Storyboard: నిన్నమొన్నటిదాకా బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహించిన కవిత.. ఇప్పుడు సొంత పార్టీపైనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఆ మాటకొస్తే ఇప్పటికీ తెలంగాణ జాగృతి పూర్తిగా తన వెంటే ఉందని ఆమె చెబుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌పై రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు, కవిత చేసే ఆరోపణలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఎంత విమర్శించినా.. అది రాజకీయమని జనం సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ చేస్తే కక్ష సాధింపు అనుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ కవిత ఎపిసోడ్ లో జరుగుతున్నది వేరు. ఎందుకంటే కవిత విమర్శల్ని అంత తేలిగ్గా కొట్టిపారేసే పరిస్థితి ఉండదు. ఆమె చెప్పినట్టుగా రెండు దశాబ్దాలుగా కవిత ఉద్యమంలో, పాలనలో బీఆర్ఎస్‌తో మమేకమయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ తో కలిసి పనిచేశారు. అందుకే ఆమె మాటల్ని తెలంగాణ సమాజం కచ్చితంగా నమ్మే అవకాశం ఉంది. తన కుటుంబ సభ్యుల్ని ఎవరి గురించి కవిత చెప్పినా.. ఆ మాటల్లో సాధికారికత ఉంటుందని విశ్వసించవచ్చు.
ఇక కవిత రాజకీయ ప్రస్థానం తీసుకుంటే.. ఆమె కేసీఆర్ కూతురిగానే అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఉద్యమానికి సమాంతరంగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడపడంలో బాగా చేయగలిగారు. తెలంగాణ జాగృతి పేరుతో కవిత తెలంగాణ వ్యాప్తంగా బలమైన కల్చరల్ నెట్ వర్క్ ఏర్పరుచుకున్నారు. అధికారం వచ్చాక జాగృతిని ఉపయోగించుకునే బతుకమ్మ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. కేసీఆర్ బీఆర్ఎస్‌లో తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. అలా బాధ్యతల పంపకాల్లో భాగంగా కవితకు సాంస్కృతిక బాధ్యతలు ఇచ్చారు. ఆమె కూడా తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ పనిచేసుకుంటూ వచ్చింది.
బీఆర్ఎస్ ఉద్యమంలోనే కాదు.. బీఆర్ఎస్ విజయాల్లోనూ కవిత భాగస్వామే అనడంలో మరో మాటకు తావు లేదు. అదే విధంగా పాలనలో కూడా ఆమె భాగస్వామి అయ్యారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత.. 2019 ఎన్నికల్లో ఓడినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్నారు. అసలు పదవి ఉన్నా.. లేకపోయినా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో భాగంగానే ఉన్నారు. కాబట్టి ప్రతి విషయం గురించి ఆమెకు పూర్తి అవగాహన ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అందుకే కవిత చేస్తున్న ఆరోపణల్ని, విమర్శల్ని జనం తేలికగా తీసుకుంటారనుకోకూడదు. పైగా కవిత అదేదో సాధారణ రాజకీయ విమర్శల్లా చేయడం లేదు. ఆడబిడ్డ అనే సెంటిమెంట్ ను రంగరించి మరీ బాణాలు సంధిస్తున్నారు. కేసీఆర్ దేవుడేనని చెబుతూ.. హరీష్, సంతోష్ ను మాత్రమే వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కవిత గతంలో తన సోదరుడు కేటీఆర్‌ను పరోక్షంగా విమర్శిస్తూ, పార్టీలో గ్రౌండ్-లెవెల్ కార్యకలాపాలు లేవని, కేవలం ట్విట్టర్ పోస్ట్‌లతో పార్టీ నడవడం సాధ్యం కాదని కామెంట్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కవిత చేసిన విమర్శలు.. .. కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఎండార్స్ చేసినట్టైంది. తద్వారా ప్రత్యర్థులకు, సీబీఐ విచారణ అడిగిన కాంగ్రెస్ సర్కారుకు కవిత.. పెద్ద బూస్ట్ ఇచ్చినట్టైంది. ఇప్పుడు ఈ అంశంపై మరిన్ని విమర్శలను పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సొంతింటి బిడ్డే అవినీతి సర్టిఫికెట్ ఇచ్చిందని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ కోణంలో పార్టీని కవిత మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తోంది.
ప్రస్తుతానికి కవిత.. బీఆర్ఎస్ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు. మరిన్ని విషయాలు ఉన్నాయి. ఒకటొకటిగా చెబుతానన్న కవిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇంతకు ముందు లాగా పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకునే పరిస్థితి ఇకపై ఉండకపోవచ్చు. అలా చెప్పినా క్యాడర్ కూడా నమ్మరేమో అనే అనుమానాలు బీఆర్ఎస్ నేతలకు వస్తున్నాయి. కవితను సస్పెండ్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ రాజకీయంగా సేఫ్ అవుతుందనే నమ్మకం తక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కవిత ఎక్కుపెట్టిన అస్త్రాలన్నీ ఇప్పటిదాకా సూటిగానే లక్ష్యాన్ని ఛేదించాయనే ప్రచారం జరుగుతోంది. కవిత చెప్పిన మాటల్లో కొన్ని విషయాల గురించి ఇన్నాళ్లూ బహిరంగంగా మాట్లాడటానికి కూడా బీఆర్ఎస్ ఇష్టపడలేదు. అలాంటి సున్నితమైన విషయాల్ని కూడా కవిత బాహాటంగా బయటపెట్టడం.. ఆమె ఉద్దేశాల్ని చెప్పకనే చెబుతోంది. నిజానికి కవిత మాటలతో నష్టం లేదంటున్న బీఆర్ఎస్ నేతల కామెంట్లలో కూడా లోలోపల భయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కవిత ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. భవిష్యత్తులో జనంలోకి వెళ్తే.. అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంగతి బీఆర్ఎస్ నేతలకు కూడా తెలియంది కాదు. మరి కవిత నుంచి ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఆ పార్టీ ఎలా ఎదుర్కుంటుందనేది చూడాల్సి ఉంది.