Ind Vs Pak: కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో దాయాది దేశాలు పోటీ పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తే వచ్చే మజానే వేరు. ఈ ప్రపంచకప్‌కే ఈ మ్యాచ్ హైలెట్ అని ముందు నుంచి ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ మ్యాచ్‌ను చూసే మెల్ బోర్న్ స్టేడియంలో సీట్ల సామర్థ్యం 90వేలు అయితే అమ్ముడుపోయిన టిక్కెట్లు లక్ష అంటేనే ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
Read Also: T20 World Cup: నేడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అందరి కళ్లు వరుణుడిపైనే..!!
అయితే గత రెండు మెగా టోర్నీల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ భంగపడింది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ విజయం సాధించడంతో ఏకంగా టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. ఇటీవల ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌లో గెలిచిన భారత్ సూపర్-4 దశలో మాత్రం పాకిస్థాన్ చేతిలో పరాభవం పొందింది. దీంతో ఫైనల్ చేరకుండానే మరోసారి ఇంటిదారి పట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి భారత్‌ను ఓడించి మెగా టోర్నీలో విజయావకాశాలను దెబ్బతీయాలని పాకిస్థాన్ భావిస్తోంది. అటు గత ఏడాది ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌లో గెలిచిన భారత్.. సూపర్-4లో ఎదురైన ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు సహకరిస్తే టాస్ గెలిచి టీమ్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. మరి పాకిస్థాన్ హ్యాట్రిక్ సాధ్యమవుతుందా లేదా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్న విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.