Storyboard: మన దేశంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికీ ఉండదు. తమ వారి పెళ్లి గొప్పగా జరగాలని ఖర్చుకు వెనకాడకుండా అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చివరికి పిల్లల ఇష్టాన్ని కాదనలేక వైభవంగా పెళ్లి జరిపిస్తున్నారు. దేశంలో వివాహాలను పెద్ద పండుగలా నిర్వహిస్తారు. పెళ్లి అంటే చాలా ఖర్చు కూడా ఉంటుంది. పెళ్లి వేడుకను నిర్వహించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో బలం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇది ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది. ఒక చైన్ సిస్టమ్‌లా పని చేస్తుంది. క్యాటరింగ్ సేవలు, కూరగాయలు, ధాన్యాలు, మాంసం, పాలు, బట్టలు..ఇలా అనేక రకాల పనులు ఇందులో ముడిపడి ఉంటాయి.
పెళ్లిళ్ల సీజన్ వ్యాపారులకు కూడా ఆర్థికంగా తోడ్పడుతుంది. రెండు నెలల్లో భారత్‌లో దాదాపు 48 లక్షల వివాహాలు జరగనున్నాయి. వాటి ద్వారా రూ.6 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ఇది. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ వ్యాపారులు బిజీబిజీగా మారడం కామన్. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ముఖ్యంగా 48 లక్షల వివాహాల్లో ఢిల్లీలోనే 4.5 లక్షల వివాహాలు జరగనున్నాయి. దీని ద్వారా ఢిల్లీ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు రూ.1.5 లక్షల కోట్లు అనుసంధానం కానున్నాయి. నవంబర్ 12న పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే ధంతేరాస్ సందర్భంగా వివాహ సంబంధిత బంగారం కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు చెప్పారు. వివాహ సమయంలో బట్టలు, వెండి, బంగారం, వజ్రాల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి భారీ మొత్తంలో వస్త్రాల కొనుగోళ్లు ఉంటాయి. వివాహంలో ఆహారం కూడా ముఖ్యమైన భాగం. దీనితో ఈ రంగంలోనూ భారీగా డబ్బును ఖర్చు చేస్తారు. అంతే కాకుండా వాహన కొనుగోలు సహా పలు వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. భారత్‌లో పెళ్లిళ్లు చాలా వైభవంగా చేస్తారు.. దీంతో లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయి.
2024లో వివాహ వేడుకలకు సంబంధించి వెడ్‌మిగుడ్ సంస్థ 3,500 నూతన జంటలతో సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అంతకుముందు రెండు సంవత్సరాలకు సంబంధించి వెడ్డింగ్‌వైర్ ఇండియా వెల్లడించిన వ్యయాల ప్రకారం 2022లో సగటు పెళ్లి ఖర్చు రూ.25 లక్షలు, 2023లో రూ.28 లక్షలతో పోలిస్తే 2024లో భారీగా పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చిలో పెళ్లి చేసుకున్నవారు, చేసుకోబోతున్న వారి వివరాలు తెలిపారు. వివాహాలకు ఇంతగా ఖర్చు చేయడానికి కారణాలు విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో సంపాదిస్తుండటం, భవిష్యత్తులో మరింతగా సంపాదించగలమనే ధైర్యంతో తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే వధూవరులే సొమ్ము సర్దుబాటు చేస్తున్నారు. సిటీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా వారే కన్వెన్షన్ కేంద్రాల బుకింగ్ దగ్గరి నుంచి పెళ్లి మండపం అలంకరణ వరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహాలకు సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలు, ఇతర నగరాలకు వెళ్తుంటే మధ్యతరగతి వర్గాలు కన్వెన్షన్ సెంటర్లు, రిస్టార్టుల్లో వేడుకలను నిర్వహిస్తున్నాయి.
ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ఎంగేజ్‌మెంట్ వరకు తగ్గేదేలే అంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. బ్యాచిలర్ పార్టీలు, మెహిందీ, సంగీత్, పెళ్లి విందు, ఫొటోగ్రఫీ, పెళ్లి మండపం, అలంకరణల కోసమే వధూవరులిద్దరూ చెరో రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వేడుకల్లో విందుకు ఒక్కో ప్లేటుకు దాదాపు రూ.2వేల వరకు చేస్తున్నారు. వందకు పైగా రుచులను వడ్డిస్తున్నారు. పెళ్లికి బంధుమిత్రులకు పత్రికలు పంచడం, వచ్చిన వారిని పలకరించడం వంటి పెద్దరిక బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. ఇది వరకు కట్నకానుకలకు ఎక్కువ వ్యయం చేసేవారు. ఇప్పుడు సమాజంలో మారుతున్న మార్పులతో అమ్మాయి, అబ్బాయికి తమ ఆస్తిని చెరిసగం పంచి ఇస్తున్నారు. దీంతో వాటి గురించి కంటే వివాహ వేడుకలను ఎలా నిర్వహించాలనే చర్చే ఎక్కువగా వస్తోంది.
దేశంలో వివాహాల ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది. గతేడాది ఇదే సమయంలో జరిగిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఈ సారి 7 శాతం ఎక్కువ ఖర్చు చేశారు. అలాగే యావరేజ్ గా ఒక్కో వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ బడ్జెట్ రూ. 51.1 లక్షలుగా ఉంది.పింది. ప్రతి ఐదు పెళ్లిల్లో ఓ వివాహ ఖర్చు రూ. 50 లక్షలకు పైనే ఉంటోంది. ఈ సంవత్సరం ఆతిథ్యం, విందు ఖర్చు భారీగా పెరగడమే పెళ్లిళ్ల వ్యయం పెరగడానికి కారణమని తేలింది. పెళ్లిఖర్చుల గురించి జరిగిన సర్వేలో.. ఏకంగా 3,500 జంటల అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే శుభమాసాలు వచ్చేశాయో.. అప్పట్నుంచే వధూవరుల కుటుంబాలు అలర్టయ్యాయి. పెళ్లంటే ముందుగా కావాల్సింది పెళ్లి మండపం.. ఈ పెళ్లి మండపానికి లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితులున్నాయి. ఆతర్వాత పెళ్లి చేయించే పురోహితులు. వారికి ఒకేసారి ఎక్కువ పెళ్లిల్లు ఉండడంతో.. ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెళ్లికి అందుబాటులో ఉంచుకుంటున్నారు. మరోవైపు.. షామియానాలు, డెకరేషన్లు, క్యాటరింగ్.. అబ్బో ఒకటేమిటి అన్నింటా హడావుడే. ఎందుకంటే అది తమ గారాల పట్టి, ముద్దుల తనయుడి కల్యాణం మరి. కలకాలం గుర్తుండిపోయేలా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వివాహాలుఎక్కువగా ఉండడంతో ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉండడం లేదు. హైదరాబాద్ వంటి చోట్ల డబ్బులు ఎక్కువ పెడుతామన్న హాల్స్ దొరకడం లేదు. నగర శివార్లలో ఉన్న కన్వేషన్ సెంటర్స్ కూడా ముందే బుక్ అయిపోయాయి. ఫంక్షన్ హాల్స్, కన్వేషన్ సెంటర్స్, బాంక్వెట్ హాల్స్ ధరలు కూడా డిమాండ్‌కు తగ్గట్టే ఉన్నాయి. దాదాపు లక్ష నుంచి మొదలు పెడితే 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లతోపాటు ఫ్లవర్ డెకరేటర్స్, బ్యూటిషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, షామియానా సప్లయర్స్, మంగళవాయిద్యాల వారు, ఆర్కెస్ట్రా, కేటరింగ్ వారికి ఫుల్ గిరాకీ ఉంది. ఎంత అయితేనేం ముహూర్తానికి సౌకర్యం ఉంటే చాలు అనుకుంటున్నారు. మన దేశంలో ఏటా దాదాపు కోటి జంటలు వివాహ బంధంతో ఒకటవుతుంటాయి. ఈ సంఖ్య ఏటా 7 నుంచి 8 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో పెళ్లిళ్ల ఖర్చులు ఏటా ఎంత లేదన్నా సుమారు 11 లక్షల కోట్లు వరకు ఉంటాయని అంచనా. టర్నోవర్‌పరంగా చెప్పాలంటే వెడ్డింగ్ పరిశ్రమ మన దేశంలో నాలుగో పెద్ద పరిశ్రమ.
పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఓ మధుర ఘట్టం. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేటి యువతీయువకులు కలలు కంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతపీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను తమ స్థోమతకు తగ్గట్టు అట్టహాసంగా చేయాలని ఆరాటపడుతుంటారు. పిల్లల కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. గతంలో పెళ్లిళ్లు అన్నీ వధూవరుల ఇంట్లో లేదా దగ్గరలోని కల్యాణ మండపాల్లో జరిగేవి. ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోతోంది. ఆర్థిక స్థోమతను బట్టి రాజస్థాన్ లేదా గోవా ఇందుకు వేదికలవుతున్నాయి. సెలబ్రైటీలైతే విదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు ధూమ్‌ధామ్‌గా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ ప్లానర్లకూ గిరాకీ పెరిగింది. బంధుమిత్రులకు టిక్కెట్ల బుకింగ్, విడిది సదుపాయల నుంచి కల్యాణ మండపాల అలంకరణ, వధూవరుల మేకప్ వరకు అన్నీ వీరే చూసుకుంటారు.
మొన్నటిదాకా పెళ్లంటే రెండు కుటుంబాలకు సంబంధించిన వేడుక మాత్రమే. ఓ భావోద్వేగ బంధం. కానీ ఇప్పుడలా కాదు. పెళ్లి చేసుకునే వారి కంటే.. పెళ్లి పనుల్లో పాలు పంచుకునే వారి హడావుడి ఎక్కువగా ఉంటోంది. పెళ్లిళ్ల కారణంగా ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో భారీగా వృద్ధి చెందుతోంది. ఈసారి పెళ్లిళ్ల సీజన్ బిజినెస్.. గత ఏడాది మ్యారేజ్ సీజన్‌లో జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29 మరియు డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో శుభప్రదమైన వివాహ తేదీలుగా గుర్తించారు. వీటి తర్వాత ఒక నెల విరామం అనంతరం జనవరి నుంచి మార్చి 2025 మధ్యలో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఈ సీజన్ గతంతో పోల్చుకుంటే మంచి వృద్ధి రేటును చూసిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మనసెరిగిన వ్యక్తితో కలసి నడవాలని అమ్మాయిలకు, తమ ఇళ్లను చక్కదిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు భాగస్వామి ఎంపికలో అన్నీ ఆలోచిస్తున్నారు. తాము ఇష్టపడ్డ వారి గురించి కన్నవారి మనసును కష్టపెట్టకుండా ఒప్పించుకుంటున్నారు. దీంతో కులమతాలకు అతీతంగా ఎన్నోజంటలు ఒక్కటవుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగకుండా తమకు నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు.
పెళ్లిల్లు సమాజానికి ఎంత అవసరమో.. దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టతకు అంతే అవసరం. ఎందుకంటే.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో లక్షలకోట్ల బిజినెస్ జరుగుతుంది. అన్నిరకాల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా కంపెనీల షేర్ల విలువ పెరిగి..స్టాక్ మార్కెట్ పటిష్టతకు దోహదపడుతుంది..పెళ్లిళ్ల సీజన్ కోసం దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారులు సిద్ధమయ్యారు.. నగల వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, క్యాటరింగ్, ఆటోమొబైల్, ఈవెంట్ మేనేజర్లతో సహా అనేక ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు దీని నుంచి బిజినెస్ పొందనున్నారు. ప్రస్తుతం దేశంలో ల్యావిష్ వెడ్డింగ్ కల్చర్, డెస్టినేషన్ వెడ్డింగ్, ప్రీవెడ్డింగ్ షూట్స్ అంటూ రకరకాల పద్ధతులు రావటంతో పెళ్లికి అవుతున్న ఖర్చు సైతం భారీగానే ఉంటోంది.