Ravi Shastri Counter On Virat Kohli Critism: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలం నుంచి ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే! దీంతో.. ఆయనపై తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కాస్త మెరుపులు మెరిపించాడే తప్ప, సెంచరీ చేసి వెయ్యి రోజులు పైనే అవుతోంది. ఈ క్రమంలోనే కోహ్లీ పనైపోయిందని, అతని స్థానంలో మరొక ఆటగాడ్ని తీసుకోవాలని కోరుతున్నారు. ఆ విమర్శకులకు తాజాగా భారత మాజీ కోచ్ రవిశాస్త్రి చురకలు అంటించారు. కోహ్లీ కేవలం ఒక్క ఆట సరిగ్గా ఆడితే చాలు.. అతడ్ని విమర్శిస్తున్న నోళ్లన్నీ మూతపడతాయంటూ గట్టి కౌంటర్ వేశారు.
‘‘గొప్పవాళ్లుగా పేరొందిన ఆటగాళ్లు..సరైన సమయంలో తామేంటో కచ్ఛితంగా నిరూపించుకుంటారు. ప్రస్తుతం కోహ్లీ కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి ఆసియా కప్ రూపంలో మంచి అవకాశం వచ్చింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అర్థశతకం చేసినా చాలు, అతడ్ని విమర్శిస్తున్న నోళ్లన్నీ మూత పడతాయి’’ అని రవిశాస్త్రి అన్నారు. కోహ్లీ కంటే ఫిట్‌గా భారత జట్టులో మరే క్రికెటర్ లేడని, తనొక యంత్రమని, ఒక్కసారి అతడు గట్టిగా ఫిక్స్ అయితే తిరుగు ఉండదని చెప్పారు. కోహ్లీ ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని, ఇప్పుడతను పరుగుల దాహంలో ఉన్నాడని పేర్కొన్నారు. ఆసియా కప్‌లో భాగంగా కోహ్లీ పాక్‌తో మ్యాచ్‌లో తప్పకుండా ఫామ్‌లోకి తిరిగొస్తాడని, హాఫ్ సెంచరీ చేస్తాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.. ఆగస్టు 27వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. శ్రీలంక – అఫ్గనిస్తాన్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవ్వనుంది. ఆ మరుసటి రోజే.. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సాధారణంగానే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉంటుంది. ఈసారి ఈ మ్యాచ్‌పై అంతకుమించి ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాదులు తొలిసారిగా తలపడుతున్నారు. మరి, ఈ పోరులో ఎలాంటి ఫలితాలు నమోదవుతాయో చూడాలి.