KL Rahul Marraige: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మేరకు చెట్టాపట్టాలేసుకుని వీళ్లిద్దరూ తిరుగుతున్నారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఈ విషయంపై తాజాగా హీరో సునీల్ శెట్టి స్పందించారు. కేఎల్ రాహుల్‌తో తన కుమార్తె అతియా శెట్టి పెళ్లి జరుగుతుందని.. కానీ అది ఇప్పుడే కాదని వెల్లడించారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ టీమిండియా పర్యటనలతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడని, పెళ్లి చేసుకోవడానికి అతడికి ఖాళీ సమయం లేదని చెప్పారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇద్దరికీ విరామం దొరికినప్పుడే వాళ్ల పెళ్లి జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క రోజు విరామం లభించినంత మాత్రాన పెళ్లి చేసేయలేం కదా అని సునీల్ శెట్టి సమాధానం ఇచ్చారు.
Read Also: Emotions Affect Your Health: భావోద్వేగాలు.. శరీరానికి ఎలా హాని చేస్తాయి?
ఈ ఏడాది కేఎల్ రాహుల్‌కు 12 రోజుల విరామం మాత్రమే ఉందని.. ఇంత తక్కువ సమయంలో పెళ్లి చేయడం కష్టమని సునీల్ శెట్టి అన్నారు. ఈ నేపథ్యంలో వివాహానికి తగినంత సమయం లభించినప్పుడు ప్లాన్ చేస్తామని స్పష్టం చేశారు. రాహుల్ తల్లిదండ్రులు ఇటీవల అతియా కుటుంబాన్ని కలవడానికి ముంబైకి వచ్చారు. పెళ్లి తర్వాత రాహుల్, అతియా ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారు. ఈ నూతన ఇంటి గృహప్రవేశం కూడా ఇటీవలే పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కేఎల్ రాహుల్, అతియాశెట్టి తల్లిదండ్రులు నిర్వహించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కేఎల్ రాహుల్ తన భార్యతో ఈ ఇంట్లోనే కాపురం ఉండనున్నట్లు సమాచారం. కాగా గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్-అతియా శెట్టి ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధం గురించి ఇప్పటి వరకు బహిర్గత పరచలేదు. తమ రిలేషన్ గురించి గోప్యంగానే ఉంచుతూ బంధాన్ని కొనసాగిస్తున్నారు.