Virat Kohli: ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కోహ్లీ తన పేరు మార్చుకున్నాడని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం అత్యంత పకడ్బందీగా, సీక్రెట్‌గా జరిగింది. భారత క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఈ వివాహానికి పిలవలేదు. ఈ పెళ్లి కోసం కోహ్లీ, అనుష్క పేర్లు మార్చుకున్నారని తాజాగా బహిర్గతమైంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ వెల్లడించింది.
Read Also: Mobile Explode: గేమ్స్ ఆడుతుండగా పేలిన సెల్ ఫోన్
తాము 2017లో పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడు ఫేక్ నేమ్స్ వాడామని అనుష్క శర్మ వెల్లడించింది. విరాట్ కోహ్లీ తన పేరును రాహుల్‌గా మార్చుకున్నాడని.. తన పేరును ఐశ్వర్యగా మార్చుకున్నట్లు ఆమె వివరించింది. ఎందుకంటే తమ గురించి ఇటలీలోని హోటల్ యాజమాన్యానికి కూడా తెలియకూడదని జాగ్రత్త పడ్డామని అనుష్కశర్మ చెప్పింది. కోహ్లీ పెళ్లి అని ప్రపంచానికి తెలిస్తే మీడియా, అభిమానుల హడావుడి ఎక్కువగా ఉంటుందని ఈ నాటకం ఆడినట్లు తెలిపింది. అభిమానుల హడావుడి ఉండవద్దనే క్రికెట్ ప్రభావం తక్కువగా ఉండే ఇటలీని తమ వివాహానికి వేదికగా ఎంచుకున్నామని అనుష్కశర్మ చెప్పుకొచ్చింది. కాగా ఈరోజు విరుష్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.