టెస్టుల్లో టీమిండియాకు ఆడుతున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రంజీ జట్టు నుంచి అతడు తప్పుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను రంజీ ట్రోఫీ ఆడటం లేదని బీసీసీఐకి సాహా సమాచారం ఇచ్చాడు. టీమిండియా త్వరలో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు తనను సెలక్టర్లు ఎంపిక చేయరనే విషయం తెలుసుకుని.. మనస్తాపం చెందిన సాహా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువ ఆటగాడు రిషబ్ పంత్ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో పూర్తి స్థాయిలో వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
Read Also: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు.. గంటలోనే హాంఫట్
అంతేకాకుండా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మరో యువ ఆటగాడు కేఎస్ భరత్ సైతం ఆకట్టుకున్నాడు. దీంతో పంత్‌కు ప్రత్యామ్నాయంగా కేఎస్ భరత్‌ను తీర్చిదిద్దాలని జట్టు యాజమాన్యం భావిస్తోందని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కూడా కేఎస్ భరత్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సాహా.. టీమిండియాకే ఆడనప్పుడు రంజీ మ్యాచ్‌లలో ఎందుకు ఆడాలని భావించి ఉంటాడని.. అందుకే రంజీ ట్రోఫీ నుంచి తప్పుకుని ఉంటాడని బీసీసీఐ అధికారి వివరించారు. ఇప్పటిదాకా 40 టెస్టులాడిన సాహా.. 1,353 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలున్నాయి. వికెట్ కీపర్‌గా 104 మందిని పెవిలియన్‌కు పంపాడు. అందులో 92 క్యాచ్‌లు, 12 స్టంపింగ్స్ ఉన్నాయి.