Common Wealth Games 2026: 2026లో కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగనున్నాయి. ఈ మేరకు 2026లో జరిగే ఎడిషన్‌లో ఉండబోయే స్పోర్ట్స్ లిస్ట్‌ను కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ జాబితాలో 2022లో లేని షూటింగ్‌ను నిర్వాహకులు చేర్చారు. అయితే రెజ్లింగ్‌ను మాత్రం తొలగించారు. 2026లో మొత్తం 20 క్రీడలు, 26 క్రీడాంశాలు ఉండనున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లోనే భారత్‌కు అత్యధిక పతకాలు వచ్చాయి. వీటిలో ఆరు బంగారు, 1 వెండి, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో భారత క్రీడాకారులు, అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం కామన్వెల్త్ చరిత్రలో ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చింది షూటింగ్ విభాగంలోనే కావడం గమనించాల్సిన విషయం. రెజ్లింగ్ రెండో స్థానంలో ఉంది.
Read Also: Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా హవా.. ఒక్క ఓటమి కూడా లేదు..!!
ఇప్పటివరకు కామన్వెల్త్ క్రీడల చరిత్రలో షూటింగ్ విభాగంలో భారత్‌కు 135 పతకాలు వచ్చాయి. వీటిలో 63 బంగారు పతకాలు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న రెజ్లింగ్‌లో 114 పతకాలు వచ్చాయి. వీటిలో 49 బంగారు పతకాలు ఉన్నాయి. మరోవైపు ఆర్చరీకి కూడా 2026లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కలేదు. కాగా 2026 గేమ్స్‌లో షూటింగ్, రెజ్లింగ్‌లను చేర్చాలని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోరింది. ఈ రెండు క్రీడల వల్ల ఈవెంట్ వైభవం మరింత పెరుగుతుందని ఆకాంక్షించింది. అయితే షూటింగ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఫెడరేషన్ రెజ్లింగ్‌ను మాత్రం పక్కనపెట్టింది.