Rohit Sharma Reacts On Pakistan Tour For Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్‌లో నిర్వహిస్తే, టీమిండియా పాల్గొనదని బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు.. క్రీడా రంగంలో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! తటస్థ వేదికలపైనే ఆడుతామని, పాక్‌లో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టబోదని ఆయన తేల్చి చెప్పడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మండిపడింది. ఒకవేళ భారత్ పాక్‌కి రాకపోతే.. తాము కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోమని పీసీబీ ప్రకటించింది. ఆ బోర్డుతో పాటు పాక్ మాజీ ఆటగాళ్లైన కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ ఘాటుగా స్పందించారు. పాక్‌లో భారత్ పర్యటించకపోతే.. ఇకపై భారత్‌తో పాక్ ఆడదని అన్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారంపై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ప్రస్తుతం తమ దృష్టంతా టీ20 వరల్డ్‌కప్ టోర్నీపైనే ఉందని.. భవిష్యత్ టోర్నీల గురించి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. ‘‘ప్రస్తుతానికి మా దృష్టి టీ20 వరల్డ్‌కప్ టోర్నీపై ఉంది. ఈ టోర్నీ మాకు చాలా ముఖ్యమైంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై.. మేం ఇప్పుడు ఆందోళన చెందట్లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఆ నిర్ణయాలు బీసీసీఐ చూసుకుంటుంది. రేపు(ఆదివారం) పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ గురించే మా జట్టంతా ఆలోచిస్తోంది. దానికి ఎలా సన్నద్ధమవ్వాలి? ప్రత్యర్థి జట్టుని ఎలా ఎదుర్కోవాలి? అనే దానిపై ఫోకస్ పెట్టాం’’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. తుది జట్టుపై కూడా పూర్తి స్పష్టతతో ఉన్నామని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇదే సమయంలో పాక్‌తో జరిగే మ్యాచ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పాక్ బౌలింగ్ ఎంత సమర్థంగా ఉందో తమకు తెలుసని, అయితే తమకూ మంచి బ్యాటింగ్ అనుభవం ఉందని అన్నాడు. పాక్ బౌలింగ్ తమకు సవాల్ లాంటిదని, దాన్ని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. అన్ని విభాగాల్లో రాణించగలిగితే.. ఎలాంటి ప్రత్యర్థిని అయినా ఓడించొచ్చని ధీమా వ్యక్తం చేశాడు. అయితే.. రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు. పరిస్థితులు డిమాండ్ చేస్తే.. మ్యాచ్‌ని 10 ఓవర్లకు కుదిస్తారేమోనని అన్నాడు. అయితే.. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కోవడానికి భారత ఆటగాళ్లు సిద్ధంగానే ఉన్నారని చెప్పుకొచ్చాడు.