FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మేరకు స్టేడియాన్ని సిద్ధం చేస్తున్న ఒక వర్కర్ ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. ఈ విషయాన్ని ఖతార్ అధికారులు వెల్లడించారు. లుసైల్ స్టేడియం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్ పనుల కోసం ఎక్కువ మంది కార్మికులు కెన్యా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చారు. సుమారు 20 లక్షల మంది కార్మికులు ఖతార్ చేరుకున్నట్లు సమాచారం అందుతోంది.
Read Also: Baby Born With Four Legs : నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు
ఈ మేరకు వలస కార్మికులకు సరైన రక్షణ కల్పించడంలో ఖతార్ అధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. అయితే తమపై వస్తున్న విమర్శలను ఖతార్ ప్రభుత్వం ఖండిస్తోంది. తమ దేశంలో కార్మికులకు అవసరమైన అన్ని వసతులు, రక్షణ కల్పించామని వివరణ ఇస్తోంది. 20 లక్షల మంది కార్మికులకు రక్షణ కల్పించడం మాములు విషయం కాదని.. ఈ విషయంలో ఖతార్ విఫలమైందని పలువురు భావిస్తున్నారు. ఈరోజు చనిపోయిన కార్మికుడు జాన్ న్యూ కిబో అని పలు నివేదికలు తెలియజేశాయి. సదరు వ్యక్తి ఏ దేశస్థుడనే విషయం మాత్రం ఖతార్ అధికారులు వెల్లడించలేదు. కార్మికుడు ఎలా కింద పడిపోయాడనే విషయంపై అత్యవసరంగా విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.