వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కుర్రాళ్లు అదరగొట్టడంతో…ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకుంది భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది. ఇంగ్లాండ్‌తో ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన యువ భారత్.. 4 వికెట్ల తేడాతో గెలిచి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. 24 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్‌కి నిరాశ తప్పలేదు. ఆ జట్టుకి తాజా టోర్నీలో ఎదురైన తొలి ఓటమి ఇదేకాగా.. భారత్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా టైటిల్‌ని గెలుపొందడం గమనార్హం. ఇంగ్లాండ్ 1998లో ఒక్కసారి మాత్రమే కప్‌ని గెలవగా.. భారత్ వరుసగా 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. భారత బౌలర్ల దెబ్బకి 44.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితంకాగా.. ఇందులో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే.. జేమ్స్ ర్యూ (95: 116 బంతుల్లో 12×4) అసాధారణ పోరాటంతో ఇంగ్లాండ్ 189 పరుగులైనా చేయగలిగింది. చివర్లో జేమ్స్ సేల్స్ (34 నాటౌట్: 65 బంతుల్లో 2×4) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో రాజ్ బవా ఐదు వికెట్లు పడగొట్టగా.. రవి కుమార్ 4, కుశాల్ తంబె ఒక వికెట్ తీశాడు.