IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో రాణించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు మొండిచేయి ఎదురైంది. అతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్‌లకు జట్టులో చోటు లభించింది. షమీ మినహా టీ20 ప్రపంచకప్ స్టాండ్ బై ఆటగాళ్లందరినీ సెలక్టర్లు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు.
ఈ సిరీస్ కోసం కొన్ని కొత్త ముఖాలకు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ముఖేష్ కుమార్, రజత్ పాటిదార్ జాతీయ జట్టులో అరంగేట్రం చేయనున్నారు. ఆసియా కప్‌లో విఫలమైన అవేష్ ఖాన్‌తో పాటు మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. కాగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అక్టోబరు 6న తొలి వన్డే జరగనుంది. అక్టోబరు 9న రెండో వన్డే, అక్టోబరు 11న మూడో వన్డే జరగనున్నాయి.
టీమిండియా వన్డే జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.