Story Board: అరగంటలో మదురో పని పట్టిన ట్రంప్‌కు మిగతా లాటిన్ అమెరికా సంగతి చూడటానికి ఎంత సమయం పడుతుంది..? మదురో పట్టుబడ్డాక ట్రంప్ మాత్రమే కాకుండా.. ఆయన సలహాదారులు, వారి ఫ్యామిలీలు కూడా రెచ్చిపోతున్నారు. నెక్స్ట్ మీ వంతే అని ట్రంప్‌తో పోటీపడి దేశాలకు వార్నింగులిస్తున్నారు. దీంతో లాటిన్ అమెరికా వ్యాప్తంగా భయం కనిపిస్తోంది. మొదట్నుంచీ లాటిన్ అమెరికా పట్ల బద్ధ వైరంతో వ్యవహరించే అమెరికా.. ట్రంప్ లాంటి అధ్యక్షుడి నేతృత్వంలో.. ఇప్పుడేం చేస్తోందోననే ఆందోళనతో ఆయా దేశాలు అల్లాడిపోతున్నాయి. మరోవైపు ట్రంప్ అసలు ఉద్దేశం మీదా కావాల్సినంత చర్చ జరుగుతోంది.
Read Also: Katipally Venkata Ramana Reddy: తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇస్తుందా?
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న దౌత్య నీతి, విదేశాంగ విధానం టెన్షన్ పెట్టిస్తున్నాయి. తాను అనుకున్నది సాధించుకునేందుకు ప్రపంచ పెద్దన్న అనుసరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యంలోకి నెట్టుతున్నాయి. ఈ క్రమంలో వెనిజులాపై సైనిక చర్యల తప్పదని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న ట్రంప్ చివరకు అన్నంత పనిచేశారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ పేరుతో అమెరికా సైన్యం చేపట్టిన సైనిక ఆపరేషన్‍లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో , ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో వెనిజులా అధ్యక్షుడి నిర్భందం తీవ్ర దుమారం రేపుతున్న వేళ ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్‍ను సైతం ఫిక్స్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Madras High Court: తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై సంచలన తీర్పు
మదురో గైర్హాజరీలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించార. దీంతో ఇక వెనెజువెలా అమెరికా చేతిలో కీలుబొమ్మలా ఆడాల్సిందేనని సంకేతాలిచ్చారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలుచేయాలని, లేకపోతే డిల్సీ రోడ్రిగ్స్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. తాను చెప్పినట్లు చేస్తే వెనెజువెలాకు ఇకపై అమెరికా సైన్యాన్ని పంపనని ట్రంప్ మాటిచ్చారు. కాగా, వెనెజువెలా చమురు రంగాన్ని మాత్రం నియంత్రిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో స్పష్టం చేశారు.
Read Also: TTD Parakamani Case: పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్బంధించిన అనంతరం లాటిన్ అమెరికాలోని తమ ప్రత్యర్థి దేశాలకు ట్రంప్ హెచ్చరికలు చేశారు. మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే వెనెజువెలా పరిస్థితే వాటి పడుతుందని స్పష్టంచేశారు. మెక్సికోకు ఏదో చేయాల్సి ఉందన్నారు. క్యూబా విఫల రాజ్యమని ఆరోపించారు. క్యూబా ప్రజలకు సాయపడాలని అనుకుంటున్నామని ట్రంప్ అన్నారు. క్యూబా నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన వారికి కూడా సాయం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కనీసం మూడు భారీ కొకైన్ ఫ్యాక్టరీలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఆ కొకైన్‌ను అమెరికాలోకి పంపిస్తున్నారన్నారు. వెనెజువెలాపై అమెరికా దాడులను కొలంబియా తీవ్రంగా ఖండించింది. దక్షిణ అమెరికాలోని అన్ని దేశాలకు ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది.
Read Also: Star Hero : ఒక్క సినిమాకు రూ. 225 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో
అమెరికాకు వెనిజువెలా తర్వాత తర్వాతి లక్ష్యం క్యూబా కావొచ్చని ఆదేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. క్యూబా ప్రభుత్వం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన సమయం అని ట్రంప్ సర్కారు పేర్కొంది. నిజానికి లాటిన్ అమెరికాకు అమెరికా సైనిక జోక్యం కొత్త కాదు. ఫిడెల్ కాస్ట్రోను పడగొట్టే లక్ష్యంతో క్యూబా బహిష్కృతుల నేతృత్వంలో జరిగిన 1961 బే ఆఫ్ పిగ్స్ దండయాత్రలోనూ అమెరికా పాత్ర ఉంది. అయితే అది విజయవంతం కాలేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాటవినని దేశాలను ఆర్థిక ఆంక్షలతో దారికి తెచ్చుకుంటున్నారు. కెనడాను సైతం తమ దేశంలో 51 రాష్ట్రంగా మారాలని సంచలన ప్రకటన చేశారు. డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌లాండ్ కావాలని, పనామాకు చెందిన పనామా కాలువ తమది కావాలని పట్టుబట్టారు. పాలస్తీనాకు చెందిన గాజాను సొంతం చేసుకుంటామని ప్రకటించి వెనక్కితగ్గారు. బలంతోనే శాంతిని స్థాపిస్తామని అంటున్నారు. ట్రంప్ చర్యలను అనేక దేశాలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిస్తున్నారని మండిపడుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటున్నారు.
Read Also: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. స్లిమ్ బాడీ, ఫ్లాట్ డిస్‌ప్లేతో Realme 16 Pro Launch!
మరోవైపు వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన అమెరికా సైన్యం, న్యూయార్క్‌లోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేంద్రానికి ఆయనను తరలించారు. మదురో చేతులకు సంకెళ్ల వేసి ఉన్న వీడియోను విడుదల చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదురోను బ్రూక్లిన్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అయితే దీనిని అత్యంత అసహ్యకరమైన, భయానక పరిస్థితులు ఉన్న జైలుగా పిలుస్తారు. ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం, సిబ్బంది కొరత, ఖైదీల మధ్య హింస, తరచూ విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా జైళ్లలో రద్దీ తగ్గించేందుకు 1990లలో ఈ కేంద్రాన్ని నిర్మించారు.
మొత్తంగా లాటిన్ అమెరికా దేశాలపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు ఏళ్ల తరబడి కొరకరాని కొయ్యలుగా మారిన వాటిల్లో వెనిజులా ఒకటి అయితే మరొకటి క్యూబా. వీటిలో వెనిజులా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసిన యూఎస్ నెక్స్ట్ క్యూబా, మెక్సికోను సైతం టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన మొండి వైఖరితో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది అనేది సర్వత్రా టెన్షన్ పెట్టిస్తోంది. బ్రిటిష్ పాలన నుంచి 1776లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అమెరికా.. ఆ తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కు పిడికిలి బిగించింది. 1798 మొదలు తాజాగా వెనెజువెలా ఉదంతం వరకు 700లకు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది. మెక్సికో, పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాధి నేతలను మార్చడం, తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా బలప్రయోగానికి పాల్పడింది. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో 65వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. అదృశ్యమైన వ్యక్తులు, లెక్కల్లో చేరని మరణాలు మరింత ఎక్కువ సంఖ్యలోనే ఉంది.
ఇలాంటి సమయంలో గ్రీన్‌లాండ్ గురించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా కేటీ మిల్లర్.. అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్‌లాండ్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి త్వరలో అనే పదాన్ని జత చేశారు. మదురో కస్టడీ వేళ.. ఈ పోస్టు కలకలం రేపుతోంది. కేటీ.. ట్రంప్ తొలిహయాంలో హోంశాఖ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పని చేశారు. ఈ పోస్టుపై అమెరికాలోని డెన్మార్క్ రాయబారి జెన్సర్ మోయెల్లర్ స్పందించారు. డెన్మార్క్ ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాలని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. గ్రీన్ లాండ్ విషయంలో అమెరికా బెదిరింపులను డెన్మార్క్ తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
లాటిన్ అమెరికా నుండి ట్రంప్‌కు కావాల్సింది ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం, చైనా ప్రభావాన్ని తగ్గించడం, వలసలను నియంత్రించడం, మరియు తమకు అనుకూలమైన ప్రభుత్వాలను స్థాపించడం, ముఖ్యంగా వెనెజువెలాలో అధికారం మార్చడం, కొలంబియా, క్యూబా వంటి దేశాలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని పునఃస్థాపించుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ అసలు లక్ష్యాలు ఇవి కాదని.. ఇవన్నీ ట్రంప్ సర్కారు పైకి చెప్పుకునే లక్ష్యాలేననే చర్చ గట్టిగా జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే.. ప్రపంచ పోలీస్‌గా అమెరికా ఆధిపత్యాన్ని నిరూపించుకోవటమే ట్రంప్ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైన దగ్గర్నుంచీ అమెరికా ప్రతిష్ఠ దిగజారుతోందనే అభిప్రాయాలున్నాయి. నాలుగేళ్ల కోసం అధ్యక్షుడిగా ఎన్నుకుంటే.. నాలుగు వందల ఏళ్ల అమెరికా చరిత్రకే చెదలు పట్టిస్తున్నారని అమెరికన్లు కూడా ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏడాది కాలంలో అధ్యక్షుడిగా ట్రంప్ చేసిన ప్రతి పనీ బూమరాంగే అయింది. కొన్ని పనులు అనుకోకుండా ఎదురుతిరిగాయి. మరి కొన్ని ప్లాన్ చేసినా.. వర్కవుట్ కాలేదు. దీంతో స్వయంగా ట్రంప్ కూడా ఒత్తిడిలో పడ్డారనే వాదన లేకపోలేదు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికే వెనెజువెలా అనే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారని చెబుతున్నారు. గతంలో బైడెన్ హయాంలో అఫ్గనిస్తాన్ లో అమెరికా భంగపాటును ట్రంప్ పరిహసించారు. అప్పుడే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నినదించారు. ఆ నినాదాన్ని నిజం చేసి చూపించామని చెప్పుకోవటానికే మదురోను నిర్బంధించారని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచ పోలీస్ గా తన స్థానాన్ని పదిలపరుచుకోవటానికి.. చిన్న దేశాలపై దురాక్రమణలకు పాల్పడుతున్న అమెరికా.. కచ్చితంగా మిగతా దేశాలకు ఓ దుష్ట సందేశాన్ని పంపిందనడంలో సందేహం లేదు.
అమెరికా చాలా విజయవంతంగా వెనిజువెలా నుంచి మదురోను ఎత్తుకెళ్లింది. ఈ ఘనత తమ సైన్యానిదేనని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. అంతవరకూ ఓకే. కానీ అమెరికా బాటలోనే మిగతా దేశాలూ నడిస్తే.. అప్పుడేం చేస్తారనేది తేలాల్సి ఉంది. గతంలో తైవాన్‌పై చైనా దురాక్రమణను అడ్డుకున్న అమెరికా.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మరి మదురో నిర్బంధం తర్వాత అమెరికా అంతే గట్టిగా చైనా, రష్యానే కాదు.. మరే దేశాన్నైనా దురాక్రమణ చేయకుండా ఆపగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్బంధం తరుణంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ వార్ పై చర్చ జరుగుతోంది. వెనిజులాపై మెరుపుదాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థించారు. నియంతలను ఈ రకంగా ఎదుర్కోవడం సాధ్యమైతే తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ లో పుతిన్ కూడా ఉన్నారా అనే చర్చ ప్రపంచ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కానీ అది అంత తేలిక కాదనే సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో పుతిన్ జెలెన్‌స్కీని ఎత్తుకెళ్తే ఏం చేస్తారనే చర్చ షురూ అయింది. మదురో నిర్బంధం ప్రభావం అక్కడితో ఆగదని.. ఎప్పట్నుంచో తైవాన్‌పై కన్నేసిన చైనాకూ కాళ్లిస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. గతంలో తైవాన్ మీదకు చైనా యుద్ధ విమానాలు పంపితే.. అమెరికా తీవ్రంగా ఒత్తిడి తెచ్చి.. డ్రాగన్ వెనక్కుతగ్గేలా చేసింది. కానీ ఇప్పుడు అంత గట్టిగా చైనాను తైవాన్ మీదకు రాకుండా ప్రతిఘటించగలదా అంటే అనుమానమే. అంటే వెనెజువెలా జరిగిన ఘటన.. కేవలం లాటిన్ అమెరికాకే కాకుండా.. మొత్తంగా ప్రపంచంలో ఉన్న చిన్న దేశాలన్నింటికీ కఠిన హెచ్చరికలు పంపుతోంది.
ఇప్పటికే తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ తెను చైనా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీని రష్యా నిర్బంధిస్తే ఏం చేస్తారని అమెరికా కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌ను నిలదీస్తున్నారు. మదురో చేసిన నేరాల సంగతి సరే కానీ.. నిర్బంధానికి ఉన్న చట్టబద్ధత ఏమిటనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఎవర్నైనా సరే ప్రాసిక్యూట్ చేయాలంటే.. మొదట అరెస్ట్ కానీ, నిర్బంధం కానీ చట్టబద్ధమని నిరూపించలేదు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏ చట్టాల్ని అమలుచేశారో కచ్చితంగా చెప్పాలి. కానీ ప్రపంచ పోలీస్‌గా నిరూపించుకునే కంగారులో ట్రంప్.. అసలు విషయాన్ని గాలికొదిలేశారని, కనీసం కాంగ్రెస్ కు మాటమాత్రం చెప్పకుండా మదురోను ఎత్తుకురావటాన్ని ఏ రకంగానూ సమర్థించుకోలేరని అంటున్నారు. ఏదో రకంగా అమెరికా మదురోను శిక్షించవచ్చు. కానీ భవిష్యత్ తరాలకు కచ్చితంగా ఈ ఘటన గురించి సమాధానం చెప్పుకోలేని స్థితి వస్తుందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చివరకు ట్రంప్ సొంత పార్టీ కూడా ఈ విషయంలో రెండుగా చీలిపోయింది. ఓవర్గం ట్రంప్‌ను గుడ్డిగా సమర్థిస్తుంటే.. మరో వర్గం మాత్రం ఆయన చర్యను తీవ్రంగా తప్పుబడుతోంది.
ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు.. ప్రపంచ చరిత్రను మరో మలుపు తిప్పబోవనే నమ్మకం ఏం లేదు. ప్రపంచ పోలీసే అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించిన తర్వాత.. ఇక మిగతా దేశాలు కట్టుదాటకూడదని ఆశించడం దురాశే అవుతుంది. ఇప్పటిదాకా ప్రపంచ దేశాలకు విశ్వవేదికలపై సుద్దులు చెప్పిన అమెరికా.. ఇక రేపట్నుంచి ఏ ముఖం పెట్టుకుని హితవు చెబుతుందో చూడాల్సి ఉంది. తమకున్న బలంతో, ఆధిపత్యంతో మిగతా దేశాల నోరు మూయించవచ్చు కానీ.. సుదీర్ఘకాలం ఈ దంద సాగదని అగ్రరాజ్యానికీ బాగా తెలుసు. ప్రస్తుత ప్రపంచం ఏకధృవ ప్రపంచం కాదు. ఇది భిన్నధృవ ప్రపంచం. అమెరికాకు దీటైన దేశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే రష్యా, చైనా కలిసికట్టుగా వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పుడు వెనిజువెలా ఉదంతం తర్వాత ఆ రెండు దేశాలు తమ ఆలోచనలకు మరింత పదును పెట్టొచ్చు. అప్పుడు అమెరికాకు వాటిని అడ్డుకోవడం సాధ్యమా.. అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పటికే అమెరికాకు దూరం జరిగిన యూరప్ దేశాలు కూడా మదురో నిర్బంధాన్ని పూర్తిగా సమర్థించడం లేదు. దీనికి తోడు ట్రంప్ కోరి కొరివితో తల గోక్కున్నట్టుగా ఇరుగు పొరుగు దేశాలన్నంటితోనూ తగాదా కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ట్రంప్‌ను సమర్థిస్తే.. రేపొద్దున ఏ దేశ సార్వభౌమత్వానికీ గ్యారంటీ లేకుండా పోతోందనే ఆందోళనే.. మిగతా దేశాల్ని అప్రమత్తం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. పైగా ఇకపై ఏ దేశం ఎవరిపై దురాక్రమణ చేసినా.. అంతా అమెరికానే వేలెత్తిచూపే అవకాశం కూడా ట్రంపే ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే కొన్నాళ్లుగా దురాక్రమణలకు దూరంగా బతుకుతున్న ప్రపంచానికి ట్రంప్.. మళ్లీ పాతరోజుల్ని పరిచయం చేశారు. అమెరికా ఏమీ మారలేదని, పాతగాయాలు మళ్లీ రేగుతూనే ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. పైగా తనను సంతోషపెట్టనివారెవరైనా.. అయితే యుద్ధం.. లేదంటే టారిఫ్‌ను భరించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. అంటే ప్రపంచమంతా ట్రంప్‌ను సంతోషపెట్టడానికే ఉండాలా..? మరి ఆయన ఎవర్ని సంతోషపెడతారనే ప్రశ్నలు ఇప్పటికే తలెత్తుతున్నాయి. చివరకు కొలంబియా లాంటి చిన్న దేశం కోరిక మేరకు వెనిజువెలాపై ట్రంప్ దురాక్రమణకు వ్యతిరేకంగా భద్రతామండలి సమావేశం కావడం కూడా.. అమెరికా తల కొట్టేసినట్టే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. సరిగ్గా ఏడాది క్రితమే మూడో ప్రపంచ యుద్ధం తృటిలో తప్పింది. కానీ ఉన్న కుంపట్లు చల్లారకముందే.. ట్రంప్ కొత్త అలజడులకు తెరలేపుతున్నారు. ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి ఇప్పటికే డమ్మీగా మారిపోయింది. మరి పెద్ద దేశాల దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసేదెవరు..? చిన్న దేశాల అస్తిత్వాన్ని కాపాడేదెవరు..?
ఎడతెగని యుద్ధాలకు వ్యతిరేకంగా గతంలో ప్రచారం చేసిన వ్యక్తి.. ఇతర దేశాల్లో అధికార మార్పిడి కోసం అమెరికా చేసిన మునుపటి ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి.. అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పుడు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, దశాబ్దాల నియంతృత్వంతో రాజకీయ స్థిరత్వం దెబ్బతిన్న వెనెజువెలా పునర్నిర్మాణం కోసం తన అధ్యక్ష పదవినే పణంగా పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ట్రంప్ తనను తాను శాంతిస్థాపకుడిగాగా అభివర్ణించుకున్నారు. కానీ, గడచిన ఏడాది కాలంలో, ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిని ఉపయోగించడానికి తాను సిద్ధమేనని ఆయన నిరూపించారు. గత వారమే ఆయన సిరియా, నైజీరియాలో వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. 2025లో, ఇరాన్‌లోని అణు కేంద్రాలు, కరీబియన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అనుమానిత నౌకలను, యెమెన్‌లోని తిరుగుబాటు దళాలను, సోమాలియాలోని సాయుధ గ్రూపులను, ఇరాక్‌లోని ఇస్లామిక్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో జరిగిన ఈ సైనిక చర్యలన్నీ క్షిపణులు, యుద్ధ విమానాల ద్వారా జరిగాయి. దీనివల్ల అమెరికా సైనికులకు నేరుగా ముప్పు కలగలేదు. కానీ దీనికి విరుద్ధంగా వెనెజువెలా విషయంలో ట్రంప్ చర్యలు, దేశ భవిష్యత్తు పట్ల ఆయన నిబద్ధత చాలా భిన్నంగా ఉన్నాయి.
ఏ కారణం చేతనైనా అమెరికా ఇతర దేశాలను నడపకూడదు. ఎప్పటికీ ముగియని యుద్ధాలు, అధికార మార్పిడి ప్రచారాలలో పడటం వల్ల కలిగే ఫలితాలు అమెరికన్లకు వినాశకరంగా ఉంటాయని మనం ఇప్పటికే తెలుసుకుని ఉండాలనేది కొందరు అమెరికా కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయంగా ఉంది. అమెరికా కచ్చితంగా అంతా ప్లాన్ ప్రకారమే చేస్తోంది. వెనెజువెలా చమురు, ఇతర నిధి నిక్షేపాల్ని కొట్టేయడానికి పెద్ద స్కెచ్చే వేసింది. ప్రపంచ పోలీస్ ఒక దేశాన్ని ఇలా డైరెక్టుగా దోచేస్తుంటే.. ప్రపంచ దేశాలు పట్టనట్లు వ్యవహరిస్తుండటం విచారకరం.ఇక ఐక్యరాజ్యసమితి అయితే ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అన్నట్టుగా ఉంది. అదెప్పుడూ అమెరికాను అదిలించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడూ ఏదో చేస్తుందనుకోవడం ఒట్టి భ్రమే తప్ప.. ఇంకేం కాదు. దీనికి కారణం కూడా ట్రంపే గతంలో మహా బాగా సెలవిచ్చారు.
ఐక్యరాజ్యసమితి స్థాపన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా దానికీ ఆసరా ఇస్తోన్న ప్రధాన దేశం అమెరికానే. చివరకు సమితి ప్రధాన కార్యాలయం కూడా తమ చలవేనని ట్రంప్ గతంలో ఆ ఐక్యరాజ్యసమిత సమావేశంలోనే మిగతా దేశాలకు గుర్తుచేశారు. కాబట్టి కచ్చితంగా ఐక్యరాజ్యసమితి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయకూడదని మొండిగా వాదించారు. అప్పుడు ట్రంప్ మాటల్ని కొన్ని దేశాలు ఖండించినా.. వాటికి పెద్దగా మన్నన దక్కలేదు. దశాబ్దాలుగా సమితిలో సంస్కరణల్ని ఒంటిచేత్తో అడ్డుకోవటమే దానిపై అమెరికా ఆధిపత్యానికి తిరుగులేని నిదర్శనం. ఇంకా ఇటీవలి ఉదాహరణ కావాలంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుకాగానే.. పుతిన్‌ను అంతర్జాతీయ యుద్ధ నేరస్తుడిగా ప్రకటించారు. మరిప్పుడు మదురోను నిర్బంధించి.. వెనెజువెలాపై సైనిక చర్యకు దిగిన ట్రంప్‌ను యుద్ధ నేరస్తుడిగా ప్రకటించరా.. అంటే సమితి దగ్గర్నుంచి మౌనమే సమాధానం కావచ్చు. అసలీ ప్రశ్న అడిగే ధైర్యం ఏ దేశానికైనా ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.
ఇప్పుడు అమెరికా వెనెజువెలాను టార్గెట్ చేసింది. రేపు మిగతా లాటిన్ అమెరికానూ చేయొచ్చు. అదే బాటలో రష్యా, చైనా కూడా నడిచి.. తమ పాత పగలు తీర్చుకుంటే ఏం జరుగుతుంది..? ఇదే అదనుగా యూరప్ దేశాలు కూడా విజృంభించి చిన్న దేశాల్ని కబళిస్తే.. అసలు ప్రపంచమంటూ మిగులుతుందా..? మళ్లీ మధ్యయుగాల నాటి యుద్ధాల దిశగా పయనిస్తామా..? ఈ ప్రమాదకర పోకడల్ని ఎవరు అడ్డుకోవాలి..? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు బదులిచ్చే వారెవరూ లేరు. ఎవరికీ తెలియదు కూడా. కొద్దిరోజులు గడిస్తే కానీ.. ట్రంప్ తదుపరి కార్యాచరణపై పూర్తిస్థాయిలో స్పష్టత రాదు. మరి అప్పటికైనా మిగతా దేశాలు గట్టిగా నిలబడి ట్రంప్‌ను నిలువరిస్తాయా.. లేదంటే ఇప్పటిలాగే ప్రేక్షక పాత్ర పోషిస్తాయా అనేది ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించనుంది.
ఏ దేశమైనా స్వతంత్ర, సర్వసత్తాక సార్వభౌమ దేశంగా నిలదొక్కుకోవటానికి ఎన్నో పోరాటాలు చేయాలి. ఎన్నో ఎదురుదెబ్బలు తినాలి. కనీసం దశాబ్దాలు.. కొన్నిసార్లు శతాబ్దాల పాటు తనను తానే ఉలి చెక్కిన శిల్పంలా తయారవ్వాలి. అంటే ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమూ అంత తేలికగా స్వాతంత్ర్యం సంపాదించుకోలేదు. ఓ దేశంగా రూపు దిద్దటానికి ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నాయి. ఆ తర్వాత స్థిరంగా మనుగడ సాగించటానికీ ఎన్నో కష్టాలు పడ్డాయి. ఇలా దేశాల ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. కానీ అదే దేశాల్ని కుప్పకూల్చటానికి ఎక్కువ సమయం అక్కర్లేదని కొన్ని దేశాల్లో జరిగిన దుర్ఘటనలు నిరూపించాయి. ఇక్కడ ఏ దేశాన్ని ఆ దేశమో, అక్కడి ప్రజలో అంతర్గత సమస్యలతో నాశనం చేసుకోవటం ఓ ఎత్తు. కానీ ఆ దేశానికి సంబంధం లేని బయటి దేశమో, వ్యక్తులో వచ్చి.. దాని సార్వభౌమత్వాన్ని కూల్చేయటం భరించరాని బాధ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెనెజువెలాది కూడా అదే వ్యథ. దశాబ్దాల పాటు అమెరికా పక్కలో బల్లెంలా నిలిచిన దేశం.. ఇప్పుడు తన అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిందని మౌన వేదన అనుభవిస్తోంది. ఇప్పుడు వెనెజువెలాను ఇలాగే వదిలేస్తే.. రేపు ప్రపంచ పటంలో ఎన్ని వెనిజువెలాలు తయారౌతాయో చెప్పడం కష్టం. అందుకే ఇప్పటికైనా ప్రపంచం మేలుకోవాలి. అమెరికా ఆధిపత్యానికి గట్టి సవాల్ విసరాలి. ట్రంప్ ఆడింటి ఆట.. పాడింది పాట కాదని నిరూపించాలి. అలా ముందడుగు వేయకపోతే.. కష్టపడి నిర్మించుకున్న ఈ ప్రపంచాన్ని ట్రంప్ లాంటి ఇద్దరు ముగ్గురు నేతలు కలిసి నిండా ముంచేస్తారు. కోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని నడిసంద్రంలో కలిపేస్తారు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. అలా జరగకూడదంటే.. ప్రపంచ దేశాలు దురాక్రమణలు, సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాలి. మొదట సమితి స్థాపన లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్న శక్తుల్ని నిలువరించాలి. తర్వాత సమితిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. పడికట్టు సంప్రదాయాలు ఇక కుదరబోవని గట్టిగా చెప్పాలి. అప్పుడే ఈ ప్రపంచం బతికి బట్టకడుతుంది.