త్వరలో సౌతాఫ్రికాతో జరగపున్న సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని తొలగించనున్నారా? అంటే దాదాపు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లో లేడన్న విషయం అందరికీ తెలుసు. అతడు సెంచరీ చేసి రెండేళ్ళ పైనే అవుతోంది. అప్పుడప్పుడు కొన్ని పర్వాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు కానీ, వింటేజ్ కోహ్లీని తలపించే భారీ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. మూడుసార్లు గోల్డెన్ డక్ అవ్వడమే కాదు, ఏ ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రతిభ కనబర్చలేదు.
ఈ నేపథ్యంలోనే విశ్రాంతి పేరుతో కోహ్లీపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని సమాచారం. సఫారీ సిరీస్‌కు భారత జట్టుని ఎంపిక చేయడానికి ముందు ఈ విషయాన్ని కోహ్లీకి చేరవేస్తారని తెలిసింది. షాక్‌కి గురి చేసే మరో విషయం ఏమిటంటే.. విశ్రాంతి తీసుకోవాలా, వద్దా అనే కోహ్లీ అభిమతాన్ని కూడా సెలెక్షన్ కమిటీ పట్టించుకునే స్థితిలో లేదట! ఎలాగైతే టెస్ట్ జట్టులో నుంచి రహానే, పుజారాలను తప్పించారో.. అదే ఫార్ములాను కోహ్లీ విషయంలో అమలు చేస్తారని వినికిడి. కొందరు విశ్లేషకులు సైతం, ఈ వార్తని నిజమేనని కన్ఫమ్ చేస్తున్నారు. మొత్తానికి.. విశ్రాంతిని సాకుగా చూపి, సెలెక్టర్లు కోహ్లిపై వేటు వేయనున్నారన్నమాట.
ఇదిలా ఉంటే, జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఐపీఎల్ ముగిసేనాటికి ప్రకటించే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్‌లు ఏయే తేదీన ఎక్కడెక్కడ జరగనున్నాయన్న వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
– తొలి టీ20 : జూన్ 9 (ఢిల్లీ)
– రెండో టీ20 : జూన్ 12 (కటక్)
– మూడో టీ20 : జూన్ 14 (వైజాగ్)
– నాలుగో టీ20 : జూన్ 17 (రాజ్‌కోట్)
– ఐదో టీ20 : జూన్ 19 (బెంగళూరు)