త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టబోతున్న రెండు కొత్త ఫ్రాంచైజీలపై అందరి దృష్టి నెలకొని ఉంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ జట్టుతో ఉంటాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు. తనను వేలంలో పాల్గొనమని చాలా ఫ్రాంచైజీలు కోరుతున్నాయని.. కానీ తాను మాత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తోనే ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు. 8 సంవత్సరాల పాటు ఆర్సీబీకి సారథ్యం వహించిన కోహ్లీ గత ఏడాది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
Read Also: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు.. గంటలోనే హాంఫట్
మరోవైపు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోవడంపైనా విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చాడు. గతంలో ఎందరో ఆటగాళ్లు ట్రోఫీలు గెలిచారని.. కానీ దాని ఆధారంగా అభిమానం సంపాదించుకున్న దాఖలాలు లేవన్నాడు. ప్రదర్శనకు కప్పు ఎంతమాత్రమూ ప్రాతిపదిక కాదన్నాడు. ఫలానా జట్టుతో ఐపీఎల్ ట్రోఫీ గెలిచానని చెప్పుకోవడం కంటే ఆర్సీబీకి విధేయుడిగా ఉండటాన్నే తాను ఇష్టపడతానని కోహ్లీ తెలిపాడు. అదే తనకు గొప్పగా అనిపిస్తుందన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటే అందరూ మనతోనే ఉంటారని, చెడ్డ వ్యక్తి అయితే దూరంగా జరుగుతారని… ఇదే జీవితమని కోహ్లీ వివరించాడు.