అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.
రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కాగా.. ఏపీ నుంచి ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికైన వారికి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఆర్జీ కర్ అత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కి బెయిల్..
కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు స్థానిక తలాపోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మోండల్‌కి సీల్దా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 09న ఆర్జీ కర్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో మోండల్ జాప్యం చేశారని, సందీప్ ఘోష్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు వెస్ట్ బెంగాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి ట్రాన్‌ఫర్ అయింది. సీబీఐ వీరిద్దరిని అరెస్ట్ చేసింది.
2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమని, గ్రీన్ పవర్ ఉత్పత్తికి ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నాంమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 2030 నాటికి 20 గిగా వాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. పునరుత్పత్తి (గ్రీన్ పవర్) విద్యుత్ రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిసెంబర్ 14 నుండి 20, 2024 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (TGREDCO) అధికారులు రూపొందించిన 2025 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ పొదుపు క్యాలెండర్ను శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వం తొందరపాటు చర్య!
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో సుమారు 20 మంది చనిపోయారని.. ఆ ఘటనకు ఎవరిని బాధ్యులుగా చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతుల పంటకు ఇన్స్యూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ రోజు నిరసన చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నీటి సంఘం ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగడం లేదని.. పోలీసులను పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారని అన్నారు. నీటి సంఘం ఎన్నికలను వైసీపీ పార్టీ బహిష్కరిస్తోందన్నారు. అవంతి తన అవసరాల కోసం రాజీనామా చేసి ఉంటారని.. అది ఆయన ఇష్టమని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండాలా?
అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు దీంతో ప్రస్తుతానికి చంచల్గూడా జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. అయితే హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు అనంతరం ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను ఆయనకు నిరాకరించలేమని హై కోర్టు తేల్చి చెప్పింది.
ట్రంప్ రాకముందే.. “సరిహద్దు గోడ”ను అమ్ముకుంటున్న జోబైడెన్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనవరి 20,2025న ఆయన అధ్యక్ష బాధ్యతల్ని తీసుకోబోతున్నారు. అయితే, ఆయన పదవి చేపట్టే ముందే ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిహద్దు గోడకు సంబంధించిన సామాగ్రిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. దక్షిణ సరిహద్దు గోడకు సంబంధించిన వస్తువుల్ని అమ్ముతున్నాడని రిపబ్లికన్లు, డెమోక్రాట్లను నిందిస్తున్నారు. తర్వాత వచ్చే ట్రంప్‌కి ఇబ్బందులు కలిగించేలా బైడెన్ ప్రవర్తిస్తున్నట్లు రిపబ్లికన్లు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని పంపించేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అమెరికా-మెక్సికో మధ్య భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భరోసా హామీ ఇచ్చిన మంత్రి దామోదర
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల ఉద్యోగాలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ భరోసానిచ్చారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను ఉద్యోగం నుంచి తీసేయబోమన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తనను కలిసిన ఏఎన్‌ఎంలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు కోరగా, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి వివరించారు. ఏఎన్‌ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న జరుగుతున్న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
జనం ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారని, దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడని, ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారని, జనం ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా అని ఆయన ప్రశ్నించారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని, కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదన్నారు. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారని, దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ
వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు. ఈ సందర్భంగా SAEL SOLAR కంపెనీ ప్రతినిధులు.. 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు. దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో.. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్‌లను SAEL SOLAR కంపెనీ నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వారితో పాటు నార్వే, రష్యా, బ్రెజిల్, చైనా (బ్రిక్స్) దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తల బృందం కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ని కలిసి పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు తమ ఆసక్తిని వ్యక్తీకరించారు. సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే విధంగా చెత్త నుంచి విద్యుత్ (వేస్ట్ ఎనర్జీ) ఉత్పత్తి చేయడంతో పాటు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తమకు వున్న అనుభవాన్ని, పెట్టుబడులు పెట్టడానికి తమ సుముఖతను పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు.