Prize money division for the Team India by the BCCI: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన చెక్కును గత గురువారం (జూన్ 4) వాంఖడే స్టేడియంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో టీమిండియాకు బీసీసీఐ అందజేసింది. పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్స్, కోచింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లగా.. ఎవరికి ఎంత దక్కుందని అందరి మదిలో ఉంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.
భారత జట్టులోని 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు దక్కనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్స్ కూడా రూ.5 కోట్లు అందుకుంటారు. ప్రపంచకప్‌లో ఆడని సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్, యశస్వి జైస్వాల్‌లకు కూడా రూ.5 కోట్లు దక్కనున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా రూ.5 కోట్లు అందుకోనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు తలో రూ.2.5 కోట్లు దక్కనున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరు రూ.కోటి అందుకోనున్నారు.
Also Read: Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 రోజుల్లో ఇదే మొదటిసారి!
సహాయక సిబ్బందిలో ఉన్న ఒక్కొక్కరు రూ.2 కోట్లు అందుకుంటారు. సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఉన్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌కు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికైన ఒక్కొక్కరు రూ.కోటి అందుకోనున్నారు. రింకు సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు రిజర్వ్ ప్లేయర్స్‌గా వెళ్లిన విషయం తెలిసిందే.