భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్‌కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు చెలరేగడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము లేకుండా గెలవలేం అని రోహిత్-కోహ్లీలు మరోసారి నిరూపించారని నెటిజెన్స్ అంటున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ ఆట అద్భుతం అని ప్రశంసించారు. రో-కోలు లేకుండా 2027 వన్డే వరల్డ్‌కప్ ప్రణాళికలు సఫలం కావన్నారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆట అద్భుతం. వన్డే ప్రపంచకప్ 2027లో వీరిద్దరూ ఆడాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరూ 20 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే ప్రత్యర్థుల విజయావకాశాలు తగ్గుతాయి. రాంచి వన్డేలో అదే జరిగింది. రో-కోలు బాగా బ్యాటింగ్ చేశారు. వీరి భాగస్వామ్యమే భారత జట్టును విజేతగా నిలిపింది’ అని చెప్పారు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కేవలం పరుగులు సాధించడం మీదే దృష్టి పెట్టలేదు. ఫిట్‌నెస్‌పై కూడా ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఇద్దరి ఫిట్‌నెస్ అద్భుతం. రో-కోలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. ఒకే ఫార్మాట్ ఆడుతూ రిథమ్ కొనసాగించడం చాలా కష్టం. కానీ ఇద్దరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వన్డే ప్రపంచకప్ 2027లో 1, 3 స్థానాలను రోహిత్, కోహ్లీలు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. రో-కోలు లేకుండా మనం కప్ గెలవలేం అని నా అభిప్రాయం’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ వివరించారు. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఇద్దరు మెగా టోర్నీలో ఆడడం పక్కా. రో-కోల కళ కూడా వన్డే ప్రపంచకప్ గెలవడమే అని తెలిసిందే.