Kane Williamson Leave New Zealand Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీ ఫైనల్స్‌కు వెళ్లకుండా ఇంటిదారి పట్టింది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-సీలో ఉన్న కివీస్.. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చేతిలో 84 పరుగుల ఘోర పరాజయం ఎదుర్కొంది. వెస్టిండీస్‌పై 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆపై ఉగాండ, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచినా ఫలితం లేకుండా పోయింది.
Also Read: Rohit Sharma Trolls: రెండు నిమిషాల ‘మ్యాగీ మ్యాన్’ అని రోహిత్ శర్మను ట్రోల్ చేశారు!
కేన్ విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలను చూస్తే త్వరలోనే రిటైర్మెంట్ ఇచ్చేలా అనిపిస్తోంది. అయితే తాను మూడు ఫార్మాట్‌లలో ఆడతానని పరోక్షంగా చెప్పాడు. న్యూజిలాండ్ తరఫున ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తుంటానని, కివీస్ టీంకు ఇంకా ఏదైనా చేయాలనే కోరిక తనలో ఉందని చెప్పాడు. ఇక తన కెప్టెన్సీలో కేన్ ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ 2021లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపిన కేన్.. 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకల్లో కివీస్‌ను ఫైనల్‌కు చేరాడు.