T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ చేరడం పక్కా అని అభిమానులు భావించారు. అయితే ఇది నిన్నటి వరకే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై ఓటమి చెందడంతో టీమిండియా సెమీస్ ప్రయాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్క పరాజయం టీమిండియాలోని ఎన్నో లోపాలను బహిర్గతం చేసింది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇంకా మెరుగుపడాలని ఆదివారం నాటి మ్యాచ్ చాటిచెప్పింది. అయితే ఈ గెలుపుతో గ్రూప్-2లో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు టాప్‌లో కొనసాగిన టీమిండియా రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. జింబాబ్వేతో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్, బంగ్లాదేశ్, టీమిండియా జట్లపై విజయం సాధించడంతో నాలుగు పాయింట్లు వచ్చాయి. మరోవైపు టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన భారత్ సఫారీలపై మాత్రం ఓడిపోయింది.
Read Also: Virat Kohli: కోహ్లీ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా!
టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. జింబాబ్వే, బంగ్లాదేశ్‌లలో ఎవరిని తక్కువ అంచనా వేసినా భారత్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే టీమిండియా మెగా టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాకు సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. రెండో జట్టుగా పాకిస్థాన్ లేదా టీమిండియా లేదా జింబాబ్వేలకు అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై తప్పనిసరిగా గెలవాలి. ఈ రెండు మ్యాచ్‌లలో ఏ మ్యాచ్ ఓడినా పాకిస్థాన్ అవకాశాలు సన్నగిల్లుతాయి. మొత్తానికి జింబాబ్వే, బంగ్లాదేశ్ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ ఓడినా.. లేదా ఈ మ్యాచ్‌లు రద్దయినా టీమిండియా అవకాశాలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పాకిస్థాన్ భారీ విజయాలు సాధిస్తే ప్రపంచకప్ నుంచి టీమిండియా అవుట్ అవుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని.. రోహిత్ సేన ఇకపై జాగ్రత్తగా ఆడుతుందని ఆశిద్దాం.