అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీస్-1లో భర్త 8 వికెట్ల తేడాతో గెలిచింది. లంక నిర్ధేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లు విహాన్ మల్హోత్రా (61 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఆరోన్ జార్జ్ (58 నాటౌట్, 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. సెమీస్-2లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ గెలిచింది. ఇక డిసెంబర్ 21న దుబాయ్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. ఆయుష్ మాత్రే 7 పరుగులకు అవుట్ కాగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 9 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరినీ రాసిత్ నిమ్సార అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాలు బ్యాట్ జులిపించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. చమిక హీనతిగల (42) టాప్ స్కోరర్ కాగా.. విమత్ దిన్సారా (32), సేథ్మికా సెనెవిరత్నే (30) రాణించారు. భారత బౌలర్లలో కిశాంక్ చౌహాన్,హెనిల్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు.