టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. బుధవారం నాడు క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఎందుకంటే అతడు తొలిసారిగా తండ్రయ్యాడు. భువనేశ్వర్ భార్య నుపుర్ నగర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2017 నవంబర్ 23న వీరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివాహం జరిగింది. నాలుగో వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజే భువీ భార్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం 9 గంటలకు పాప పుట్టినట్లు భువీ కుటుంబసభ్యులు వెల్లడించారు.
Read Also: శ్రేయాస్ ఆడుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన రహానే
కాగా టీమిండియా తరఫున 2012లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఆ తర్వాత జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 119 వన్డేలు, 55 టీ20లు, 21 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భువనేశ్వర్ ఆడటం లేదు. ఇటీవల మూడు టీ20 సిరీస్‌లో ఆడిన అతడు మూడు మ్యాచ్‌లలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.