స్వదేశంలో భారత్ జట్టు ఏడాది కాలంలో రెండు టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక స్వదేశంలో న్యూజీలాండ్ (0-3), దక్షిణాఫ్రికా (0-2) చేతిలో టీమిండియా వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. దాంతో గౌతీపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. అటు మాజీలు, ఇటు అభిమానులు ఏకిపారేస్తున్నారు. గంభీర్ కోచింగ్ శైలిపై అందరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు సంబంధించి ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, గంభీర్, జట్టు సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ కోచించ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ.. తాను గౌతమ్ గంభీర్‌ను సపోర్ట్ చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ‘గౌహతిలో టెస్టులో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. 95/1 నుంచి 130/7తో కష్టాల్లో పడింది. చూస్తుండగానే బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. టీమిండియా పేలవమైన జట్టు కాదు. మన బ్యాటర్లలో చాలా ప్రతిభ ఉంది. కాబట్టి ప్లేయర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. మన బ్యాటర్లు చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం భారత ఆటగాళ్లకు కొత్త కాదు. అందుకే కచ్చితంగా మరింత బాధ్యత తీసుకుని ఆడాలి’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
Also Read: Kane Williamson Return: లాంగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఎంట్రీ.. చరిత్ర సృష్టించిన కేన్ మామ!
కోచ్ గౌతమ్ గంభీర్‌కు మీరు మద్దతు ఇస్తున్నారా? అని ప్రశ్నించగా… ‘గౌతమ్ గంభీర్‌ను నేను సపోర్ట్ చేయను. 100 శాతం అతను కూడా బాధ్యత తీసుకోవాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. నేనే మొదటి బాధ్యతను తీసుకునేవాడిని. కానీ జట్టు సమావేశంలోని ఆటగాళ్లను అస్సలు వదిలిపెట్టను. ఎలా ఆడారు అని ఆటగాళ్లను కచ్చితంగా ప్రశ్నించేవాడిని రవిశాస్త్రి సమాధానం ఇచ్చారు. నివేదికల ప్రకారం కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ సహా పలువురు ఉన్నతాధికారులతో బీసీసీఐ ఓ సమావేశాన్ని షెడ్యూల్ చేసింది. టెస్టుల్లో కోచ్‌గా గంభీర్ పనిచేస్తున్న విధానంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, ఈ విషయంపై మాట్లాడేందుకు మీటింగ్ అని తెలుస్తోంది.