Shreyas Iyer Unhappy Despite Series Win: కొంతకాలం నుంచి ఫామ్‌లేమితో బాధపడుతోన్న శ్రేయస్ అయ్యర్.. వెస్టిండీస్ సిరీస్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ అర్థశతకాలతో సత్తా చాటాడు. తొలి వన్డే 54, రెండో వన్డేలో 63 పరుగులు చేసి.. రెండు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే.. రెండో మ్యాచ్‌లో మాత్రం తాను ఔటైన విధానమే తనని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆవేదన చెందాడు. చివరిదాకా ఉంటాననుకుంటే, అందుకు భిన్నంగా జరిగిందంటూ విచారం వ్యక్తం చేశాడు.
‘‘నేను సాధించిన పరుగులతో నేను సంతోషంగానే ఉన్నాను. కానీ, నేను ఔటైన విధానమే నన్ను నిరాశ పరిచింది. జట్టుకి విజయాన్ని అందించేంతవరకూ క్రీజులోనే ఉంటానని అనుకున్నాను. కానీ, దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాను’’ అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. అయితే.. మూడో వన్డేలో మాత్రం తాను శతకం చేస్తానని భావిస్తున్నానని నమ్మకం వెలిబుచ్చాడు. ఇదే సమయంలో మ్యాచ్ విజయంపై శ్రేయస్ మాట్లాడుతూ.. వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో సంజూ మంచి ఇన్నింగ్స్ ఆడాడని, ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడని పేర్కొన్నాడు. చివర్లో అక్షర్ పటేల్ గొప్ప ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడని తెలిపాడు.
కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, నిర్ణీత 50 ఓవర్లలో 311/6 స్కోర్ చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్మన్లలో ఓపెనర్లు హోప్ (115), కైల్ మేయర్స్ (39)తో పాటు బ్రూక్స్ (35), నికోలస్ పూరన్ (74) బాగా రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్.. మొదట్లో కాస్త తడబడినా, ఆ తర్వాత శుభ్మన్ (43), శ్రేయస్ (63), సంజూ (54), హూడా (33)లతో పాటు చివర్లో అక్షర్ (64) చెలరేగడంతో.. రెండు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.