Virat Kohli Is Not The Greatest Indian Captain Says Winston Benjamin: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను గొప్ప కెప్టెన్‌గా పేర్కొనలేంటూ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్‌స్టన్ బెంజిమన్ బాంబ్ పేల్చాడు. కెప్టెన్ బాధ్యతల్ని మోయడం కన్నా.. అతడు బ్యాటింగ్‌పై దృష్టి పెడితేనే బాగుంటుందని హితవు పలికాడు. ‘‘కోహ్లీని టీమిండియా గొప్ప కెప్టెన్ అని చెప్పడం సరికాదని నేను భావిస్తున్నా. అతడు సారథ్య బాధ్యతల్ని మోయడం కన్నా.. బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తేనే మంచిది. ఎందుకంటే.. అలాంటి బ్యాటర్‌ను నేను ఇంతవరకూ చూడలేదు’’ అంటూ విన్‌స్టన్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. కొన్నేళ్లుగా భారత క్రికెటర్లు ఎంతో మెరుగ్గా ఆడుతున్నారని, జస్‌ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు బౌలింగ్‌తో చెలరేగుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఇంకా ఎంతో మంది ప్రతిభ గల ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారని.. కోహ్లీ కన్నా ముందు జట్టును నడిపించిన వారు వ్యూహాత్మకంగా మెరుగైన నిర్ణయాల్ని తీసుకున్నారని చెప్పాడు. కోహ్లీ గొప్ప కెప్టెన్ కాదు కానీ, బ్యాటర్లలో మాత్రం అతనికి తిరుగులేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక రానున్న టీ20 ప్రపంచకప్‌లో తమ విండీస్ జట్టు టాప్-4లో ఉండొచ్చని విశ్లేషించాడు. అందుకు కారణం.. వారి అస్థిరమైన ఆటతీరేనన్న విన్‌స్టన్, తమని తాము రుజువు చేసుకోవడానికి ఇదే గొప్ప అవకాశం అన్నాడు. ఇప్పటికైనా ఆ దిశగా వారు ప్రయత్నిస్తారని తాను ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాడు.
ఇదిలావుండగా.. విన్‌స్టన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణ ఇస్తున్నాడు. ఇటీవల ఇతను సచిన్ టెండూల్కర్‌కి ఒక విన్నపం చేసి వార్తల్లో నిలిచాడు. తమ కుర్రాళ్లకు అవసరమైన క్రికెట్ కిట్లను అందించాలని సచిన్‌ను కోరాడు. అందుకు పూమా కంపెనీ స్పందించి, భారీ సాయం ప్రకటించింది.