DRS Controversy in South Africa vs Bangladesh Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్‌ఎస్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘డెడ్ బాల్ రూల్’ కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. దాంతో డెడ్ బాల్ రూల్ దక్షిణాఫ్రికాకు వరంగా మారగా.. బంగ్లాకు శాపంగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. ఒక దశలో చేదించేలా కనిపించింది. చివరి నాలుగు ఓవర్లలో బంగ్లాకు 27 పరుగులు అవసరమయ్యాయి. 17వ ఓవర్‌లో ప్రొటీస్ పేసర్ బార్ట్‌మన్ వేసిన రెండో బంతి బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా ప్యాడ్లను తాకి.. స్టంప్స్ వెనుక నుంచి బౌండరీ వెళ్లింది. వెంటనే దక్షిణాఫ్రికా జట్టు ఎల్బీకి అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.
Also Read: Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
మహ్మదుల్లా ఎల్బీపై బంగ్లాదేశ్ డీఆర్‌ఎస్ కోరింది. రిప్లైలో మహ్మదుల్లా నాటౌట్ అని తేలింది. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పటికీ.. అప్పటికే ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించడడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బంగ్లా స్కోరుకు ఆ బౌండరీ జత కాకుండా పోయింది. సరిగ్గా ఇదే నాలుగు పరుగుల తేడాతో బంగ్లా ఓడిపోవడంతో.. ఇప్పుడు ఈ డీఆర్‌ఎస్ నిర్ణయం నెట్టింట చర్చనీయాంశమైంది. తర్వాతి ఓవర్లో (రబాడ బౌలింగ్‌లో) తౌహిద్, మహ్మదుల్లా ఔటవ్వడం బంగ్లా కొంపముంచింది. మొత్తంగా బంగ్లా దురుదృష్టవశాత్తు మ్యాచ్‌ను కోల్పోయింది.