Story board: రెండు వందల సంవత్సరాలు భారత్‌ను తమ కబంధ హస్తాల్లో బిగించిన ఆంగ్ల పాలకుల్ని తరిమేయడానికి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి పౌరుడూ ఓ యోధుడయ్యాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో సామాన్యుడు సైతం దేశం కోసం సర్వం త్యాగం చేశాడు. జెండా పట్టుకుని భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు నడుం బిగించాడు. అలా అందరి రక్తం, కష్టం, త్యాగం సమ్మిళితంగా మన చేతికందిన స్వాతంత్య్రం చాలా విలువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు కేవలం జెండా ఆవిష్కరణలతో సరిపెట్టకుండా.. ఇన్నాళ్లలో మనం ఏం సాధించాం..? ఇంకా ఏం సాధించాల్సి ఉంది..? అనే ప్రశ్నలు ఎవరికి వారే వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 1947 నాటి ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది. మన పూర్వీకుల వరకూ ఎందుకు… ఈ నాటి యువత తల్లిదండ్రుల్ని అడిగితేనే తాము ఎలాంటి మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో పెరిగామో కథలు కథలుగా చెబుతారు.
ఓ ముప్ఫై ఏళ్ల క్రితం వరకూ సగం జనాభాకు కరెంట్ అంటే తెలియదు. ఇంటర్నెట్ అనే పదం కూడా తెలియదు. ఇక రోడ్లు , మంచినీరు , గ్యాస్ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి పరిస్థితుల్ని … ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటే దేశం ఎంతో పురోగమించిందని అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరెంట్ అందని గ్రామం లేదని కేంద్రం ప్రకటించింది. చిట్ట చివరి గ్రామానికీ విద్యుత్ వెలుగులు అందించామని తెలిపింది. ఇక విద్య, వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. అందరికీ సరిపడా అందుతున్నాయా అంటే.. సంతృప్తికరం అని చెప్పలేం కానీ.., నిన్నటి కంటే ఈ రోజు మెరుగు అని మాత్రం చెప్పగలిగే స్థితిలో భారత్ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ ఎలా లైన్లు కట్టేవారో, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎలా వేచిచూసేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటలకొద్దీ వేచి ఉండేవారో చాలా మంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు కానీ.. అంతకుముందు తరాలకు ఇవి అనుభవమే. స్కూటర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన స్థితి నుంచి ఇవాళ ఎక్కడిదాకా ప్రయాణించామో చూస్తున్నాం. అవన్నీ కనిపించే నిజాలే. టెక్నాలజీ వినియోగం, సరఫరా వ్యవస్థలో వచ్చిన మార్పులు, లైసెన్సింగ్ విధానంలో మార్పులు ప్రధానంగా పనిచేశాయి. సేవా రంగంలో, అనేక రోజువారీ పనుల్లో వ్యక్తిగత వివక్షను చాలా వరకు తొలగించగలిగారు. అది మధ్యతరగతి రోజు వారీ జీవనాన్ని చాలా వరకు సులభతరం చేసింది.
కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయ్యాక కూడా.. భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ సగం మందికిపైగా పేదరికంలోనే ఉన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్‌లో ఇంతమంది పేదలు ఉండటం కచ్చితంగా వైఫల్యమే. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. కానీ పేదలు మాత్రం పైకి రావడం లేదు. పేదరికం తగ్గిపోయిందని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉండవచ్చు. కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం కన్నా ఒక్క పైసా సంపాదించుకున్నా వాళ్లు పేదలు కాదనడం… మనల్ని మనం మోసం చేసుకోవడమే. దేశంలో విద్య, వైద్యం అందని వారంతా పేదలుగానే భావించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో ఆ వైరస్ బారిన పడి ఎంత మంది .ఎన్ని లక్షల కుటుంబాలు అప్పులపాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనిక.. పేద తేడా లేదు. అందరూ ఆస్తులు కోల్పోయారు. అప్పుల పాలయ్యారు. కేవలం రేషన్ కార్డు ఉన్న వారే పేదవాళ్లు.. మిగతా వాళ్లెవరూ కాదనడం ఎంత మూర్ఖత్వమో.. ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకున్న రోజునే నిజమైన పేదరిక నిర్మూలనకు బీజాలు పడతాయి. ఇక స్వతంత్ర భారత్ ను కుదిపేస్తున్న మరో పెద్ద వైఫల్యం ఆదాయ అసమానతలు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశాన్ని చూసి సంతోషించాలా.. అంతకంతకూ పెరుగుతున్న ఆదాయ అంతరాలను చూసి కలవరపడాలా అనే మీమాంస తప్పడం లేదు.
భారత్ 1994-2011 మధ్యలో వేగంగా దారిద్ర్యాన్ని తగ్గించగలిగింది. ఈమధ్య కాలంలో దారిద్ర్యాన్ని 45 శాతం నుంచి 21.9 శాతానికి తగ్గించగలిగింది. సంఖ్య రీత్యా చూస్తే, పదమూడు కోట్లమందికి పైగా ప్రజలను దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చేసింది. 2011 తర్వాత భారత్ అధికారికంగా గణాంకాలు విడుదల చేయలేదు. సర్వే చేశారుగానీ, నివేదిక విడుదల చేయకుండా ఆపేశారు. వరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం 2019నాటికి దుర్భర దారిద్ర్యం 10.2 శాతానికి తగ్గింది. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన పురోగతి కనబరిచాయి. 2019 తర్వాతి గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్న వారి శాతాన్ని సింగిల్ డిజిట్ దగ్గరకు తేవడానికి మూడు దశాబ్దాలు పట్టిందని, అందులోనూ సంస్కరణల యుగంలోని 30 ఏళ్లు కీలక పాత్ర పోషించాయనేది తేలుతున్న వాస్తవం. ముప్పై ఏళ్ల క్రితం దేశంలో దాదాపు సగభాగం అంటే 45 శాతం దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే ఇవాళ నూటికి పదిమంది దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. ఇది చెప్పుకోదగిన మార్పు. గరీబీ హఠావో అన్న నినాదాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో ఈ మూడు దశాబ్దాల్లో విశేషమైన పురోగతి ఉంది. అదే సమయంలో, సంస్కరణలు ఆరంభమైన ఈ మూడు దశాబ్దాల్లో అసమానతలు విపరీతంగా పెరిగాయి. బిలియనీర్ల సంపద అమాంతంగా పెరిగిపోతూ వచ్చింది. జాతీయ సంపదలో దిగువన ఉన్న వారి సంపద పడిపోతూ వస్తోంది.
90ల్లో ఫోర్బ్స్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఒక్క పేరు కూడా లేదు. కానీ దేశంలో ఇప్పుడు వందకు పైగా బిలియనీర్లు ఉన్నారు. దేశంలో ఏటా బిలియనీర్ల సంఖ్యలో చెప్పుకోదగ్గ పురోగతి నమోదవుతోంది. అదే సమయంలో పెరుగుతున్న బిలియనీర్ల వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే బిలియనీర్లు మన దేశంలో సంపాదించి.. ఆ డబ్బుతో విదేశాలకు తరలిపోయి.. అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో ఇక్కడ సృష్టించిన సంపద.. దేశానికి ఉపయోగపడకుండా పోతోంది. మరీ ముఖ్యంగా గత పదేళ్లలో బిలియనీర్ల వలస ఆందోళనకరంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే మేధో వలసలతో ఇబ్బంది పడుతున్న దేశానికి.. కొత్తగా బిలియనీర్ల వలస ఆందోళ కలిగిస్తోంది. ఈ వలసలకు అడ్డుకట్ట వేయగలిగితే.. దేశం మరింత అభివృద్ధి సాధించేదనే అభిప్రాయాలు లేకపోలేదు. ఆ దిశగా సరైన కార్యాచరణ తీసుకోవటమే ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని. భారత్ కు ఉన్న అనుకూలతల్ని అర్థం చేసుకుని.. ఇప్పటికే ట్రాక్ లో పడ్డ రంగాలకు మరింత చేయూత ఇచ్చేలా ఎప్పటికప్పుడు విధానాలను సమీక్షించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగైతేనే అమృత్ భారత్ అభివృద్ధి చెందిన భారత్ అవుతుందనే మాట అక్షర సత్యం.
ఇప్పటికే శతాబ్దానికి మూడు వంతులుపైగా గడిచిపోయింది. టెక్నికల్‌గా మనం ఎక్కడకో పోయాం. చంద్రుడ్ని అందుకుంటున్నాం. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో భారతీయులే గ్రేట్ అన్న పేరు తెచ్చుకుంటున్నారు. కానీ.. అదే సమయంలో కాస్త వెనక్కి తిరిగి చూస్తే .. గురువింద గింజ చందం కనిపిస్తోంది. దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రజలు వదిలించుకోలేని సమస్య కులం, మతం . దేశం తరపున ఎవరైనా ఓ గొప్ప విజయం సాధిస్తే ముందుగా అతని కులం ఏమిటి అని వెదికే వారి సంఖ్య ఇండియాలో ఎక్కువ. ఓ మతం వారు విజయం సాధిస్తే ఆ మతం కనుక ప్రశంసించేవారూ తగ్గిపోతారు. ఇప్పటికీ అలాంటి మనస్తత్వాన్ని వదిలించుకోలేకపోవటం కచ్చితంగా వెనుకబాటే. ఆ విషయంలో మనం సాధించింది చాలా స్వల్పం. ఇంకా విశాలం చేసుకోవాల్సిన అభిప్రాయాలు అనంతం ఉన్నాయి. కానీ రాను రాను దేశంలో కులాల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు సైతం తమకూ రిజర్వేషన్లు కావాలని డిమాండు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే ఆ ప్రజాస్వామ్య పునాదులు ఇన్నేళ్లలో బలపడ్డాయా… బలహీనపడ్డాయా అని విశ్లేషించుకుంటే.. రెండోదే నిజం అని అంగీకరించక తప్పని పరిస్థితి. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే… వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలి. కానీ దేశంలో ప్రతి వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. న్యాయవ్యవస్థ సహా.. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు అన్నీ ఏదో ఓ సందర్భంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దీనికి కారణం రాజకీయ వ్యవస్థే. ప్రజలు ఇచ్చిన అధికారంతో మిగతా వ్యవస్థలను అదుపు చేయాలని రాజకీయ వ్యవస్థ అంతకంతకూ భావిస్తూ పోతూండటమే సమస్యలకు మూలం అవుతోంది. అదే ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అతి క్లిష్టమైనసమస్య కూడా ఇదే కావొచ్చు.
సమస్యలు అంటూ లేని మనిషి ఎలా ఉండడో.. అలాగే సమస్య అంటూ లేని దేశం కూడా ఉండదు. ఆ సమస్యలను ఎంత పకడ్బందీగా అధిగమిస్తారో… ప్రజలు ఎంత వివేకంగా ఉంటారో… వాళ్లని పాలించే వాళ్లు దేశం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో అన్నదానిపైనే దేశం పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇదే సూత్రం భారత్ కూ వర్తిస్తుంది. మనం సాధించిన విజయాలకు గర్వపడుతూనే.. సాధించాల్సిన లక్ష్యాల గురించి పట్టు వదలకుండా కృషి చేయటమే మన తక్షణ కర్తవ్యం.