Asia Cup 2022: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ పాకిస్థాన్ గెలుస్తుందంటూ సెహ్వాగ్ జోస్యం చెప్పడంతో పలువురు నెటిజన్‌లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మంగళవారం నాడు శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే దాయాది పాకిస్థాన్ ఆసియా కప్ ఎగరేసుకుపోతుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే దాయాది పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. దీంతో సెహ్వాగ్ వ్యాఖ్యలను టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
Read Also: New Smartphones: భారత్ మార్కెట్‌లోకి కొత్త బడ్జెట్ ఫోన్లు..
కాగా టీమిండియా ఫైనల్ చేరాలంటే మంగళవారం నాడు శ్రీలంకను, గురువారం నాడు ఆప్ఘనిస్తాన్ జట్టును భారీ తేడాతో ఓడించాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది జరగపోయినా భారత్‌కు ఫైనల్ ఛాన్స్ క్లిష్టంగా మారుతుంది. మరోవైపు దీపక్ హుడాపై నమ్మకం లేకపోతే రోహిత్ శర్మ అతడిని ఎందుకు జట్టులోకి తీసుకున్నాడంటూ పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఆరో బౌలర్‌గా దీపక్ హుడాను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ నిలదీశాడు. మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనికి రెండు ఓవర్లు ఇవ్వాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండాలన్న టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం సరికాదని రాజ్‌కుమార్ శర్మ వ్యాఖ్యానించాడు.