‘ఆట’ అన్నాక గాయాలు అవ్వడం సహజమే. క్రికెట్ కూడా అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో గాయాల పాలు కాని ఆటగాళ్లు చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఎప్పుడోకప్పుడు ఇంజురీకి గురవుతాడు. అయితే టీమిండియాకు కొన్నేళ్ల నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. స్టార్ ప్లేయర్స్ నెలల తరబడి మైదానంకు దూరమవుతున్నారు. ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇటీవలి గాయాలు చూస్తే.. ప్రస్తుత క్రికెటర్లు మరీ సున్నితంగా తయారవుతున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గాయాల బారిన పడిన ప్లేయర్స్ జాబితా చూద్దాం.
జస్ప్రీత్ బుమ్రా:
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ఏళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. 2022-23 మధ్య ఏడాదికి పైగా మైదానంకు దూరమయ్యాడు. వెన్ను గాయం అయినప్పటి నుంచి సెలెక్టర్లు అతడిని ఆచితూచి ఆడిస్తున్నారు. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ చివర్లో గాయపడి 3-4 నెలలు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 మధ్యలో పునరాగమనం చేశాడు. ఆపై తక్కువగా మ్యాచులు ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌లో మూడు టెస్టులే ఆడిన బుమ్రా.. ఆస్ట్రేలియా పర్యటనకు విశ్రాంతినిచ్చారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ ఆడట్లేదు. ఐసీసీ ఈవెంట్స్ ఉంటే.. అతడికి ముందు సిరీస్‌లో రెస్ట్ ఇస్తున్నారు.
మహ్మద్ షమీ:
సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సమస్యల వల్ల జట్టుకు దూరమయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది పునరాగమనం చేసినా.. ఒక్క మ్యాచ్ ఆడలేదు. షమీ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. వయసు కారణంతో కూడా అతడిని బీసీసీఐ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. షమీ మరలా భారత జట్టుకు ఆడడం దాదాపుగా అనుమానమే. ఇక అతడు వీడ్కోలు పలకడమే ముగిలుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రిషబ్ పంత్:
టెస్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురై ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది మైదానంలోకి తిరిగొచ్చి కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాత పంత్ బయటికొచ్చే లోపే ఇంగ్లాండ్‌తో సిరీస్లో గాయపడ్డాడు. పాదానికి తీవ్ర గాయమై రెండు నెలలకు పైగా ఆటకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెండు టెస్టుల్లో అతడు పెద్దగా ప్రభావం చూపలేదు.
శుభ్‌మన్ గిల్:
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెడ నొప్పి తలెత్తింది. ఫిజియో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రెండో టెస్టులో కూడా ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కూ సైతం దూరమయ్యాడు. గిల్ ఫిట్‌నెస్ ఎప్పుడు సాధిస్తాడో స్పష్టత లేదు. మెడ నొప్పి సమస్య తీవ్రమైనదే అని తెలుస్తోంది. ఓ యువ క్రికెటర్‌కు ఇలాంటి గాయం తలెత్తడం ఇదే మొదటిసారి.
శ్రేయస్ అయ్యర్:
వన్డేల్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా కింద పడ్డ అతడి కడుపు లోపల గాయమైంది. చిన్న గాయమే అనుకున్నా.. ఏకంగా ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ప్రాణాలకే ముప్పు తెచ్చే గాయం అని డాక్టర్లు చెప్పారు. శ్రేయస్ ఫిట్‌నెస్ సాధించడానికి మూడు నెలలకు పైగానే సమయం పడుతుందని సమాచారం. శ్రేయస్ మళ్లీ ఐపీఎల్ 2026లోనే ఆడుతాడని తెలుస్తోంది. గతంలో కూడా శ్రేయస్ వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు.
హార్దిక్ పాండ్యా:
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స తర్వాత గతంలో మాదిరి బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. పేసర్ ఆకాశ్ దీప్.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా గాయాల బారిన పడిన వారే.