Story Board: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కుటుంబాల్లో చిచ్చు రేగుతోంది. బీఆర్ఎస్‌లో రగిలిన కుంపటి తాజా ఉదాహరణ . అంతకుముందు కూడా ఉమ్మడి ఏపీ కాలం నుంచీ ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కలహాలు తప్పటం లేదు. ఏ స్థాయి నేతకైనా.. ఇంటిపోరు తప్పదనే సత్యం.. ఎప్పటికప్పుడు నిరూపితమౌతూనే ఉంది.
Read Also: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, ఫాస్ట్ ఛార్జింగ్, AI ఫీచర్లతో Samsung Galaxy Z Fold 8..
ఇక్కడ కవిత బీఆర్ఎస్‌పై చేసిన ఆరోపణలు అంత తేలికగా తీసుకునేవి కాదు. ప్రత్యర్థులు కూడా చేయలేని స్థాయిలో సొంత పార్టీపై కవిత విమర్శల వర్షం కురిపించారు. ఓ రకంగా కవిత బయటికొచ్చి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రత్యర్థులకు లైన్ క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. కానీ ఆమె మాత్రం ఆత్మగౌరవ పంచాయితీ అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఆడబిడ్డను అవమానంచడమే కాకుండా.. ఇప్పుడు కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కంటతడి పెడుతున్నారు.
Read Also: Naga Chaitanya: 2025 నాకెంతో ప్రత్యేకం.. ఆనందంలో నాగ చైతన్య!
కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ జాగృతి నాయకురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత.. గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై, పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏ పార్టీలోనైనా వర్గపోరు కామన్. కానీ ప్రాంతీయ పార్టీల్లో పెత్తనం చేసే కుటుంబ సభ్యుల మధ్య తేడాలొస్తే పార్టీలోనే ప్రకంపనలు అలాఇలా వుండవు. అధికారంలో ఉన్న పదేళ్లల్లో అటు ప్రభుత్వాన్ని,ఇటు పార్టీని అన్ని తానై నడిపించారు కేసీఆర్. ఏ నిర్ణయమైనా ఆయనదే ఫైనల్. దీంతో అధిపత్య పోరుకు నో ఛాన్స్. ఇప్పుడు అలా కాదు..ఓడిపోయాక కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం అయ్యారు. జనంలోకి వచ్చింది..పార్టీ నేతలతో సమావేశమైంది కొన్నిసార్లే. ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆరే పార్టీని నడిపిస్తున్నారు. జైలు నుంచి వచ్చాక కవిత యాక్టివ్ కావడంతో ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు లేఖాస్త్రాన్ని సంధించడం…అది లీక్ కావడంతో రచ్చ ముదిరింది. చివరికి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ ఆటంబాంబులాంటి ఆరోపణలు జారవిడిచి, పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు.
కవిత ఎపిసోడ్ కొన్నాళ్ల కిందటి షర్మిల ఎపిసోడ్‌ను తెలుగు ప్రజలకు గుర్తుకుతెస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ఒక పార్టీని స్థాపించారు. ఆ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆయన సోదరి వైఎస్ షర్మిల ఉన్నారు. అయితే ఆ తర్వాత తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి.. వైసీపీ నుంచి బయటికి వచ్చిన వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు. 4 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించారు. ఆ తర్వాత వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు.
ఇంకొంచెం వెనక్కివెళ్తే.. ఉమ్మడి ఏపీలో దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. చివరకు అవి ముదిరి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేశాయి. ఆ తర్వాత పార్టీ ఆయన అల్లుడు చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసే క్రమంలో కలిసే ఉన్న అల్లుడు చంద్రబాబు, కుమారుడు హరికృష్ణ మధ్య తర్వాత విభేదాలొచ్చాయి. పార్టీ గీత దాటారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు.. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసిన హరికృష్ణ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు. దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు.
అల్టిమేట్‌గా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల ఆధిపత్యం.. కుంపట్లకు దారితీస్తోందనడంలో సందేహం లేదు. మొదటి తరంలో పార్టీ వ్యవస్థాపకులు తమ నాయకత్వ లక్షణాలు, ఛరిష్మాతో పార్టీలు పెడుతుంటే.. రెండో తరంలో వారసత్వ పోరాటాలు మొదలవుతున్నాయి. చాలా పార్టీల్లో వారసత్వ పార్టీలు రచ్చకు దారితీస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అధినేతలు వారసుల మధ్య తగవు తీర్చలేని దుస్థితి ఎదురవుతోంది. ఇక్కడ కేవలం నాయకత్వ లక్షణాలు చూసినా.. ప్రజామోదం చూసి ఎవరో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగించినా.. మిగతావాళ్లు ఊరుకోవడం లేదు.ఎవరికి వారే రాజకీయ బలప్రదర్శనకు దిగుతూ.. తొలి తరానికి తలబొప్పి కట్టిస్తున్నారు. కొన్ని పార్టీల్లో తొలి తరం నేతల మరణం తర్వాత చిచ్చు రేగుతుంటే.. మరికొన్ని పార్టీల్లో వారి కళ్ల ముందే కుంపట్లు రగులుతున్నాయి. తాము పెంచి పోషించిన పార్టీలో ఇంత రగడ జరుగుతున్నా.. వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. అదేమంటే కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే మాట గుర్తొస్తోందని వాపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయం మరీ చిత్రంగా ఉంటోంది. అంతా బాగున్నప్పుడు నేతలకు బలంగా మారుతున్న కుటుంబాలే.. పరిస్థితులు కలిసిరానప్పుడు బలహీనతగా మారి కొంప ముంచుతోంది. కాకలు తీరిన ప్రత్యర్థుల రాజకీయాన్ని అవలీలగా ఎదుర్కోగలుగుతున్నా.. సొంతింటి పోరును మాత్రం తీర్చలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. మొత్తం మీద కుటుంబ రాజకీయ కుంపట్లు కూడా ఉమ్మడి ఏపీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు వారసత్వంగా వస్తున్నాయని సరిపెట్టుకోవాల్సి వస్తోంది.దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు.. వాటిలో విభేదాలకు కొదువలేదు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పొలిటికల్ కుంపట్లు తప్పలేదు. కారణాలు ఏవైనా.. అధికార దాహం ముందు కుటుంబ బంధాలు విచ్ఛిన్నమౌతున్నాయనేది కాదనలేని వాస్తవం.
కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఒకానొక సమయంలో తన కుమారుడు కుమారస్వామిపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. 2006లో జేడీఎస్.. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా ధరమ్‌సింగ్‌కు దేవేగౌడ మద్దతు ప్రకటించారు. అయితే తండ్రి విధానాలను వ్యతిరేకించిన కుమారస్వామి.. రహస్యంగా ప్రతిపక్ష బీజేపీతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేశారు. దంతో ధరమ్ సింగ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని కుమారస్వామి సీఎం అయ్యారు. కొడుకు వ్యవహారం నచ్చని దేవేగౌడ.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. కొన్నాళ్ల పాటు ఆయనతో మాట్లాడలేదు. అయితే బీజేపీ-కుమారస్వామి బంధం ఎంతోకాలం నిలువలేదు. దీంతో ఆయన మళ్లీ తండ్రి గూటికి చేరుకున్నారు. అలాగే దేవెగౌడ మరో కుమారుడు రేవణ్ణతోనూ కుమారస్వామికి పొసగలేదు. చాలాకాలం అన్నదమ్ముళ్ల తగవు తీర్చలేక దేవెగౌడ సతమతమయ్యారు. చివరకు కుమారస్వామి వైపే మొగ్గడంతో.. రేవణ్ణ అయిష్టంగానే సర్దుకున్నారు. ఇప్పటికీ అప్పుడప్పుడు రేవణ్ణ కుమారస్వామికి తలనొప్పులు సృష్టిస్తూనే ఉన్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ లోనూ కుటుంబ పోరు రచ్చకెక్కింది. రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్.. ఏకంగా పార్టీనే చీల్చారు. 2023 జూలైలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే శివసేన- బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో షిండే శివసేన-బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే రాజకీయం అరంగేట్రంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ప్రవర్తించడం.. తనకు మనస్తాపం కలిగించిందని అజిత్ పవార్ చెప్పారు. కానీ అజిత్ దురుద్దేశంతోనే పార్టీని చీల్చారని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కోసం బాబాయ్ అబ్బాయ్ కలిసినా.. ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అదే రాష్ట్రంలో బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీ నుంచి ఆయన సోదరుడి కుమారుడు రాజ్ ఠాక్రే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. బాల్ థాక్రే తమ్ముడు శ్రీకాంత్ థాక్రే కుమారుడైన రాజ్ థాక్రే.. మొదట్లో బాల్ థాక్రేతో కలిసి మరాఠా గడ్డపై రాజకీయ వ్యవహారాలను చూసుకునేవారు. ఒకానొక సమయంలో బాల్ థాక్రే వారసుడు ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే కాకుండా రాజ్ థాక్రేనే అనే ప్రచారం జరిగింది. అయితే ఉద్ధవ్ థాక్రే ఎంట్రీతో రాజ్ థాక్రేకు దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలోనే రాజ్ థాక్రే.. పార్టీపైనే అసమ్మతి గళం విప్పడంతో ఆయనను పార్టీ నుంచి బాల్ థాక్రే బయటికి పంపించారు. దీంతో ఆ తర్వాత రాజ్ థాక్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేవా సమితి పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఇటీవల ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే ఒకే వేదికపై కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలోనూ కూడా కుటుంబ పోరు సాగింది. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వం విషయంలో వివాదం తలెత్తింది. కరుణానిధి ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి పార్టీ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటంతో డీఎంకే నుంచి బహిష్కరణ వేటు వేశారు. ఆ తర్వాత కరుణానిధి రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ పార్టీని నడిపించి.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. రాజకీయాల్లో తమ్ముడైనా, తనయుడైనా అడ్డుఅడ్డే అన్నాడు కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి. అప్పట్లో కరుణానిధి రిటైర్మ్‌మెంట్‌కు సమయం దగ్గరపడిన టైంలో ..తన వారసుడు చిన్న కొడుకు స్టాలినేనని ప్రకటించాడు. అయితే…వారసత్వం కోసం తమ్ముడితో దశాబ్దకాలంగా తగవులాడిన అన్న అళగిరికి ఈ ప్రకటనతో మండిపోయింది. తానుండగా…చిన్న కొడుకును ఎలా వారసుడిగా ప్రకటిస్తారని రెచ్చిపోయాడు. తమ్ముడు స్టాలిన్‌తో అళగిరి రాజకీయపోరాటం చాలా ఏళ్లు సాగింది. చిన్న కొడుకుపైనే తండ్రి ఎక్కువ ప్రేమ చూపించడానికి అళగిరి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు. తండ్రి తర్వాత అయితే గియితే…తానే పార్టీ అధినేత కావాలని చాలాకాలం కలలుగన్నాడు. తమ్ముడిపై ఉన్న కోపాన్ని అళగిరి ఎప్పుడూ దాచుకోలేదు కూడా. సందర్భం వచ్చినప్పుడల్లా…పార్టీలో తమ్ముడి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. దీనికి తోడు తమ్ముడి వర్గానికి సమాంతరంగా పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని పెంచి పోషిస్తూ వచ్చాడు.
తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో అళగిరికి ఎక్కువ పట్టుంటే, ఉత్తర తమిళనాడులో స్టాలిన్‌కు మద్దతుదారులెక్కువ. మదురై ప్రాంతం అళగిరిదైతే…చెన్నై చుట్టుపక్కల జిల్లాలు స్టాలిన్ శాసించారు. మొదటి నుంచి తండ్రికి రాజకీయా వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉన్న స్టాలిన్ పార్టీపై మంచి పట్టే సంపాదించాడు. డీఏంకే యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు. తండ్రి మరణించిన తర్వాత పార్టీని అన్నీతానే నడిపించి, ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నతో అభిప్రాయభేదాలున్నప్పటికీ…తండ్రి మద్దతు ఉండటంతో పెద్దగా పోరాడాల్సిన అవసరం రాలేదు. స్టాలిన్ సీఎం అయ్యాక అళగిరి కొంత తగ్గాడు. మొన్న ఇద్దరూ కలిసి ఒక కార్యక్రమంలో పలకరించుకున్నారు. కానీ నివురుగప్పిన నిప్పులా అళగిరి ఇంకా రగులుతూనే వున్నారని డీఎంకేలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. చివరకు సోదరి కనిమొళి కూడా ఆధిపత్యపోరులో స్టాలిన్ వైపే మొగ్గుచూపారు.
ప్రాంతీయ పార్టీలు స్థాపించిన రాజకీయ కుటుంబాలు ఏ సిద్ధాంతం చెప్పినా.. ఏ ఆశయం కోసం వచ్చామన్నా.. అల్టిమేట్‌గా అధికారం కోసం అర్రులు చాస్తాయని చెప్పటానికి చాలా ఉదాహరణలున్నాయి. పైగా తరం మారాక.. విలువలు తగ్గిపోయి.. కేవలం స్వార్థానికే పెద్దపీట దక్కుతోంది. దీంతో ప్రజలకు ఏమివ్వాలనే ఆలోచన పక్కకెళ్లిపోయి.. మనమేం తీసుకోవాలనే పేరాశ మొగ్గ తొడుగుతోంది. ఒక్కసారి కుటుంబం కంటే అధికారమే ముఖ్యమనే భావన వచ్చాక.. ఇక అన్న, అక్క, నాన్న.. అనే బంధాలు వేటికీ పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. పైగా ఏం చేసినా పవర్ కోసమే కదా అనే రాజకీయ గీతారహస్యాన్ని నేతలు బాగా ఒంటబట్టించుకుంటున్నారు.
ఉత్తరాదిన కూడా రాజకీయ కుటుంబాల్లో గొడవలున్నాయి. గాంధీ కుటుంబం దగ్గర్నుంచి అనుప్రియా పటేల్ ఫ్యామిలీదాకా.. అక్కడా విభేదాలు తలెత్తాయి. ఇక యూపీలో ములాయం, బీహార్‌లో లాలూ కుటుంబ గొడవలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి.
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సంజయ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మేనకా గాంధీని 1982లో ఇందిరాగాంధీతో విభేదాల కారణంగా బహిష్కరించారు. సంజయ్ గాంధీ వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న మేనకా గాంధీ ఆశయాలు.. ఇందిరాగాంధీ ఆలోచనలకు సరిపోలేదు. ఇక అప్పటికే తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దే పనిలో ఇందిరా గాంధీ ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలోని తన మద్దతుదారులతో కలిసి 1982లో ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేనకా గాంధీ సొంతంగా ఏర్పాటు చేయడం సంచలనం రేపింది. ఇది కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే చర్యగా భావించిన ఇందిరా గాంధీ.. మేనకా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం మేనక జనతాదళ్ పార్టీలో చేరి.. ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మేనకాగాంధీ.. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఇన్నేళ్లైన తర్వాత కూడా సోనియా కానీ, రాహుల్ కానీ మేనక, వరుణ్‌ను దగ్గరకు తీసే ప్రయత్నం చేయడం లేదు. వారు కూడా కాంగ్రెస్ లోకి రావాటనికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు.
ఉత్తర్‌ప్రదేశ్‌ను కొన్నేళ్ల పాటు పరిపాలించిన సమాజ్ వాదీ పార్టీలోనూ కుటుంబ పోరు కొనసాగింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతోపాటు.. వ్యతిరేకంగా వైఖరి అనుసరించడంతో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్.. తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను ఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్.. సమాజ్‌వాదీ పార్టీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ లోక్‌సభ ఎంపీలుగా ఉన్నారు. ఇప్పటికీ బాబాయ్ అబ్బాయ్ మధ్య సయోధ్య కుదరలేదు. సమీప భవిష్యత్తులోనూ బాబాయ్ ను అక్కున చేర్చుకునే ఆలోచన అఖిలేష్‌కు లేదంటారు సమాజ్‌వాదీ పార్టీ నేతలు. అటు శివపాల్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.
బిహార్‌లో ఆర్జేడీలోనూ అధికారం కోసం ఇంటి పోరు నడిచింది. ఆర్జేడీ పార్టీ నుంచి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆ పార్టీ అధినేత, బిహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతో తేజ్ ప్రతాప్ యాదవ్‌పై వేటు వేశారు. అంతకుముందు లాలూ వారసత్వం కోసం తేజ్‌ప్రతాప్ తన తమ్ముడైన తేజస్వితో పోటీపడ్డారు. అయితే ఇక్కడ కూడా తమిళనాడు ఫార్ములానే లాలూ అనుసరించారు. పెద్ద కొడుకుని కాదని చిన్న కొడుకైన తేజస్వివైపు మొగ్గారు. తేజ్‌ప్రతాప్‌తో పోలిస్తే తేజస్వి అన్నిరకాల అర్హుడని లాలూ మాత్రమే కాకుండా ఆర్జేడీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఈ పోకడ నచ్చని తేజ్‌ప్రతాప్… కొన్నాళ్లు రెబల్‌గా వ్యవహరించారు. తర్వాత తన బలం తెలుసుకుని తండ్రి చెంతకు చేరినా.. తమ్ముడితో మాత్రం సర్దుకుపోలేకపోయారు. పైగా తేజస్విపై విపరీతమైన అసూయతో రగిలిపోయారు. ఈ కారణంతోనే తేజస్వి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడంతో.. లాలూ ఇక తప్పని స్థితిలో తేజ్‌ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
అదే రాష్ట్రంలో అబ్బాయిపై బాబాయి తిరుగుబాటు.. లోక్‌జనశక్తి పార్టీలో చీలికకు దారితీసింది. దళిత దిగ్గజం రాం విలాస్ తనయుడు చిరాగ్ పాసవాన్‌ను ఒంటరిని చేసింది. నిజానికి రాంవిలాస్ మరణించిన కొద్ది రోజులకే చిరాగ్, ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పారస్ మధ్య విభేదాలు తలెత్తాయి. రాం విలాస్ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చిరాగ్‌కు దక్కాయి. అయితే అతడి వ్యవహార శైలి, దుందుడుకు మనస్తత్వంతో పశుపతి అసంతృప్తి చెందారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్యా విభేదాలు రాగా.. ఒకానొక సమయంలో ఆవేశానికి లోనైన చిరాగ్.. పశుపతిని వేరు చేసి మాట్లాడారు. నువ్వు మా రక్తసంబంధానివి కాదు అంటూ నోరుజారారు. ఆ మాటే పశుపతి తిరుగుబాటుకు కారణమైంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నీతీశ్ ప్రతీకార రాజకీయాలు కూడా దీనికి తోడయ్యాయి. గతంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతూ చిరాగ్ తీసుకున్న నిర్ణయాన్ని పశుపతి తీవ్రంగా వ్యతిరేకించారు. చిరాగ్ నిర్ణయంతో ఆ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన నీతీశ్ కుమార్‌కు ఈ విషయం ఉప్పందింది. దీంతో మరో నేతతో కథ నడిపించి పశుపతిని ఎదురుతిరిగేలా చేశారనే ప్రచారం ఉంది. ఏదేమైనా ఎన్డీయేతో చిరకాల మైత్రి ఉన్న ఎల్‌జేపీ.. ఇప్పుడు రెండుగా చీలిపోయింది. అయితే తర్వాతి కాలంలో రాంవిలాస్ వారసుడిగా చిరాగ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో వంద శాతం ఫలితాలు సాధించడం ద్వారా.. అందరి దృష్టినీ తనవైపుకి తిప్పుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పార్టీల్లో ఒకటైన అప్నాదళ్‌లో ఏకంగా తల్లీ, కూతుళ్ల వైరం పతాకశీర్షికలెక్కింది. యూపీ ఎన్నికల కోణంలో అనుప్రియ పటేల్‌కు మంత్రి పదవి దక్కుతోందనే భావన ఉన్నా.. ఆమె వెనుక రాజకీయ చరిత్ర చాలానే ఉంది. రాజకీయంగా అనుప్రియ ఇంటిపోరును ఎదుర్కొంటున్నారు. యూపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ కూతురే అనుప్రియా పటేల్. కేంద్ర మంత్రి వర్గంలో అనుప్రియ చేరడం ఆమె తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న పేరుతో తన కూతురిని పార్టీనుంచి బహిష్కరించారు కృష్ణాపటేల్. నిజానికి 2009 నుంచి తల్లీకూతుళ్ల మధ్య వార్ నడుస్తోంది. అప్నాదళ్ వ్యవస్థాపకుడు అనుప్రియ తండ్రి సోనేవాల్ మరణించడంతో రాజకీయ వారసత్వం విషయంలో తల్లీకూతుళ్ల మధ్య యుద్ధం నడుస్తోంది. 2012 యూపీ ఎన్నికల్లోనే తొలిసారిగా అనుప్రియా పటేల్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండేళ్ల తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. మంచి వక్తగా అనుప్రియకు పేరుంది… కుర్మి కులానికి చెందిన మహిళ కావడం, యూపీలో ఆ కులం రాజకీయంగా కీలకంగా కావడంతో బీజేపీ అనుప్రియకు మంత్రి పదవి కట్టబెట్టింది. ఈ పరిణామం తల్లికి మాత్రం ఏమాత్రం నచ్చలేదు. తల్లీకూతుళ్ల మధ్య పార్టీ పగ్గాల గొడవే కాదు తండ్రి ఆస్తులపైనా పరస్పరం దూషించుకున్నారు. అనుప్రియా పటేల్ బీజేపీతో కలిసి సాగుతుంటే…ఆమె తల్లి మాత్రం ప్రత్యర్థి పక్షాలతో కత్తులు దూస్తున్నారు. మరో కూతురు పల్లవి పటేల్ కూడా అమ్మ చెంతన చేరి, సోదరిపై గొడవపడ్డారు. 2024లో మీర్జాపూర్ ఎన్నికల్లో సిస్టర్ వర్సెస్ సిస్టర్ కాంటెస్ట్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల ప్రచారంలో పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులపై బహిరంగంగా దూషించుకున్నారు. ఇలా తల్లి, సోదరితో ఇప్పటికీ పోరాడుతున్నారు అనుప్రియా పటేల్. అయితే సొంత నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న అనుప్రియ పటేల్.. కుటుంబ ప్రత్యర్థుల కంటే తానే మెరుగని బీజేపీ దగ్గర బాగానే మార్కులు కొట్టేశారు.
ఇలా చెప్పుకుంటూపోతే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నో కుటుంబ రాజకీయ చిత్రవిచిత్రాలు. వారసత్వం కోసం గొడవలు సర్వసాధారణంగా మారాయి. ఒకవేళ ఒకే పార్టీనే అంటిపెట్టుకుని వున్నా పదవులు, ప్రాధాన్యత కోసం గొడవపడిన సంధర్భాలున్నాయి. ఇలా ఏ రాజకీయ కుటుంబ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణంగా పరిస్థితి మారిపోయింది. ఏతావాతా రాజకీయ కుటుంబాల్లో.. రక్తసంబంధాలు ఉన్నా.. తెగిపోయినా.. దానికి కూడా అంతిమ కారణం రాజకీయం కావడం.. నడుస్తున్న కలియుగ మహాభారతానికి పరాకాష్ట అనే చెప్పాలి.