సెంచరీలకు అతను పెట్టింది పేరు. రికార్డులకు అతను రారాజు. చేసింగ్ లో అతను బ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ పక్కా అనుకొనే ఫామ్ అతనిది అతనే రన్ మిషన్ విరాట్ కోహ్లీ. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుత ఫామ్ ని చూసి విరాట్ కోహ్లీని విమర్శించడం ఆపాలని పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ మాజీ క్రికెటర్లకు సూచించాడు. విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెటరని, అతనికి కనీస గౌరవం ఇవ్వాలని కోరాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోహ్లీ విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 22.73 సగటుతో 341 పరుగులు మాత్రమే చేయగా.. స్ట్రైక్ రేట్ 115.99గా ఉంది.
విరాట్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డానియల్ వెటోరి, ఇయాన్ బిషప్‌లు విమర్శలు గుప్పించారు. ఆర్‌సీబీ వైఫల్యానికి విరాట్ చెత్త బ్యాటింగే కారణమన్నారు. ఈ క్రమంలోనే అక్తర్ ఆ తరహా వ్యాఖ్యలు చేయవద్దని, చిన్న పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారని విరాట్‌కు అండగా మాట్లాడాడు.
‘దిగ్గజ ఆటగాళ్లంతా తమ అభిప్రాయాలు చెప్పే ముందు చిన్న పిల్లలు తమను చూస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. విరాట్ కోహ్లీ గురించి మంచి చెప్పండి. అతనికి కనీస గౌరవం ఇవ్వండి. ఓ పాకిస్థానీగా చెబుతున్నా.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను 110 సెంచరీలు చేయాలని కోరుకుంటున్నా. 45 ఏళ్ల వరకు కోహ్లీ ఆడాలని ఆశిస్తున్నా. ఈ కఠిన పరిస్థితులే నువ్వు 110 సెంచరీలు చేసేలా తీర్చిదిద్దుతాయి. విమర్శకులు నీ పనైపోయిందని రాస్తున్నారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు. ప్రపంచకప్‌లో ఓటమి ఎదురైతే.. నీ భార్య, కూతురు గురించి అసభ్యకరంగా ట్వీట్ చేస్తారు. నిన్ను ఘాటుగా విమర్శిస్తారు. పరిస్థితులన్నీ ప్రతీకూలంగా ఉంటాయి. అయితే వాటి నుంచి ధైర్యంగా బయటికి రా. విరాట్ కోహ్లీ ఎవరు అనే విషయాన్ని అందరికి తెలియజేయి’ అని అక్తర్.. కోహ్లీని కోరాడు.
విమర్శకులంతా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను చూసి నేర్చుకోవాలని షోయబ్ అక్తర్ సూచించాడు. సచిన్ ఎవర్నీ కూడా తన మాటలతో కించపరచడని, ప్రతీ ఒక్కరిని గౌరవిస్తాడని చెప్పాడు. ‘నేను చూసిన వారిలో సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప వ్యక్తి. దిగ్గజ క్రికెటర్ అయిన సచిన్ ఏనాడు కూడా ఇతర క్రికెటర్లను కించపరిచేలా ట్వీట్ చేయలేదు. ఇతర మాజీ క్రికెటర్లు కూడా ఇలానే మెచ్యూర్ కామెంట్స్ చేయాలి’ అని అక్తర్ కాస్త ఘాటుగానే సూచించాడు.