Shakib Al Hasan Withdraws Retirement: బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ యూ టర్న్ తీసుకున్నాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలనే తన కోరికను మరోసారి వ్యక్తం చేశాడు. షకీబ్ గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున ఆడలేదు. చివరిసారిగా 2024లో కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆడాడు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఆగస్టు 2024లో జరిగిన ఓ హత్య కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అతడు పాకిస్తాన్, భారతదేశంలో విదేశీ సిరీస్‌లు ఆడాడు కానీ.. బంగ్లాలో మాత్రం మ్యాచ్‌లు ఆడలేదు. షకీబ్ గతంలో అవామీ లీగ్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన అనంతరం మే 2024 నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి అతడు రాలేదు. తాజాగా స్వదేశానికి తిరిగి రావాలనే కోరికను షకీబ్ వ్యక్తం చేశాడు. ‘బియర్డ్ బిఫోర్ వికెట్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తాను మరలా అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నానని చెప్పారు. బంగ్లాదేశ్‌లో వీడ్కోలు సిరీస్ ఆడాలనుకుంటున్నానని, జట్టులో చోటు దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నానని చెప్పారు.
Also Read: Kohli-Rohit: రోహిత్-కోహ్లీలు ఇలానే రాణించాలని కోరుకుంటున్నా.. కోచ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘నేను అధికారికంగా అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ కాలేదు. నేను ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నాను. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి.. వన్డేలు, టెస్టులు, టీ20లతో కూడిన పూర్తి సిరీస్ ఆడి రిటైర్ కావడమే నా ప్రణాళిక. అంటే ఒకే సిరీస్‌లో అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతా. సిరీస్ టీ20లతో ప్రారంభమైనా లేదా టెస్టులు, వన్డేలతో ప్రారంభమైనా నాకు ఓకే. ఏదేమైనా నేను పూర్తి సిరీస్ ఆడి.. ఆపై రిటైర్ కావాలనుకుంటున్నాను. అదే నా కోరిక. నన్ను ఆదరించిన అభిమానులకు వీడ్కోలు చెప్పడానికి ఇది మంచి మార్గం’ అని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చెప్పారు.