ICC Rankings: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకుల్లోనూ తన సత్తా చాటుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో లాంగ్ జంప్ వేసి టాప్-10లోకి ప్రవేశించాడు. ఆసియా కప్ ఆరంభానికి ముందు 35వ ర్యాంకులో ఉన్న విరాట్ కోహ్లీ ఆ టోర్నీతో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో ఆసియా కప్ ముగిసే సరికి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఇన్నింగ్స్ కారణంగా టాప్-9లో కొనసాగుతున్నాడు. రెండు నెలల వ్యవధిలో ఈ స్థాయిలో ర్యాంకు మెరుగుపరుచుకున్న ఆటగాడు లేడని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
Read Also: Eng vs Ire: ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాక్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం
మరోవైపు అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో టాప్-10లో కొనసాగుతున్న రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ కూడా వన్డేలు, టీ20లలో టాప్-10లో కొనసాగుతున్నాడు. వన్డేలలో 7వ ర్యాంకులో కొనసాగుతున్న అతడు టీ20 ర్యాంకుల్లో 9వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఖాతాలో 635 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రిజ్వాన్ ఖాతాలో 849 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే (831 పాయింట్లు) ఉన్నాడు. మూడో స్థానంలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 828 పాయింట్లతో నిలిచాడు. నాలుగో స్థానంలో 799 పాయింట్లతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉన్నాడు. టాప్-10లో కేవలం ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు.