చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి సామాజిక మాధ్యమాలు. వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తను భార్య.. భార్యను భర్త.. అతి కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. సంసారాల్లోకి చొచ్చుకొస్తున్న సోషల్ మీడియా కనీవినీ ఎరుగని దారుణాలకు దారి వేస్తోంది.
ఫేస్‌బుక్.. వాట్సాప్.. ఇన్‌స్టాగ్రామ్.. ట్విటర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువ. భావస్వేచ్ఛా ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు తొలినాళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ.. అవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు.. నేర ప్రవృత్తికి బాటలు వేస్తున్నాయి. సోషల్ మీడియాలో మొదలయ్యే పరిచయాలు ఎటెటో దారితీస్తున్నాయి. ఎదుటివారిని దారుణంగా చంపేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోని పరిచయాలన్నింటినీ ఒకే గాటన కట్టడానికి లేదు. కానీ.. స్వార్థంతో దుర్వినియోగం అవుతున్నవే ఎక్కువ శాతం. మన దేశంలో ఫేస్‌బుక్ వినియోగం అధికం. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటోంది. రోజూ గంటల తరబడి వాటిల్లోనే కాలక్షేపం చేసేవాళ్లు ఉన్నారు. కొద్దిరోజుల్లోనే ఫేస్‌బుక్ అందరికీ చేరువైంది. మన దేశంలో ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్న వారిలో మహిళల సంఖ్యే 23 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతిస్థానం ఇన్‌స్టాగ్రామ్‌ది. 27 శాతం ఇన్‌స్టా అకౌంట్స్ మహిళలదే. చిన్నా పెద్దా అనే తేడా లేదు. అన్ని వయసుల వారూ సోషల్ మీడియాకు బానిసలే. ఈ క్రమంలోనే సంసారాల్లో చిచ్చు రేగుతోంది. వైవాహిక బంధాలు రోడ్డున పడుతున్నాయి.
సామాజిక మాధ్యమాలను తొలుత విప్లవ భావాలకు.. తమ వాయిస్ వినిపించడానికి ఉపయెగ పడేవి. రాన్రానూ అంతా మారిపోయింది. స్వార్థపరులు వీటిల్లో దూరిపోయారు. స్కామ్‌లు.. ట్రాప్‌లు చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఇప్పుడా ట్రాపుల పరిధి విస్తృతమై.. మోసాలు.. హత్యలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కుటుంబాల్లో జరుగుతున్న అన్ని రకాల దారుణాలను చూస్తున్నాం. నెట్టింట్లో సంసారాలను బుగ్గి చేసుకుంటున్నవాళ్లు ఎందరో. ఫేస్‌బుక్ పరిచయాలు ఎంతటికి తెగిస్తాయో తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసిన శ్వేతారెడ్డి ఎపిసోడ్ ఒక ఉదాహరణ. వాస్తవంగా శ్వేతారెడ్డిది చింతలేని కుటుంబం. భర్త స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఆమె బ్యూటీషియన్. చేతినిండా సంపాదన ఉన్నా.. జీవితంలో ఏదో కోల్పోతున్నామన్న ఆలోచన ఆమెను ఫేస్‌బుక్ మాయలో పడేసింది. అక్కడ మొదలైన పరిచయాలు తప్పులు మీద తప్పులు చేసేలా ప్రేరేపించాయి. వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. అవి బ్లాక్‌మెయిలింగ్ స్థాయికి చేరడంతో.. మరో ఫేస్‌బుక్ మిత్రుడి సాయంతో ప్రియుడిని హత్య చేయించింది శ్వేతారెడ్డి.
అప్పట్లో ఫేస్‌బుక్‌లో రిక్వస్ట్‌లు పెట్టి స్కామ్‌లు చేసేవాళ్లు చెలరేగిపోయేవారు. మనకు తెలియకుండానవే మన ఫొటోలను పెట్టి మన ఫ్రెండ్స్ నుంచే డబ్బులు వసూలు చేసిన ఉదంతాలు పెరిగాయి. అదోక ఫ్రాడ్ అని తెలుసుకున్నది కొందరే. తెలియక డబ్బులు పోగొట్టుకున్నవారూ ఉన్నారు. ఇప్పుడు అంతా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి ఫ్రాడ్ చేసేవాళ్లు ఎక్కువై.. ఎదుటివారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. అది శ్రుతి మించితే హత్యలకు వెనకాడటం లేదు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన అనేక కేసులక్లో సోషల్ మీడియా పరిచయాలే కారణాలుగా తేలుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. నాగర్‌కర్నూల్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన స్వాతి ఎపిసోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియుడి కోసం కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు.
ఒకప్పుడు భర్త తప్పుచేస్తే భార్యలు కుమిలిపోయేవారు. బయటకు చెబితే నలుగురూ చులకనగా చూస్తారని.. నానా రకాలుగా చెప్పుకొంటారని నాలుగు గోడల మధ్యే కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు. అలాంటిది సోషల్ మీడియా వచ్చాక సీన్ రివర్స్. మహిళలే మహా కంత్రీలుగా మారిపోతున్నారు. సంసారాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఇందుకు కుటుంబ కలహాలు కావొచ్చు.. లేక వ్యక్తిగత అవసరాలు కావొచ్చు. చాలా ఈజీగా మోసగాళ్ల ట్రాప్‌లో పడిపోతున్నారు. రెండు వైపులా తప్పులు ఉన్నా.. అంతిమంగా బలవుతోంది మహిళలే. ఆ విషయం తెలుసుకునే సరికి తప్పు జరిగిపోతోంది. ఉరుకులు.. పరుగుల జీవితాల్లో ఏదో కోల్పోతున్నామనే.. కోల్పోయామనే ఆలోచన మహిళలను దారి తప్పేలా చేస్తున్నాయి సోషల్ మీడియా పరిచయాలు. తప్పుడు ఆలోచనలతో క్రమ క్రమంగా విష వలయంలో చిక్కుకుపోతున్నారు. తర్వాత వాటి నుంచి బయటకు రాలేక.. వాళ్లు హతం కావడమో.. ఎదుటివారిని చంపడమో చేస్తున్నారు. కొందరు సర్దుకుపోతుంటే.. మరికొందరు తెగించేస్తున్నారు. అందుకే బయటకు వస్తున్న దారుణాలు కొన్నే. బయటకు రానివి ఇంకెన్నో.
గత నెల రోజుల కాలంలో జరుగుతున్న హత్యలు.. నేరాలను చూస్తుంటే ఎక్కడో ఒక చోట సోషల్ మీడియానే కారణమని తేలడంతో ఈ కేసులు కూడా పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. సోషల్ మీడియా పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీసి ఎటెటో తీసుకెళ్లిపోతున్నాయి. ఇందుకు అత్యాశ.. అవసరాలు.. అవకాశాలే ప్రధాన కారణాలు. ఒకప్పుడు ఉన్నదాంతో సరిపెట్టుకునేవారు ఆలుమగలు. ఇప్పుడు ఉన్నది సరిపోదనే కాన్సెప్ట్ పెరిగిపోయింది. మారిన జీవనశైలి.. జీవన ప్రమాణాలు రకరకాల కోరికలకు బీజాలు వేస్తున్నాయి. వీటికి సోషల్ మీడియా పరిచయాలు.. సంభాషణలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఆలోచనా శక్తి నశిస్తోంది. భర్త, పిల్లలు, బాధ్యతలు.. కుటుంబ గౌరవం అన్నీ మర్చిపోతున్నారు. ఈ విషయంలో కేవలం మహిళలనే తప్పుపట్టడానికి లేదు. ఇంట్లో కొందరు భర్తల ఆలోచనలు కూడా ఇలాగే ఉంటున్నాయి.
సామాన్యులు.. మధ్య తరగతి.. సంపన్నులు అనే తేడా లేదు. ప్రతి వర్గంలోనూ సామాజిక మాధ్యమాలు పెట్టే చిచ్చు అంతా ఇంతా కాదు. ఫోన్లు దగ్గర మొదలయ్యే కోరికలు.. తర్వాత కార్లు.. విలాస జీవితం ఇలా ఫుల్ స్టాప్ లేకుండా సాగిపోతున్నాయి. తమకొచ్చే సంపాదన.. ఆదాయం ఏదీ ఆలోచించడం లేదు. ఏదోలా వాటిని సొంతం చేసుకోవాలి. భర్త లేదా కుటుంబ ఆదాయంతో సంబంధం లేదు. ఈ తరహా ఆలోచనలతో ఉన్నవాళ్లను సోషల్ మీడియాలో ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. వారి మాయలో పడి సంసాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు మహిళలు.
ఒకప్పుడు తీరిక దొరికితే ఇంట్లో పెద్దలు.. పిల్లలు కూర్చుని మంచిచెడ్డలు మాట్లాడుకునేవారు. కుటుంబ భవిష్యత్ కోసం ఏం చేస్తే బాగుంటుందో చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు తీరిక దొరికితే చాలు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వాటిల్లోనే మునిగిపోతున్నారు. భర్త, భార్య, పిల్లల మధ్య మాటల్లేవు.. మాట్లాడుకోవడాలు లేవు. ఇక్కడ రేకెత్తుతున్న తప్పుడు ఆలోచనలు దారుణాలకు దారులు వేస్తున్నాయి.
సోషల్ మీడియా పరిచయాలు సిల్లీగా కనిపించినా.. అవి ఎంతటి ప్రమాదకరమో.. ముక్కు మొఖం తెలియని వారితో మాటలు ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో గ్రహించలేకపోతున్నారు. ఒకప్పుడు ఇంటికి అపరిచితులు వస్తే.. పలు రకాలుగా ఆరా తీసేవారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాసెప్ట్ చేయడానికి క్షణం ఆలోచించడం లేదు. ఈ విషయంలో మగాళ్ల స్వార్థం మగాళ్లది.. మహిళల ఆలోచనలు మహిళలవి. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనగా మారిన విజయవాడ ఘటన ఒక ఉదాహరణ. బెంగళూరుకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా ఒక బాలికకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య జరిగిన ఛాటింగ్ చాలా చనువును పెంచింది. ఆంజనేయులు విజయవాడ వచ్చినట్టు తెలుసుకున్న ఆ బాలిక.. అతను ఉన్న హోటల్ వెళ్లాలని.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బయలుదేరింది. ఆ హోటల్ అడ్రస్ చూపిస్తామని అటకాయించిన ఆటోడ్రైవర్లు ఆ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన పోలీసులనే కాదు.. తల్లిదండ్రులను విస్మయ పరిచింది. కేవలం ఫేస్‌బుక్ పరిచయం.. మనుషులను ఏ స్థాయిలో ఆలోచన శక్తిని నశింప చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అనకాపల్లిలో కాబోయే భర్త గొతు కోసిన పుష్ప.. వనపర్తిలో ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య.. హనుకొండలో భర్త గొంతుకోసిన ఇల్లాలు.. ఇలా ఎన్నో ఘటనలు మరెన్నో చర్చలకు ఆస్కారం కల్పించినవే. కారణాలు ఏవైనా.. మారుతున్న జీవనశైలిలో ఇంకేదో ఆశిస్తూ మొగుళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు. పెళ్లి అయిన వారిది ఒక వరస అయితే.. పెళ్లి పీటలు ఎక్కేవాళ్లలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని కాబోయే భర్తకు పుష్ప ఇచ్చి చాకు ట్రీట్‌మెంట్ ఒక సంచలనం. కొందరు తాళిని ఎగతాళి చేస్తుంటే.. ఇంకొందరు తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈజీగా చంపేస్తున్నారు.
బిజీ లైఫ్‌లో భర్త దగ్గర లభించని సుఖాన్ని పరాయి వ్యక్తి దగ్గర కోరుకునేవాళ్లు కొందరు. ఇందుకు సామాజిక మాధ్యమాలు వారికి సాధనాలు అవుతున్నాయి. ఇలాంటి వారికోసమే వేచి చూసే కంత్రీగాళ్లకు ఈజీగా బుట్టలో పడిపోతున్నారు మహిళలు. తప్పు చేశామని.. చేస్తున్నామని గ్రహించి కొందరు త్వరగా బయటపడుతుంటే.. మరికొందరు ఎదుటివారి కుట్రలకు బలవుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రేమతో మాట్లాడటం.. పొగడ్తలు.. కాస్త కేరింగ్ తీసుకుంటే చాలు.. అదే లోకం అనుకుంటున్నారు కొందరు. ఇక డబ్బు లేనిదే జీవితం లేదనే ఆలోచనతో ఉంటున్నారు మరికొందరు మహిళలు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు.
ఇక్కడో ఉదాహరణ చెప్పుకోవాలి. నెలకు 30 వేల సంపాదన కలిగిన ఒక కుటుంబంలో మహిళ చేతిలో లక్ష రూపాయల ఐఫోన్ ఉంటుంది. ఆ ఐఫోన్ ఉండటం తప్పుకాకపోయినా.. ఆ లగ్జరీ ఫోన్ కోసం కొందరు వేస్తున్న తప్పటడుగులే శ్రుతిమించి సంసారాలను రోడ్డున పడేస్తున్నాయి. పోనీ.. ఫోన్లు దగ్గర ఆగుతారా అంటే అదీ లేదు. నగరంలో ఉంటున్నాం కాబట్టి మనకూ ఒక కారు ఉండాలని భావిస్తారు. కళ్ల ముందు సంపన్నంగా బతుకుతున్న వారిలాగే తాము కూడా జీవించాలనే కోరిక మొదలై కుటుంబాల్లో గొడవలు జరుగుతున్న ఉదంతాలు ఎన్నో. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియా పరిచయాలు కొందరు మహిళలపాలిట శాపాలుగా మారుతున్నాయి. మంచి చెడులకు తేలిక దారి అయిపోయాయి సామాజిక మాధ్యమాలు. ఎదుటి వారి వీకెనెస్‌లు బట్టి వల వేసే వారికి ఈజీగా చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మహిళలు. ఇది రెండువైపులా ఉన్న సమస్యే అయినా.. తప్పు జరిగింది అని గ్రహించేలోపే అంతా చేజారిపోతోంది. ఒక స్థాయి నుంచి మొదలై.. ఫోన్లు.. కార్లు.. చివరకు కోట్ల వరకు వెళ్లిన కేసులు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. వాయిస్ యాప్‌లు వచ్చాక.. ఫోన్‌లో అటు నుంచి మాట్లాడుతున్నది అబ్బాయో అమ్మాయో తెలుసుకోలేని పరిస్థితి. ప్రేమ.. పెళ్లి పేరుతో కేటుగాళ్లు విసిరే వలకు లక్షలు పోగొట్టుకున్న మగానుభావులు కూడా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ వాసిని నూజివీడుకు చెందిన ఒక వ్యక్తి వాయిస్ యాప్‌తో ఇదే విధంగా మోసం చేశాడు.
ఒకప్పుడు నలుగురైదుగురుని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న కంత్రీలను చూస్తే ఔరా అనుకునేవాళ్లం. ఇదే ధోరణితో కొందరు కిలేడీలు కూడా అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నారు. పెళ్లి చేసుకోవడం.. నగానట్రాలతో ఉడాయించడమే పనిగా పెట్టుకున్న వారి తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దీనికంతటికీ కారణం ఈజీ మనీ. సులువుగా మోసం చేయడం.. తేలికగా డబ్బు సంపాదించడం. ఈ తరహా మోసాలకు కూడా సామాజిక మాధ్యమాలే వేదికలుగా మారుతున్నాయి. పెళ్లయి.. హాయిగా సంసారం చేసుకుంటున్న వారిలోనూ ఇదే తరహా పోకడలు కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని తెలిస్తే.. చంపడమో.. చావడమో అంతిమ లక్ష్యంగా భావిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఓ మహిళ తీరు.. ఆమె చేసిన పని వివాహేతర సంబంధాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. దీప్తి అనే మహిళకు పెళ్లయినా.. పన్నెండేళ్లపాటు ప్రేమాయణం సాగించిన ప్రియుడు పవన్‌ను మర్చిపోలేకపోయింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత దీప్తికి రవికిరణ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతనికీ సన్నిహితమైంది. ఈ సంబంధాలు ఇద్దరు ప్రియుళ్ల మధ్య గొడవకు దారితీయడం.. చివరకు పవన్‌తో కలిసి రవికిరణ్‌ను దీప్తి హత్య చేయించడం కలకలం రేపింది. ఇలాంటి నేరాలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మానవ సంబంధాలు అంటే కేవలం లైంగిక అవసరాలు.. విలాసవంతమైన జీవితమే అనేట్టుగా అర్ధాలు మారిపోయాయి.
ఇక అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్య కేసుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భర్త ఉండగానే మరో వ్యక్తి యశ్వంత్‌తో సంబంధాలు కొనసాగించింది జ్యోతి. అది తెలిసి జ్యోతి భర్త రగిలిపోయాడు. రకరకాల ప్లానులు వేసి .. చివరకు జ్యోతిని.. ఆమె ప్రియుడిని కసితీరా చంపేశాడు భర్త శ్రీనివాస్. గుంటూరు ఘటనైనా.. అబ్దులాపూర్‌మెట్ జంట హత్యలైనా చెప్పేది ఒక్కటే. లైంగిక కోరికలు కట్టుతప్పడంతో ప్రాణాలు పణ్ణంగా పెట్టాల్సి వచ్చింది.
దంపతుల మధ్య గ్యాప్ వస్తే చాలు.. సోషల్‌మీడియా ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తోంది. విపరీత సంబంధాలు.. వైపరీత్యాలు.. ఆవేశకావేశాలు కామన్ అయిపోయాయి. విచక్షణ కోల్పోవడానికి క్షణం పట్టడం లేదు. ఏం జరిగిందో తెలుసుకునే లోపుగానే కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బంధాలకు.. అనుబంధాలకు ఇవి రోజులు కావన్నట్టుగా మారిపోయింది కాలం.
డబ్బుకోసం దారితప్పేవాళ్లు కొందరు.. పరాయి సుఖం ఆశించి తప్పటడుగులు వేసేవారు మరికొందరు. లైఫ్ చిన్నది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ధోరణి పెరిగిపోతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మంచిచెడుల విచక్షణ కోల్పోయి జీవితాలు చేజేతులా నాశనం చేసుకుంటున్నవారు అనేకమంది. ఈ విషయంలో స్త్రీ పురుషులను సమానంగా చూడక తప్పదు. కొన్ని సంఘటనల్లో రెండువైపులా తప్పులు ఉంటున్నాయి. మనుషుల మధ్య ఆత్మీయతలు.. అనురాగాలు దెబ్బతింటున్నాయి. వాటి ప్లేసుల్లో సోషల్ మీడియా వచ్చేసి.. ఎంత దూరం తీసుకు రావాలో అంత గ్యాప్ తీసుకొచ్చేసింది. ఆ ఊబిలో నుంచి బయట పడలేకపోతున్నాయి కుటుంబాలు. వాటి నుంచి కాసేపు పక్కకు రాగానే మైండ్‌లో అవే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇదా మన జీవితం.. ఇంతేనా లైఫ్.. ఇంకేం లేదా.. రోజులు ఇలా గడిచిపోవాల్సిందేనా అనే ప్రశ్నలు మనిషి ఆలోచనలను పాడు చేస్తున్నాయి.
ఒకప్పుడు విడాకులు అంటే ఎంతో అవమానంగా భావించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా చిచ్చువల్ల డైవోర్స్‌లకు దారితీస్తున్న ఉదంతాలు ఎన్నో. చదువుకున్న వాళ్లు.. నిరక్షరాశ్యులు అన్న తేడా లేదు. ప్రతిఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. గుప్పిట్లోనే అంతా ఉందని భావిస్తారు. ఆ గుప్పిట విప్పితే ఏదో అద్భుతం జరిగిపోతుందని భ్రమిస్తారు. ఈ క్రమంలో తాము తప్పుదారిలో వెళ్తున్నామని.. చేస్తోంది కరెక్ట్ కాదని ఆలోచించడం లేదు. అలాంటి ఆలోచనే మనుషుల్లో రావడం లేదు. అన్ని అవాంఛనీయ ఘటనలకు అరచేతిలోని స్మార్ట్ ఫోనే దారి చూపించేస్తోంది. ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా.. యూట్యూబ్‌లోకి వెళ్లినా.. తప్పుడు ఆలోచనలకు ఎన్నెన్నో సమాధానాలు దొరుకుతున్నాయి. వేగంగా మారుతున్న జీవన ప్రమాణాలకు అంతే వేగంగా ఆన్సర్స్‌ను నెట్‌లో వేతికేస్తున్నారు జనం. చివరకు సామాజిక మాధ్యమాలు.. సామాజిక విప్లవమో.. సామాజిక సమస్యలకు నెలవో అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు.
సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించుకుంటే అంతకు మించిన విజ్ఞాన గని మరొకటి ఉండదు. కానీ..ఆ దిశగా ఆలోచించేవాళ్లు లేరు. తప్పుడు పనులకు.. వ్యక్తిగత స్వార్థాలకు నెట్‌ను విచ్చల విడిగా వాడేస్తున్నారు. ఇంట్లో భర్తను, భార్యను నమ్మకుండా.. ముక్కూ మొఖం తెలియని సోషల్ మీడియా స్నేహితులను విశ్వసించే ధోరణులు పెరిగి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి సంబంధాలు. నమ్మకం అనే పదానికి విలువ లేకుండా పోతోంది. కేవలం స్వార్థమే ప్రాధాన్యంగా మారిపోతున్నాయి. ఎక్కువ సేపు ఫేస్‌బుక్ చూడొద్దన్నా.. వాట్సాప్ చాటింగ్ చేయొద్దన్నా.. ఎక్కడలేని కోపతాపాలు వస్తున్న రోజులివి. వాటిని క్షణం చూడకుండా ఉంటే.. జీవితంలో ఏదో కోల్పోతున్నామన్న మానసిక దుస్థితికి చేరుకుంటున్నాం. ఆ వేదికలపై మొదలైన పరిచయాలను పడక గది వరకు తీసుకొచ్చేస్తున్నారు. ఆలుమగల మధ్య రహస్యాలు ఉండవని అంటారు. కానీ.. కొన్ని కుటుంబాలలో భర్త ఫోన్ లాక్ భార్యకు.. భార్య ఫోన్ లాక్ భర్తకు తెలియదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
సంసారంలో చిన్న తప్పు జరిగితేనే అవమానంగా భావించే రోజులు పోయాయి. ఎవరేం అనుకుంటే నాకేంటి? నా లైఫ్ నా ఇష్టం.. ! అనేలా ప్రవర్తిస్తున్నారు కొందరు. జీవిత భాగస్వామి పెత్తనాన్ని సహించడం లేదు. ఈ క్రమంలోనే విచ్చలవిడితనం పెరిగిపోతోంది. అదే లైఫ్ అనుకుంటున్నారు. కాదూ కూడదు అంటే చంపడానికి.. చావడానికి వెనకాడటం లేదు జనం. వివాహ బంధాన్నైనా తెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు కానీ.. మనస్పర్థలను పక్కనపెట్టి కలిసి సాగడానికి ఆసక్తి చూపించేవారు అరుదుగా కనిపిస్తున్నాయి. పోలీస్ రికార్డ్స్..ఈ మధ్య కాలంలో కోర్టు గడప ఎక్కుతున్న డైవోర్స్ కేసుల్లో ఇలాంటి గొడవలతో విడిపోవాలని చూస్తున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆశించింది దక్కకపోయినా.. కోరికలు నెరవేరకపోయినా తప్పు చేయడానికి క్షణం ఆలోచించడం లేదు. కుటుంబంలో దక్కని సంతోషం.. సుఖం ఇంకెక్కడో లభిస్తుందని వెంపర్లాడేవారు పెరిగిపోతున్నారు.
ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ స్వాతి విషయాన్నే తీసుకుందాం.. భర్త ఉండగానే ప్రియుడి మోజులో పడిన స్వాతి.. చాలా దారుణానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేయడంతోపాటు.. ప్రియుడికి భర్తలా ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. కానీ గుట్టు బయట పడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. మనుషుల్లో వస్తున్న మార్పునకు.. సమస్య తీవ్రతకు ఈ ఘటనను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకొన్నట్టు.. ఇంటర్నెట్ వాడకంలో ఆడవాళ్లే టాప్. ఈ వింత పోకడలకు అక్కడే బీజం పడుతోంది. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం.. ఇంటర్నెట్‌ను ఉపయోగించడంలో మగాళ్లను దాటేశారు మహిళలు. ఇంటర్నెట్ వాడుతున్న మహిళల శాతం 66.7 గా ఉంటే.. పురుషుల దగ్గరకు వచ్చేసరికి అది 48.8 శాతంగా ఉంది. ఇక తెలంగాణకు వచ్చేసరికి మహిళలు 73.5 శాతం మంది నెట్‌తో కాలక్షేపం చేస్తుంటే.. మగాళ్లు 50 శాతం మందే ఆ వ్యసనంలో ఉన్నారట. పచ్చని సంసారాల్లో పొరపచ్చాలు రావడానికి ఇదొక కారణంగా విశ్లేషిస్తున్నారు కొందరు. ఈ మాయలో పడిన వారికి అవకాశాలే తప్ప.. అనుబంధాలు గుర్తుకు రావడం లేదు. తాళిని ఎగతాళి చేయడానికి వెనకాడటం లేదు. అన్యోన్యంగా సాగిపోయే కుటుంబాల మధ్యలోకి సోషల్ మీడియా దూరిపోయి నానా కంగాళీ చేస్తోంది. సాంకేతిక విప్లవం సంసారాల్లో నిప్పులు పోస్తోంది.