భూటాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం యేషే టీ20 క్రికెట్ చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో యేషే అద్భుత ప్రదర్శన చేశాడు. గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో యేషే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండటం మరో విశేషం. అంతర్జాతీయ టీ20లు, టీ20 లీగ్‌ల్లోనూ ఇప్పటివరకు ఈ ఫీట్ ఏ బౌలర్ నమోదు చేయలేదు.
22 ఏళ్ల సోనం యేషే తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. యేషే మూడో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చి తొలి బంతికే ఫ్యో వైను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో లిన్ ఆంగ్, కె కె లిన్ తూ వికెట్లను కూడా పడగొట్టి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. తన రెండో ఓవర్‌లో ఖిన్ ఆయేను అవుట్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీసిన యేషే.. చివరి ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భూటాన్ తొలుత బ్యాటింగ్ చేసి 127/9 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మయన్మార్.. యేషే దెబ్బకు 45 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇప్పటి వరకు పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే 7 వికెట్లు తీశారు. మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఇడ్రస్ (చైనాపై 7/8 – 2023), బహ్రెయిన్ బౌలర్ అలీ దావూద్ (భూటాన్‌పై 7/19 – 2025) ఈ ఘనత సాధించారు. అలాగే టీ20 క్రికెట్లో మొత్తంగా చూస్తే.. కొలిన్ అకర్మన్, టాస్కిన్ అహ్మద్ మాత్రమే 7 వికెట్లు తీశారు. మహిళల టీ20 క్రికెట్‌లో ఇండోనేషియాకు చెందిన రోహ్మాలియా 2024లో మంగోలియాపై 7/0 గణాంకాలతో రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు 8 వికెట్లతో సోనం యేషే ఆ రికార్డులన్నింటినీ అధిగమించాడు.
Also Read: AP Cabinet: పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి?.. సీఎం చంద్రబాబుకు మంత్రి ప్రశ్న!
2022 జూలైలో మలేషియాపై టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యేషే.. ఆ మ్యాచ్‌లో 3/16 గణాంకాలతో మెరిశాడు. ఇప్పటి వరకు అతడు 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు సాధించి.. భూటాన్ క్రికెట్‌కు కీలక బౌలర్‌గా ఎదిగాడు. సోనం యేషే సాధించిన ఈ అద్భుత ఘనత టీ20 క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ రికార్డు మరో బౌలర్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.