంఖ్యలో ఉన్న ప్రాంతీయ పార్టీలను, వాటి కూటమిని దాటుకుని ఓ కొత్త జాతీయ పార్టీ తెరమీదికి రావటం అంటే చిన్న విషయం కచ్చితంగా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఎదగాలంటే, సరైన సమయంలో సరైన వ్యూహాన్ని అమలు చేయటం అవసరం. ఆ సందర్భం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చినా, వ్యూహం లేని రాజకీయంతో కెసీఆర్ వ్యవహరించారనే వాదనలు పెరుగుతున్నాయి. ఎంత అనుభవజ్ఞుడైనా, ఎంతటి వ్యూహకర్త అయినా కొన్ని సార్లు నిర్ణయం తీసుకోవటంలో బోల్తా కొట్టవచ్చు. ఇది సహజమే. ఇప్పుడు కెసీఆర్ కూడా రాష్ట్రపతి ఎన్నికల సందర్భాన్ని జారవిడుచుకున్నారనే వాదనలు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి.
ఫ్ర్రంట్లు కాదు…ప్రత్యామ్నాయం కావాలనే కెసీఆర్, జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేకనే బిజెపి ఆడింది ఆట, పాడింది పాటగా ఉందని విరుచుకుపడతారు. అనేక సందర్భాల్లో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. ఇతర ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకే పరిమితం కావటం వల్లనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఖాళీ చేసిన భర్తీ కావటం లేదనేది కెసీఆర్ వాదన. ఇప్పుడా స్థానాన్ని బీఆరెస్ భర్తీ చేస్తుందని ఆయన అభిప్రాయం కావచ్చు.. మరోపక్క మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బిజెపి బలంగా ఉందనే అంశం మరోసారి స్పష్టమైంది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బిజెపియేతర పక్షాలు బలాన్ని నిరూపించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీ చర్చ లేవనెత్తిన కెసీఆర్, కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి
నిజానికి కెసీఆర్ తీరు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన వ్యూహాలు చాలా సందర్భాల్లో తిరుగులేనివే. ఏ లక్ష్యం కోసం ఎక్కడ మొదలు పెడతారో ఊహించటం కష్టం. తెలంగాణ సాధన ఉద్యమ కాలం నుండి ఇలాంటి అనేక ఎత్తుగడల మధ్య ఉద్యమ పార్టీగా మొదలైన టియ్యారెస్ రాజకీయ పార్టీగా మారి, ఇప్పుడు రెండోసారి తెలంగాణలో అధికారంలో ఉంది. 2001లో పురుడు పోసుకున్న టిఆర్ఎస్, 14ఏళ్లలోనే అసాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని సుసాధ్యం చేసుకుంది. రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టి ముందుకెళుతోంది. ఈ దూకుడు జాతీయ రాజకీయాల్లో కూడా పనికొస్తుందా? అనే చర్చ ఓ పక్కన నడుస్తూనే ఉంది.
ఇంత పెద్ద చర్చ నడుస్తున్న సమయంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికలు ఢిల్లీ వేదికపై బలాన్ని నిరూపించుకోవటానికి ఓ సదవకాశం అని చెప్పవచ్చు. నిజానికి ఇప్పటికే ప్రతిపక్ష కూటమి నాయకత్వం కోసం మమత, కేజ్రీవాల్, కెసిఆర్ పోటీ పడుతున్నారంటూ రాజకీయ వర్గాలలో ఓ భావన ఉంది. ఎవరి ఆశలూ ఆలోచనలూ అవసరాలూ వారికి వుండొచ్చుగాని రాష్ట్రపతి ఎన్నిక సమయంలో అయినా ఉమ్మడి వైఖరి అవలంబించాల్సింది. దానికి చొరవ తీసుకుని కెసీఆర్ అందర్నీ ఏకంగా చేయాల్సింది. ఇది జాతీయ రాజకీయాల్లో తొలిఅడుగులుగా ఉపయోగపడి ఉండేది. దేశంలో ఇంత వరకూ ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒక్క రోజులో జాతీయ పార్టీ కాలేదు. ఎన్టీఆర్ జాతీయ పార్టీ పెడతానని చెప్పినా అది నిజం కాలేదు. టిఎంసి, ఎస్‌పి, బిఎస్‌పి వంటివి జాతీయ పార్టీలంటున్నా అవి ఒక రాష్ట్రంలోనే ప్రధానంగా పని చేస్తున్నాయి. ఆప్ పంజాబ్‌లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఇతర చోట్ల దానికీ బలం లేదు. అలాంటిది తెలంగాణకే పరిమితమైన కెసీఆర్, జాతీయ ఆకాంక్షల సాధన కోసం శ్రమిస్తున్నపుడు వ్యూహాత్మక రాజకీయం చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మమత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదు.. సరే. ఇప్పుడు టియ్యారెస్ మద్దతు యశ్వంత్ సిన్హాకే అని శరద్ పవార్ అంటున్నారు. దీనిపై టియ్యారెస్ కనీసం ఓ అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేకపోయింది. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి చక్రం తిప్పాలనుకుంటున్న కెసీఆర్, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని సాగిన సమావేశానికి హాజరు కాలేదు. నిజానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బిజెపికి అనుకూలం, బిజెపికి వ్యతిరేకం అని రెండే గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల లాంటి సందర్భంలో బిజెపి వ్యతిరేక కూటమి సాధ్యం కావచ్చు. కానీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కట్టడం అంత తేలికైన విషయం కాదు. కాంగ్రెస్ ని వ్యతిరేకించే మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా బిజెపి వ్యతిరేక పార్టీల ఐక్యత ముఖ్యమని భావించారు. ఇప్పుడు కెసీఆర్ కేవలం జాతీయ పార్టీ అంటూ… ఇతర పక్షాలను కలుపుకుని లీడ్ చేయటంలో చొరవ చూపకపోవటం స్పష్టంగా కనిపిస్తున్న అంశం. గతంలో ఆయన మమత, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, కేజ్రీవాల్, దేవెగౌడ, కుమారస్వామి, స్టాలిన్ లాంటి నేతలను పలుమార్లు కలిశారు. వాళ్లందరి మద్ధతు తనకుందని కూడా ప్రకటించారు. తొందర్లో పెద్ద వార్త వింటారని కూడా ప్రకటించారు. అప్పుడు చూపిన ఉత్సాహం, కీలకమైన సమయంలో కనబరచకపోవటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
అలాగని కెసీఆర్ వ్యూహాలను తక్కువ చేయలేం. కెసీఆర్ మౌనంగా ఉన్నా, ఒక అడుగు వెనక్కు వేసినట్టు కనిపించినా దానివెనుక మరో వ్యూహమేదో కచ్చితంగా ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా విపక్షాల అభ్యర్థి గెలవటానికి అవకాశాలు పెద్దగా లేని సమయంలో, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీనే ఓ ఫెయిల్యూర్ తో ఎందుకని కూడా భావించి ఉండవచ్చు. అదే సమయంలో బిజెపి, కాంగ్రెస్ రెండిటికి సమాన దూరంలో ఉంటామని కూడా చెప్పటానికే అయ్యుండొచ్చు.
ఏదైనా, కెసీఆర్ తన దూకుడుకు తగినట్టుగా వ్యవహరించకుండా, ఈ సందర్భంలో వ్యూహం లేని రాజకీయం చేశారనే విమర్శలు మాత్రం గట్టిగానే ఉన్నాయి.