కూటమి ప్రభుత్వానికి హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ.. గణాంకాలు బయటపెట్టిన జగన్..
“హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హైప్ తప్ప పనితీరు లేదని ఆరోపిస్తూ, ఆర్థిక గణాంకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఎక్స్ (X) వేదికగా గణాంకాలు బయటపెట్టారు.. చంద్రబాబు విజన్ గురించి పెద్దగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవ పనితీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని చెబుతూ, కృత్రిమ GSDP గణాంకాలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న భ్రమను ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతంగా, జాతీయ వృద్ధి 9.8 శాతంగా ఉందని ప్రకటించిందని జగన్ గుర్తు చేశారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతం, జాతీయ వృద్ధి 8 శాతం మాత్రమేనని అంచనా వేస్తోందని తెలిపారు. 2023–24, 2024–25 రెండేళ్ల కాలానికి కలిపి రాష్ట్ర GSDP CAGR 11.09 శాతమని ప్రభుత్వం చెబుతోందని, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్న ప్రచారం జరుగుతోందని అన్నారు. అయితే ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావని, పూర్తిగా చంద్రబాబు కార్యాలయం తయారు చేసినవేనని జగన్ ఆరోపించారు. నిజంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంతగా ఉంటే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరగాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రేపు సభకు వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10: 30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటసేపు స్పీచ్ ఉండే అవకాశం ఉంది. ఇక, రేపు మార్నింగ్ 11: 30 గంటలకి బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక, బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలో జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీ కీలక నేతలు కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటీవల వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సభలో నిరసన తెలపాలా అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో వైసీపీ అనుసరించాల్సిన తుది వ్యూహంపై స్పష్టత రానుంది. గత ఏడాది కూడా బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగ సమయంలో అసెంబ్లీకి హాజరైన జగన్, ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు పవన్ కల్యాణ్ ఆసరా.. తన జీతం నుంచి ప్రతి నెలా ఆర్థిక సాయం..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరగా నిలిచారు.. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న పవన్ కల్యాణ్.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారి దుస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన పవన్ కల్యాణ్‌ని కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున.. ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
FSL ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేస్తున్నాం..
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయనే అనుమానాల నేపథ్యంలో, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, కేసుల విచారణ ఏ దశలో ఉందనే విషయాలపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ లోని సర్వర్ రూమ్‌లు పూర్తిగా కాలిపోయాయని డీజీపీ వెల్లడించారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ సర్వర్లకు ఎటువంటి బ్యాకప్ వ్యవస్థ అందుబాటులో లేదు. “సర్వర్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. డేటా బ్యాకప్ లేకపోవడం వల్ల కొంత సమాచారం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగి, కాలిపోయిన సర్వర్ల నుండి డేటాను తిరిగి వెలికితీసే (Retrieve) ప్రయత్నాలు చేస్తోంది” అని ఆయన వివరించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
రేపే పోలింగ్.. వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పర్వం ముగియడంతో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రేపు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2,996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు తన హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవును (Paid Holiday) ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు , ఫ్యాక్టరీల్లో పనిచేసే వారు కూడా ఓటు వేసేందుకు వీలుగా కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో సుమారు వేల సంఖ్యలో సిబ్బంది పాల్గొంటుండగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచి వంటివి. రేపు జరగనున్న పోలింగ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా, 16న మేయర్ , చైర్మన్ల పరోక్ష ఎన్నిక జరగనుంది.
రైతన్నలకు శుభవార్త.. PM కిసాన్ డబ్బులు అకౌంట్‌లో ఎప్పుడు పడుతాయంటే?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర విడుదల చేసే డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడుతాయని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు రూ.2 వేలు బదిలీ చేయవచ్చని అంటున్నారు. ఈ విడత ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండవ వారంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని విడుదల చేయలేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఇస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఒకేసారి చెల్లించదు. కానీ ఒక్కో దఫాలో రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తుంది. ఈ డబ్బును DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి రైతు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందరు.
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి దారుణహత్య..
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యలు ఆగడం లేదు. బంగ్లా సార్వత్రిక ఎన్నికలకు 48 గంటల మందు హిందూ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. మైమెన్‌సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి ఆయన దుకాణంలోనే కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని త్రిషల్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని బోగర్ బజార్ లో బియ్యం వ్యాపారిగా, మెసర్స్ భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజ్ యజమాని సుషేన్ చంద్ర సర్కార్(62)గా గుర్తించారు. ఇతను ఇదే ప్రాంతంలోని సౌత్‌కాండ గ్రామంలో నివసిస్తున్నాడు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ సంఘటన రాత్రి 11.00 గంటల ప్రాంతంలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసినప్పుడు సర్కార్ తన దుకాణం లోపలే ఉన్నాడు. హత్య తర్వాత దుండగులు షటర్ దించి, మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. త్రిశల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ ముహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్ ఈ సంఘటనను ధృవీకరించారు. దుండగులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. హత్య వెనక కారణాలు ఇంకా నిర్ధారించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యూ-టర్న్ డ్రామా.. పాకిస్తాన్‌ను ఐసీసీ ఎలా దారికి తెచ్చింది..?
టీ20 వరల్డ్ కప్ వివాదానికి తెర పడింది. ఎట్టకేటకు పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుంది. బంగ్లాదేశ్ బహిష్కరణకు సంఘీభావంగా తాము కొలంబో వేదికగా ఈ నెల 15న ఇండియాతో జరగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించింది. ఎట్టకేలకు ఆర్థిక లెక్కలు, ఆంక్షలు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని చివరకు భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మొత్తం పరిణామాల్లో ఐసీసీ కీలకంగా వ్యవహరించింది. పాకిస్తాన్ దారికొచ్చేలా పనిచేసింది. ఐసీసీతో పాటు తోటి సభ్య దేశాల బోర్డులు కూడా పాక్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. పాక్ బాయ్ కాట్ చేస్తే ఆ దేశ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టంతో పాటు ఇతర దేశాల బోర్డుల ఆదాయం కూడా దెబ్బతింటుందని చెప్పింది. చివరకు ఏ బంగ్లాదేశ్ కోసం పాక్ బాయ్ కాట్ నాటకాన్ని ఆడిందో, చివరకు ఆ బంగ్లాదేశ్ భారత్‌తో మ్యాచ్ ఆడాల్సిందిగా పాక్‌ను కోరింది. భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ భారత్‌లో ఆటడానికి నిరాకరించింది. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బంగ్లాను బహిష్కరిస్తే తాము కఠిన నిర్ణయం తీసుకోవచ్చని పాక్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ అన్నారు. ఐసీసీ బెదిరింపుల నుంచి చర్చలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ ముబాషిర్ ఉస్మానీ, మోహ్సీన్ నఖ్వీతో వరసగా సమావేశాలు నిర్వహించారు. ప్రసార ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని, ఇతర బోర్డుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.
వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ – హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది సక్సెస్‌పుల్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి దర్శకత్వంలో వచ్చిన F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు జోడీ తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చూట్టినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 2026 నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ దాదాపు ఫిక్స్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కనిపించబోతున్నారని సమాచారం. ఫహద్ ఫాసిల్ – వెంకీ మామా మధ్యలో వచ్చే సన్నివేషాలు ఈ చిత్రానికే ప్రత్యేకంగా నిలుస్తాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చనే టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా హిట్ మిషన్ అనిల్ రావిపూడి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నిజానికి అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయకుండా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ఈ సినిమాను విడుదల చేయడానికి అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చేస్తు్న్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘ఆదర్శ కుటుంబం – AK 47’ అనే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే అనిల్ డైరెక్షన్‌లో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.
టాలీవుడ్‌లో విలన్స్‌గా మారుతోన్న మాలీవుడ్ హీరోస్
మాలీవుడ్ హీరోయిన్స్‌నే కాదు.. హీరోలను టాలీవుడ్ పిలుస్తోంది. ఇక్కడ విలన్స్‌గా ఆఫర్స్ కట్టబెడుతోంది. అక్కడ టాప్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్స్ కొందరు.. బిగ్ స్కేల్ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి వెనకాడటం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు.. పాన్ ఇండియా ఐడెంటీటీ కోసం ఇటు వైపుగా చూస్తున్నారు. ఇప్పటికే పుష్పతో బన్వర్ సింగ్ షెకావత్‌గా రిజిస్టర్ అయ్యాడు ఫహాద్ ఫజిల్. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్‌తో ఫేమ్ తెచ్చేసుకున్నాడు. నెక్ట్స్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ గతంలో తెలుగులో సినిమాలు చేసినా రాని ఐడెంటీటీ.. సలార్‌తో సాధించాడు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా వరద రాజ మన్నార్ పాత్రలో కేక పుట్టించాడు. నెక్ట్స్ గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతోన్న వారణాసిలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రణ కుంభగా యాంటోగనిస్టుగా కనిపించబోతున్నాడు. జక్కన్న తన ప్రతి సినిమాలో హీరోతో పాటు విలన్ క్యారెక్టర్స్‌ను హైలెట్ చేస్తుంటారు. వారణాసిలో కూడా పృధ్వీ రోల్ ఎలా ఉండబోతోందో రీసెంట్లీ రిలీజ్ చేసిన రణ కుంభ లిరికల్ వీడియోలోనే చెప్పకనే చెప్పేశాడు జక్కన్న. టాలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకునేందుకు వచ్చేస్తోన్న మరో మల్లూవుడ్ స్టార్ హీరో టొవినో థామస్. ఫోరెన్సిక్, మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎం వంటి ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకకులకు చేరువైన టొవినో.. నెక్ట్స్ ప్రశాంత్ నీల్- తారక్ మూవీలోకి ఎంటర్ కాబోతున్నాడు. తారక్‌తో తలపడేందుకు సిద్ధమౌతున్నాడు. జోర్దాన్‌లో యంగ్ టైగర్ అండ్ మిన్నల్ మురళిపై హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు నీల్. నెల రోజుల పాటు షూట్ జరగనుందట. దశాబ్దకాలం క్రితం వరకు మాలీవుడ్ అంటే మమ్ముట్టి, మోహన్ లాల్ మాత్రమే టాలీవుడ్‌కు తెలుసు.. అదీ స్టార్ హీరోలుగా. కానీ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్. విలన్స్‌గా బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఆఫర్స్ కొల్లగొడుతున్నారు మల్లూ స్టార్ హీరోస్.