ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉందనే భావన పెరిగింది. అది నిజం కాదని నిరూపిస్తూ.. పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. కనీవినీ ఎరుగని ఘటనతో.. దేశం ఉలిక్కిపడింది. ఉగ్రదాడికి రూపకల్పన చేసిన పాకిస్తాన్ కు మరిచిపోలేని గుణపాఠం చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది. కశ్మీర్ మారిందనే ప్రచారం అబద్ధమని నిరూపించటమే ధ్యేయంగా ఉగ్రవాదులు తెగబడ్డారు. తాపీగా నడుచుకుంటూ వచ్చి పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నారు. అంతే తేలికగా పరారయ్యారు. గతంలో ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్ తో బుద్ధి చెప్పిన చరిత్ర భారత్ కు ఉంది. అయినా సరే పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకుండా మరోసారి ఘాతుకానికి తెగించింది. దీంతో పాకిస్తాన్ కు మళ్లీ తలెత్తకుండా బుద్ధి చెప్పాలని దేశప్రజలంతా కోరుకుంటున్నారు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటు కేంద్రం కూడా పహల్గాం ఉగ్ర ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఇప్పటికే రెండుసార్లు రాజ్ నాథ్ సింగ్ మోడీతో సమావేశమై.. భద్రతాదళాల సన్నద్ధతను వివరించారు. ఉగ్రదాడి జరిగిన వారం రోజుల వ్యవధిలో రెండోసారి కీలకమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సమావేశమౌతోంది. ఉగ్రవాద మూలాలు పెకిలిస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రులు గట్టిగా చెప్పారు. దేశం రక్తం మరుగుతోందని ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. ఏదో పెద్ద ఆపరేషన్ కే కేంద్రం రంగం సిద్ధం చేస్తోందనే భావన కలుగుతోంది. అయితే అది యుద్ధమా.. ఇంకోటా అనేది తేలడం లేదు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. యుద్ధాన్ని పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది.
భారత్ ఎప్పుడూ తనంతట తానుగా యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ శత్రువు కవ్వించినప్పుడు ప్రతిదాడి మాత్రం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా బుద్ధి మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో మోహరింపులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు, యుద్ధ విమానాల తరలింపు ఇలా అన్నింటిలోనూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ చర్యలకు దీటుగా భారత్ కూడా సర్వసన్నద్ధంగా ఉంది. త్రివిధ దళాలను సమాయత్తం చేస్తోంది. రెండు దేశాల సన్నద్ధతను చూస్తుంటే.. యద్ధం వచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. కానీ యుద్ధం అంత ఆషామాషీగా ప్రారంభం కాదనే సంగతి సుస్పష్టం.
గత 125 సంవత్సరాలలో.. అంటే 1900 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన 95 శాతం యుద్ధాలలో ఏ దేశం యుద్ధాన్ని ప్రారంభించినా అది ప్రత్యర్థి దేశం చేతిలో ఓటమిపాలైంది. అయినా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో యుద్ధం ప్రారంభించారనే అభిప్రాయం సహజం. పాకిస్తాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంలో భారత్ అద్భుతంగా వ్యవహరించింది. 1960 నుంచి పాకిస్తాన్‌తో ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ, భారత్ ఎప్పుడూ సింధూ జలాల జోలికి పోలేదు. దీంతో పాకిస్తాన్ అతివిశ్వాసంతో వ్యవహరించింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడితో విసిగిపోయిన భారత్.. పాకిస్తాన్‌పై బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.
భారత్ ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా పాకిస్తాన్‌పై భారీ ఒత్తిడి పెట్టింది. అదొక విజయమే. ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయవచ్చు. ఈ విషయంలో పాకిస్తాన్ కన్సెషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. భారత్ కా అనేక డిమాండ్లను లేవనెత్తవచ్చు. వ్యూహాత్మకంగా ప్రతి దౌత్యపరమైన అవకాశాన్ని అన్వేషించాలి. దౌత్య యుద్ధం గెలవడానికి ఉత్తమ మార్గం అని చరిత్ర మనకు నిరూపించింది. సరైన దౌత్యం కచ్చితంగా యుద్ధం కంటే మంచి ఫలితమే ఇస్తుంది. శత్రువుకి మరచిపోలేని గుణపాఠం కూడా నేర్పుతుంది.
భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందో లేదో ఇప్పటికిప్పుడు ఎవరూ ఊహించలేరు. అయితే రెండు దేశాలు దేనికైనా రెడీ అన్నట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ కు ప్రతిగా భారత సైన్యం తన యుద్ధనౌకలు, విమానాలు, సైనిక దళాలను అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉన్న స్థావరాలలో మోహరిస్తోంది. శత్రుదళాలు ఏదైనా దాడికి సిద్ధమైతే భారత్ ముందుగానే ఎదుర్కోగలుగుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉంటూనే కరాచీ సమీపానికి వెళ్లడం వ్యూహాత్మకమే. శత్రువుల ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, భూ, సముద్ర, వైమానిక స్థావరాలు, సమాచార కేంద్రాలు, ఆయుధ డిపోలు, చమురు డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు అవకాశం ఉంటుంది.
1971 యుద్ధం సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు పాకిస్తాన్ పై సైనిక చర్యలు, నౌకాదళ దాడులు నిర్వహించింది. ఇప్పుడు కూడా అప్పటి వ్యూహాన్ని రిపీట్ చేస్తున్నారేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే ఏదీ రూఢీ కాకుండా భారత్ తెలివిగా వ్యవహరిస్తోంది. ఏ అవకాశాన్నీ కొట్టిపారేయటానికి లేకుండా.. ఏ అంశమూ కన్ఫమ్ చేసుకునే వీలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భారత్ ముందున్న ప్రధాన సవాలు.. పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ వల్లే జరిగిందని అంతర్జాతీయ స్థాయిలో నిరూపించటానికి బలమైన సాక్ష్యాధారాలు సంపాదించటమే. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ఆ దిశగానే సాగుతోంది. ఇప్పటికే పాక్ సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు సేకరించారు. వీలైనన్ని బలమైన ఆధారాలతో పాకిస్తాన్ నోరెత్తకుండా చేయడమే తక్షణ కర్తవ్యమని భారత్ భావిస్తోంది.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా కశ్మీరులో జరుగుతున్న ఘటనలు, ఉగ్ర దాడుల విషయంలో భారత్ స్పందించిన తీరు కారణంగా ప్రజల అంచనాలు పెరిగాయి. అందుకే పహల్గామ్ దాడి తర్వాత ఏదో గట్టిగా చేయాలనే డిమాండ్ పెరిగి పెద్దదౌతోంది. ఇప్పుడు పాకిస్తాన్‌పై పెద్ద స్థాయిలో చర్యలు తీసుకోకపోతే, దేశ ప్రజల్లో అసంతృప్తి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాకిస్థాన్‌పై భారత్ చేయబోయే యుద్ధం అంతర్జాతీయ సమస్యగా మారేంత పెద్దదిగా ఉండకూడదు. పాకిస్థాన్ ప్రయోజనం పొందేంత చిన్నదిగానూ ఆ యుద్ధం ఉండకూడదు. ఈ సంక్లిష్టమైన సవాలు కారణంగానే ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో సుదీర్ఘ మేధోమథనం జరుగుతోంది. ప్రస్తుతం భారత్ ముందు యుద్ధం కాకుండా చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఏ చర్య తీసుకుంటే.. ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో బేరీజు వేస్తున్నారు. పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పటం, అంతర్జాతీయ సమాజం మద్దతుండేలా చూసుకోవడం, కశ్మీరీలకు భరోసా ఇవ్వటమే లక్ష్యాలుగా ఆపరేషన్ కు రూపకల్పన జరగాల్సిన సందర్భమిది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత హస్తినలో జరుగుతున్న సమావేశాలు.. కేంద్రం సీరియస్ నెస్ ను తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్ర మంత్రుల దగ్గర్నుంచి ప్రధాని వరకు చేస్తున్న ప్రకటనలు.. తీవ్రమైన చర్యకు సంకేతంగా నిలుస్తున్నాయి. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందనేది తేలాల్సి ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే కొన్ని చర్యలను ఊహిస్తోంది. కానీ పాక్ ఊహకు అందని ఆపరేషన్ కోసమే ఆలోచిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.