థర్డ్ ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 విజేతగా నిలిచింది సూపర్ నోవాస్. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరిగిన ఫైనల్స్ లో వెలాసిటీ జట్టుపై 4రన్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ నోవాస్ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది. ముందుగా వెలాసిటీ జట్టు టాస్ గెలిచి సూపర్ నోవాస్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెలరేగి బ్యాటింగ్ చేసింది. కేవలం 29 బాల్స్ లో ఒక ఫోర్, మూడు సిక్సుల సాయంతో 43 రన్స్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన డాటిన్, ప్రియాపునియా సూపర్ నోవాస్ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. డాటిన్ 44 బాల్స్ లో 62 రన్స్ చేయగా..ప్రియా పునిమా 29 బాల్స్ లో 28 రన్స్ చేసింది. వెలాసిటీ జట్టులో కేట్ క్రాస్, దీప్తి శర్మ, సిమ్రన్ బహదూర్ తలో రెండు వికెట్లు తీశారు.
166 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెలసిటీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేసింది. దీంతో 4 రన్స్ తేడాతో ఓడిపోయింది. చివర వరకు వెలాసిటీ జట్టు పోరాడినా.. విజయానికి ముందర బోల్తా పడింది. కెప్టెన్ దీప్తి శర్మ కేవలం 2 రన్స్ చేసి నిరాశ పరిచింది. లారా వోల్వార్డ్ ఒంటరి పోరు చేసినా అండగా నిలిచే బ్యాటర్లు కరువయ్యారు. వోల్వర్డ్ 40 బాల్స్ లో 65 రన్స్ చేశారు. చివరగా వచ్చిన సిమ్రన్ బహదూర్ 10 బాల్స్ లో 20 పరుగులు చేసి గెలిపించే ప్రయత్నం చేసింది. సూపర్ నోవాస్ బౌలింగ్ లో అలనా కింగ్ 3 వికెట్లు పడగొట్టగా…సోఫీ ఎక్లెస్టోన్, డాటిన్ లు చెరో 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగినందుకు డాటిన్ కు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డ్ దక్కింది.